32.7 C
Hyderabad
April 27, 2024 02: 03 AM
Slider సంపాదకీయం

మాయరోగం కరోనా కాదు మరొకటి ఉంది

corona virus

గత నెలలో న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ లో 7,600 మంది భారతీయులు, 1,300 మంది విదేశీయులు హాజరైనట్టు గుర్తించామని ఈ కారణంగా దాదాపు 9 వేల మంది ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రమాదం అంచున ఉన్నారని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? తబ్లిగీ జమాత్ కోసం ఎవరు వెళ్లారు? వారు వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నారు? వారి నిత్యకృత్యం ఏమిటి అనే విషయాలపై ఆరాతీసి వారిని క్వారంటైన్ కు తరలించాలి. రాకపోతే బలవంతంగానైనా ఎత్తుకెళ్లాలి.

అంతకూ రాకపోతే ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించి అయినా సరే వారికి క్వారంటైన్ కు తరలించాలి. మీ వల్ల కాకపోతే కేంద్ర బలగాలను దించి ఈ పనులు చేయాలి. దేశంలోని సగం రాష్ట్రాలు ఈ పని చేయడం లేదు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో తేలికగా తీసుకుంటున్నాయి.

కేవలం ఓట్లతో ముడిపెట్టి ఈ అంశాన్ని చూస్తున్నారేమో తెలియదు కానీ గట్టిగా అడిగితే, బయటకు చెబితే ముస్లింలకు కోపం వస్తుందేమోనని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ముస్లింల ఓట్ల సంగతి దేముడెరుగు, ఈ కరోనా దెబ్బ ఎక్కువ తగులుతున్నది ఎవరికి?

తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారితో పరిచయం ఉన్నవారికి. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎవరికి నష్టం. వారి వారి ఓటు బ్యాంకులకే (రాజకీయ నాయకులు చూస్తున్న విధానం బట్టి ఈ వ్యాఖ్య చేయాల్సి వస్తున్నది) కదా చేటు జరుగున్నది?

వారి ఓటు బ్యాంకులు కాపాడుకోవడానికి అయినా ముస్లింలను కాపాడుకోవాలి కదా? సమస్యను వివరించి చెప్పకపోతే మీకే నష్టం, మీ ద్వారా దేశానికి నష్టం అని చెప్పి ఒప్పించాలి కదా? కొందరు తెలివిగా ముస్లిం మత పెద్దలు చెప్పాలి అంటున్నారు. ముస్లిం మత పెద్దలపై భారం వేయడం దేనికి?

రాజ్యాలను పాలిస్తున్నది మీరు కదా? వారి సంక్షేమం చూడాల్సింది మీరా? వారి మత పెద్దలా? అసలు ఈ సమస్యను మతంతో ముడిపెడుతున్నదే రాజకీయ నాయకులు. ప్రజలు ఎవరూ కూడా ఈ సమస్యను మత కోణంలో ఆలోచించడం లేదు. హిందువులు ఈ సమస్యను మతకోణంలో చూసి ఉంటే ఈసరికే మత కలహాలు వచ్చి ఉండాలి.

ఎక్కడా అలా జరగడం లేదు. భారత దేశంలో అలా జరగవు కూడా. సాటి వాడు హిందూ అయినా ముస్లిం అయినా కష్టాలలో ఆదుకోవడానికి అందరూ ముందుకు వచ్చే సంస్కృతి మనది. ఇప్పుడు తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చిన ముస్లింలు వారి కుటుంబ సభ్యులు, వారితో పరిచయం ఉన్న వారు మాత్రమే ప్రమాదంలో ఉన్నారు.

ముస్లింలు అందరూ కరోనా ప్రమాదంలో లేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఇచ్చిన ప్రకటన చూస్తే ఆయన దేనికోసం నిజాలు దాస్తున్నారో అర్ధం కావడం లేదు. ఆయన ఇతర మతాలను కరోనా రొంపిలోకి ఎందుకు లాగుతున్నారో అర్ధం కావడం లేదు. ‘‘మన దేశంలో అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేలు, లక్షల భక్తులున్న అనేక మంది, అన్ని మతాల్లోనూ పెద్దలున్నారు.

ఒక రవిశంకర్‌ గారి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గాని, జగ్గీవాసుదేవ్‌ గారి ఈషా పౌండేషన్‌లో గాని, మాతా అమృతానందమయి సభల్లో గానీ, లేదా ఒక పాల్‌ దినకరన్‌ గారి ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ, లేదా జాన్‌ వెస్లీ గారు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరికైనా ఈ పరిస్దితి రావచ్చు.

కాబట్టి ఇది ఎక్కడైన జరగవచ్చు. ఎక్కడ జరిగినా అదొక ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా కాకుండా దురదృష్టకర సంఘటనగానే చూడాలే తప్ప, ఓ మతానికో, ఒక కులానికో దాన్ని ఆపాదించి వారేదో తప్పుచేసినట్టుగా, నేరం చేసినట్లుగా, కావాలని చేసినట్లుగా చూపడం, చూపే ప్రయత్నం  ఎవ్వరూ కూడా చేయకూడదు.’’ ఇవీ యథాతధంగా ఆంధ్రప్రదేశ్ సిఎం అన్నమాటలు.

మతం రంగును కరోనాకు ఎవరు పూస్తున్నారు? బిజెపి వాళ్లా? ఆర్ఎస్ఎస్ వాళ్లా? ఎవరైనా ఎక్కడైనా అలాంటి స్టేట్మెంటు ఇచ్చారా? రవిశంకర్, జగ్గీవాసుదేవ్ జాన్ వెస్లీ … ఈ పేర్లు ఎందుకు? ఇలాంటి మత పరమైన ప్రస్తావనలు తీసుకురావడం ముఖ్యమంత్రికి తగదు.

‘‘ఆ ఆధ్యాత్మిక సమావేశానికి వచ్చిన ప్రతినిధుల్లో ప్రత్యేకించి విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండటం, ఆ మీటింగ్‌కు వెళ్లిన మన దేశస్తులు, మన రాష్ట్రం వారికి కూడా కరోనా సోకడం దురదృష్ణకరమైన పరిణామం. ఇదే సంఘటన ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలోనైనా జరగవచ్చు.’’ ఇవి ఆయన చెప్పిన మాటలు.

ఏ ఆధ్యాత్మిక సమావేశం? దాని పేరు చెప్పడానికి కూడా భయమేనా? లేక ఓట్ల రాజకీయమా? ఇలాంటి ప్రకటన వల్ల ఇప్పటి వరకూ మతం గురించి ఆలోచించని వారు కూడా ఆలోచించడం మొదలు పెడతారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి.

నిక్కచ్చిగా పని చేయాలి. సాధారణ సమయాల్లో ఎలా ఉన్నా ఇలాంటి ఆరోగ్య అత్యాయక పరిస్థితుల్లో సన్నాయి నొక్కులు నష్టం తెప్పిస్తాయి తప్ప మేలు చేయవు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు సిద్దిపేటలో ఒక సమావేశంలో మాట్లాడుతూ

‘‘ ఎయిడ్స్ లాంటి వ్యాధి సోకితే తప్పు చేశాం కాబట్టి బయటకు చెప్పు కోవడానికి సిగ్గుపడవచ్చు. ఇది కరోనా. మన ప్రమేయం లేకుండానే వస్తున్నది. అదీ కాకుండా మీరేం తప్పు చేయలేదు. మత సమావేశం ఉంది అంటే వెళ్లి వచ్చారు. అక్కడ ఈ వైరస్ సోకింది. మీ తప్పేం లేదు.

ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే ఈ వైరస్ అందరికి సోకకుండా చూడటం. అందుకే మీరు స్వచ్ఛందంగా క్వారంటైన్ కు వెళ్లండి. పోలీసులకు, వైద్య అధికారులకు సహకరించండి. మీ తప్పు లేకుండా వచ్చిన వ్యాధి ఇది. మిమ్ములను ఎవరూ ఏమీ ఆక్షేపించడం లేదు.’’

ఇదీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడి మాట. ప్రజలను కన్విన్స్ చేసే తీరు. ఇలాంటి రాజకీయ నాయకుడిని స్టేట్స్ మెన్ (రాజనీతిజ్ఞుడు) అంటారు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

Olx మోసాలపై అవగాహన కు షార్ట్ ఫిల్మ్ విడుదల

Satyam NEWS

బీజేపీలో పెద్ద ఎత్తున చేరిన గ్రామీణ యువకులు

Satyam NEWS

నూతన సంవత్సర వేడులక బహిష్కరణ

Satyam NEWS

Leave a Comment