37.2 C
Hyderabad
April 26, 2024 20: 25 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

ఇక్కడ ఒక్కో అధికారి నెల ఆదాయం పది లక్షలు

town planing

ఇదేదో ఊహించి చెబుతున్నది కాదు. అక్షరాలా నిజం. ఎల్ బి నగర్ మునిసిపల్ సర్కిల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల తీరు అవినీతి మయం. అక్రమ కట్టడాలు నిర్మించేవారికి ఈ మునిసిపల్ సర్కిల్ స్వర్గధామంగా మారిపోయింది. సెల్లార్లు, పెంట్ హౌస్ ల పేరుతో ఫ్లోర్లకు ఫ్లోర్లు కట్టేస్తున్నా ఎవరూ ఏమీ అనరు. నిబంధనలు అతిక్రమించినా ఫర్వాలేదు. కానీ ఒక్కటే కండిషన్. టౌన్ ప్లానింగ్ అధికారుల జేబు నింపాలి. అంతే. టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతితో ఎల్ బి నగర్ సర్కిల్ లో మురికి కూపాలు తయారవుతున్నాయి.

ఉన్న మౌలిక సదుపాయాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరిగితే అంతా సజావుగా ఉంటుంది కానీ అవినీతి అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇచ్చేయడంతో భవనాలు నిర్మించే వారు కూడా అడ్డగోలుగా కట్టేస్తున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఒక్కో అధికారి కి నెలకు 10 లక్షలు అడ్డదారి ఆదాయం ఉంటుందని అంచనా. ప్లానర్ల కనుసైగల్లో వివాద ఫైళ్లపై సంతకాలు చేసేస్తున్నారు. అమామ్యాలు తీసుకోవడానికి ఒక్కో అధికారికి ఒక్కో ప్రయివేటు వ్యక్తి ఉంటాడు.

అతను వసూలు చేసి ఇస్తుంటే వారు తీసుకుంటారన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే హస్తినాపురం కథ చూద్దాం: ఈ సర్కిల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా ఈ ఏరియా చైన్ మెన్ కు చెప్పాలి. చైన్ మెన్ వచ్చి ఎన్ని గజాలలో నిర్మాణం చేపడుతున్నారో, ఎన్ని అంతస్థులు నిర్మిస్తున్నారో చెబితే తన వాటా ఎంతో తన పై అధికారుల వాటా ఎంతో చెబుతాడు. దానికి అనుగుణంగా చెల్లింపులు చేస్తే చాలు. ఎన్ని నిబంధనలు ఉల్లంఘించినా ఫర్వాలేదు. నిబంధనలు ఉల్లంఘించడం కాదు అసలు అనుమతులు లేకపోయినా ఫర్వాలేదు.

అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేసినా కూడా తమకు ఏమీ తెలియదన్నట్లు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు నటిస్తారు. ఫిర్యాదు చేసిన వారికే ఉల్టా ప్రశ్నలు వేసి వేధిస్తారు. అందువల్ల ఫిర్యాదు చేయాలనుకున్న వారు కూడా వెనక్కి వెళ్లిపోతారు. ఫిర్యాదుదారుడు పదే పదే ఫిర్యాదు చేస్తే మాత్రం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అంతే కానీ అక్రమ నిర్మాణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూల్చి వేయరు. పై అధికారిని కలిస్తే ఆయన కూడా ఎంతో వినమ్రంగా చైన్ మెన్ ను కలవండి అని చెబుతారు.

ఎందుకంటే అక్రమ నిర్మాణ దారుడి నుంచి డబ్బులు వసూలు చేసి అధికారులకు వాటాలు ఇచ్చేది ఈ చైన్ మెనే కాబట్టి ఇలా సర్కిల్ పరిధిలోని హస్తినాపురం డివిజవన్ పరిధిలో జెడ్ పి రోడ్డు . శ్రీ రామణకాలనీ, తిరుమల హాస్పిటల్ పక్కన, హనుమాన్ నగర్ తదితర కాలనీలలో ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా సెల్లార్లతో కూడిన బహుళ అంతస్థుల అక్రమ నిర్మాణాలు కనిపిస్తాయి. ఏ ఒక్క అక్రమ  నిర్మాణ దారుడిని కదిలించినా కూడా చైన్ మన్ మాకు కట్టుకొమ్మని అనుమతించాడు ఆయనకు మేం అడిగినంతా ఇచ్చాంఅనే చెబుతారు.

పై అధికారులను ఆయనే మేనేజ్ చేస్తాడట అని కూడా చెప్పేస్తారు. ఇలాంటి కలెక్షన్ కింగ్ లు చైన్ మెన్ లు గా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. క్రమబద్దీకరణ ఆదాయం అంతా అధికారులే తినేస్తున్నారు. ఇంత కింది స్థాయి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి వెచ్చల విడిగా అవినీతికి పాల్పడి పై అధికారులకు వాటాలు ఇస్తుంటే ఇక ఈ మునిసిపాలిటీ సర్కిల్ ఎలా బాగుపడుతుంది? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. హసినాపురం డివిజన్ లో విధులు నిర్వర్తిస్తున్న చైన్ మెన్ ఒక్కొక్క అక్రమ నిర్మాణం దారుడి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెండు మూడు నెలల్లో దాదాపు 10 నుంచి 20 లక్షల రూపాయల వరకూ వసూలు చేశాడని కొందరు స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మరి ఇప్పటికైనా సర్కిల్ పరిధిలోని జోనల్ డిప్యూటీ కమిషనర్లు స్పందించి హస్తినాపురం డివిజన్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాల అనుమతులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే చైన్ మెన్ చేసిన వసూళ్ల బాగోతం బయటకు వస్తుంది. మరి ఉన్నతాధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారా లేదా చైన్ మెన్ ఇష్టారాజ్యానికి వదిలేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. కింది నుంచి వస్తున్న ఈ డబ్బు పైదాకా వెళుతుంటే మాత్రం ఏమీ జరిగే అవకాశం లేదు.

Related posts

దేశం కోసం ఉరికంబం ముద్దాడిన గొప్ప వీరుడు భగత్ సింగ్

Satyam NEWS

అయోధ్య .. ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధం..

Sub Editor

పోల్ బ్యాటిల్: ఊపందుకున్న ఎన్నికల వేడి

Satyam NEWS

Leave a Comment