38.2 C
Hyderabad
April 29, 2024 11: 11 AM
Slider ముఖ్యంశాలు

ట్రిబ్యూట్: కర్మయోగి పి వి నరసింహారావు

#PV Narasimharao Article

“తను కావించిన సృష్టి తక్కొరుల చేతన్ గాదునాన్ ” అని తిక్కనామాత్యుని గురించి  ఎర్రాప్రగడ అన్నాడు. తిక్కన మహామంత్రి, దండనాథుడు, మహాకవి. ప్రధానమంత్రిగా, సర్వసైన్యాధ్యక్షుడుగా  రాజ్య పాలనలో తలమునకలై ఉండి కూడా, పదిహేను పర్వాల మహాభారత మహాకావ్యాన్ని ఒంటిచేత్తో సృష్టించాడు.

రాజు మనుమసిద్ధికి తోడుగా నిలిచి, రాజ్యాన్ని కాపాడాడు. మనుమసిద్ధి తిక్కనను మామా, అని పిలిచేవాడు. అంతగా, ఆ రాజ కుటుంబంతో తిక్కన ఒదిగిపోయాడు. ఎదిగిపోయాడు. పి.వి నరసింహారావు రాష్ట్రంలో మంత్రి గా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా  ఊపిరికూడా ఆడలేని పదవులు చేపట్టాడు.

ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడు

ఆర్ధిక సంస్కరణలు, విదేశాంగ విధానం, దార్శనికతో దేశభక్తుడిగా దేశాన్ని రక్షించాడు. అధినేతలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు తలలోని నాల్కగా నిలిచాడు. రాజీవ్ గాంధీ పి.వి ని అంకుల్ అని పిలిచేవాడు. ఆ  రీతిన  పార్టీలో, ప్రభుత్వ పదవులలో ఒదిగి, ఎదిగి, ఎగిశాడు. పాలనాకాలంలో  ప్రతికూల పరిస్థితులు, కుట్ర, కుతంత్రాలు, ఒత్తిళ్ళు ఉన్నా, వాటిని చాకచక్యంగా అధిగమిస్తూ, ఇంకొక పక్క సాహిత్య విన్యాసం చేశాడు.

పదిహేను భాషలకు పైగా నేర్చుకున్నాడు. సమయాన్ని, విరామాన్ని  విస్తృతంగా వాడుకున్నాడు.అన్ని భాషలు నేర్చినా, ఎక్కువ వేళల మౌనాన్నే ఆశ్రయించాడు.మౌనం జ్ఞాని లక్షణం. అవసరమైతే,  అనర్గళంగా మాట్లాడాడు,  ఆశ్చర్యచకితులను చేశాడు. గాంభీర్యం ఆయనకున్న మరో లక్షణం. ఎంతటి ధీర గాంభీర్యుడో, అంతటి హాస్యచతురుడు కూడా.

వేడివాతావరణంలో కూడా పన్నీటి జల్లులు కురిపించే పివీ

వేడి వాతావరణంలో  కూడా, తన ఛలోక్తులతో పన్నీరు జల్లులు కురిపించేవాడు. మౌనం జ్ఞాని లక్షణం.గాంభీర్యం రాజలక్షణం. ఈ రెండు సులక్షణాలు కలిగిన విలక్షణ నాయకుడు. పి.వి. చేపట్టిన చర్యలు, సాధించిన ఘనతలు, చేసిన ప్రయోగాలు, అందించిన ఫలితాలు  ఇంకొకరికి అసాధ్యమనే చెప్పాలి.

తెలంగాణా ప్రాంతంలోని మారుమూల పల్లెసీమలలో పుట్టి, అక్కడి నుండి ఢిల్లీ వరకూ ఎదిగి, ప్రపంచమంతా తిరిగి, ప్రతి పదవిలో ఒదిగిన కర్మయోగి పి.వి.నరసింహారావు. ఎంత ఎదిగాడో అంత ఒదిగాడు. ఎంత ఒదిగాడో అంత ఎదిగాడు. అదీ పి.వి.నరసింహారావు. నిరంతర జ్ఞాన చింతన, సృజనశీలత, దేశభక్తి, స్థితప్రజ్ఞత, రసాత్మకత, చాణక్యం మొదలైన సుభిక్షమైన  సులక్షణాలన్నీ ఆయన  ఎదుగుదలకు నిచ్చెనలై,బలహీనతలకు రక్షణ కవచములై  నిలిచాయి.

 ఆరడుగుల ఆజానుబాహుడు కాడు. అందమైన స్ఫూరద్రూపుడు కాడు. అచంచలమైన సామాజిక బలం, అనంతమైన ఆర్ధికబలగం ఉన్నవాడు అస్సలు కానేకాడు. కేవలం తన ప్రజ్న, ప్రవర్తనలే పివిని  అజేయుడిగా నిలబెట్టాయి. నేడు, ఈ బహుముఖ ప్రజ్ఞాధురీణుడి శతవసంత ఉత్సవ సందర్భం….. 99ఏళ్ళు నిండి 100వ సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది.

ఏడాది పాటు జరుపుకునే పండుగ

తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పి.వికి ఘన నివాళిగా రాష్ట్రమంతా, సంవత్సరంపాటు సంబరాలు చెయ్యాలని సంకల్పించడం సర్వ శుభదాయకం. ఈ విషయంలో,  తెలంగాణా ముఖ్యమంత్రిని అభినందించి తీరాలి. పివి కేవలం తెలంగాణా ప్రాంతానికే చెందిన వ్యక్తి కాదు.  తెలుగువారందరూ స్మృతిపథంలో నిలుపుకోవాల్సిన తెలుగుతేజం. ఢిల్లీ పీఠం గద్దెనెక్కిన తొలి తెలుగువాడు.

ఇది మరియొకరికి అసంభవం అని చెప్పవచ్చు. తెలుగునాట నుండే కాదు, యావత్తు దక్షిణాది నుండే ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన ప్రప్రథముడు. వాజ్ పేయి వంటి ప్రతిపక్షనేతలకూ ఇష్టుడుగా తనను తాను మలచుకున్న తీరు ఆశ్చర్యకరం. మౌనంగా, గంభీరంగా కనిపించే పి వి లో వెయ్యి కోణాలు ఉంటాయి. హాస్యచతురుడు, గాయకుడు,నటుడు,  పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.

పాత సిద్ధాంతాలపై తిరుగుబాటు వీరుడు

అంతేకాదు,  తిరుగుబాటుదారుడు (రెబెల్) కూడా లోపల దాగి ఉన్నాడు. యవ్వనంలో ఉన్న  తన  ఈ తిరుగుబాటు ధోరణే తన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. తన 17 ఏళ్ళ ప్రాయంలో, నిజాం ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గీతం పాడాడు.

దీనితో,  ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇతన్ని బహిష్కరించారు. అప్పుడు, స్వరాష్ట్రాన్ని వీడి మహారాష్ట్ర చేరాడు. డిగ్రీ, లా చదువులన్నీ అక్కడే చదివాడు. అన్నింటా విశ్వవిద్యాలయంలో సర్వ ప్రథముడుగా ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడ మరాఠీ కవుల మధ్య జరిగే సారస్వత వివాదాలను దగ్గర నుండి చూశాడు.

ఆ గొడవలు, కొట్లాటల వల్ల ఎవరికేమి వచ్చిందో తెలియదు కానీ, నాకు మాత్రం మరాఠీ బాగా వచ్చిందని ఒక సందర్భంలో పివి ఛలోక్తి కూడా విసిరాడు. అది ఆయన  హాస్య చతురతకు ఒక ఉదాహరణ. స్వామి రామానంద, బూర్గుల రామకృష్ణారావు అనునూయుడిగా హైదరాబాద్ విముక్తిపోరాటంలోనూ పాల్గొన్నాడు. 1938లోనే  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ,1951 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా చేరినప్పటి నుండీ పివి నరసింహారావు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనట్లు చెప్పాలి.

జర్నలిజం నుంచి ప్రధాని పదవి వరకూ…

దీనికి ముందు,  తొలినాళ్ళల్లో,  జర్నలిస్ట్ గా కాకతీయ పత్రికను నడిపాడు. జయ అనే మారుపేరుతో వ్యాసాలు, కథనాలు రాసేవాడు. 1957లో మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎంపికై, శాసనసభ్యుడిగా రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి కాలుమోపాడు. అనేక పర్యాయాలు శాసనసభకు ఎంపికయ్యాడు. రాష్ట్రమంత్రిగా అనేకసార్లు  పదవులు పొంది, అనేక శాఖలు నిర్వహించాడు. రాష్ట్రమంత్రిగా ఉన్న క్రమంలో, ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాడు.

ముఖ్యంగా విద్యాశాఖా మంత్రిగా,  ప్రాచీన విద్యాబోధనకు ప్రతిబింబంగా నిలిచే గురుకుల పాఠశాల వ్యవస్థలను నిర్మించాడు. జైళ్లశాఖలో ఉన్నప్పుడు ఓపెన్ జైల్స్ అనే సంస్కరణ చేపట్టాడు. వివిధ నేరాల వల్ల జైలుపాలైన వారిలోని సృజనను బయటకు తెచ్చే గొప్ప ప్రయత్నం  చేపట్టాడు. కటకటాలకే పరిమితమై, చీకటి గదుల్లో మగ్గే బదులు, ఖైదీలు బయటకు వచ్చి, ప్రాంగణంలో, విద్యాభ్యాసం సాగించడం, వ్యవసాయం, మొక్కలు పెంచడం మొదలు,  హస్తకళలను సద్వినియోగం చేసుకోవడం వంటి బహుళ ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాతావరణాలు కల్పించాడు.

దీనివల్ల ఎందరో నేరస్తులకు పరివర్తన వచ్చింది. ఉన్నత విద్యలు చదివి, అనంతర జీవితంలో ప్రయోజకులయ్యారు. మిగిలినవాళ్ళు వృత్తి నైపుణ్యం పెంచుకొని, వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. పి వి చేపట్టిన ఈ సంస్కరణల వల్ల వారిలో నేరప్రవృత్తి తగ్గి, తర్వాత జీవితంలో బాధ్యతాయుతంగా మెలిగే సంస్కారం అబ్బింది.

నవోదయ విద్యావ్యవస్థకు ఆద్యుడు పివి

ఇంతటి మహోన్నత సంస్కరణకు మూలబిందువుగా నిలిచినవాడు పి వి నరసింహారావు. మనోవికాసం, జ్ఞానతృష్ణ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి, తదనంతర ప్రస్థానంలో కేంద్ర మానవవనరుల శాఖామంత్రిగా ఉన్నప్పుడు నవోదయ విద్యావ్యవస్థలను సృష్టించాడు. సహజవనరులు, మానవవనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి, అనే స్పృహ చాలా ఎక్కువగా  ఉన్న రాజకీయనాయకుడు పివి.

రాజకీయ జీవిత పయనంలో ముఖ్యమంత్రి పదవి కూడా తాను కోరింది కాదు.దాని కోసం ఏ పైరవీలు చెయ్యలేదు. ఆ పదవి తానుగా వచ్చి వలచింది.1971ప్రాంతంలో  ముఖ్యమంత్రి అయ్యాడు.1969 ప్రాంతంలో  ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి, ముగిసిన సందర్భంలో, తెలంగాణా ప్రాంతీయులను ముఖ్యమంత్రిగా ఎంచుకొని, ఆ ప్రాంతీయులకు కొంత స్వాంతన కలిగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచించింది.

భూ సంస్కరణలకు ఆద్యుడు మన పివి

ఆ క్రమంలో వివాదరహితుడు,వర్గాలకు అతీతుడు,విద్యావంతుడు, విధేయుడని ఇందిరాగాంధీ భావించి, పి.వి నరసింహారావును రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించింది. సృజనశీలుడు, సంస్కరణప్రియుడు ఊరికే ఉంటాడా, ఉండలేదు. ముఖ్యమంత్రిగా కూడా సంస్కరణ పర్వాలకు శ్రీకారం చుట్టాడు. స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే నిజాంకాలం నుండి ఉన్న డిమాండ్ కు  మద్దతుపలికాడు.

దీనినే ముల్కీ ఉద్యమం అంటారు. ముల్కీ అంటే స్థానిక (లోకల్ ) అని అర్ధం. ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తోడు, పి వి బహిరంగంగా ప్రకటించిన మద్దతు…. కోస్తా, రాయలసీమ ప్రాంతీయులకు, ముఖ్యంగా యువతకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దానితో కోస్తా, రాయలసీమ ప్రాంతంలో  పెద్దఎత్తున జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఘర్షణలు,మరణాలు కూడా సంభవించాయి.

ఎం. వెంకయ్యనాయుడు వంటి యువనేతలు జైలుపాలయ్యారు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతమంతా అగ్నిజ్వాలలు రగిలాయి. పివి తీసుకువచ్చిన భూసంస్కరణలు తెలంగాణా, కోస్తా, రాయలసీమ మొదలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయుల భూస్వాములకు తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టాయి.

పీఠం దిగినా ఠీవి తగ్గని పివి

భూమి హక్కులపై పరిమితి విధించడం (ల్యాండ్ సీలింగ్ ) ఆ సంస్కరణల ప్రధాన ఉద్దేశ్యం. ఈ అంశంలో,  అన్ని సామాజికవర్గాల పెద్దలందరూ పివికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. తన కేబినెట్ లోని మంత్రులు చాలామంది రాజీనామా చేశారు. వారిస్థానంలో, పివి కొత్తమంత్రులను కూడా నియమించుకున్నారు.  ఇన్ని వ్యతిరేక ఆందోళనలు, పరిస్థితుల మధ్య పి.వి ని ముఖ్యమంత్రి పదవి నుండి దించెయ్యాల్సిందేనని ఢిల్లీ పెద్దలపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి.

ఈ తరుణంలో, 1973లో పివి ముఖ్యమంత్రి పీఠం దిగి పోవాల్సి వచ్చింది. ఆ పదవిలో పట్టుమని రెండేళ్లు కూడా కూర్చోలేక పొయ్యాడు. ఐనప్పటికీ  1977వరకూ రాష్ట్రరాజకీయాల్లోనే కొనసాగాడు.ఈ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ,  ఇందిరాగాంధీకి పి.వి నరసింహారావుపై వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, తదనంతరం వివిధ సందర్భాల్లో, ఢిల్లీలో ఇందిరాగాంధీని అనేక పర్యాయాలు కలుసుకున్న  పి.వికి  అవన్నీ కలిసివచ్చాయి.

అపారజ్ఞాన సంపద, భాష , వాగ్ నైపుణ్యం ఆయన సొంతం

ఈయనలోని  తెలివితేటలూ, అపారజ్ఞాన సంపద, భాష , వాగ్ నైపుణ్యం,వినయ విధేయతలు ఇందిరాగాంధీనీ విపరీతంగా ఆకర్షించాయి.పి వి లోని విశేష ప్రతిభను, విశిష్టతను ఇందిరాగాంధీ బాగా కనిపెట్టింది. తర్వాత,  పి.వి మకాం ఢిల్లీకి మారింది. మొట్టమొదటగా, హనుమకొండ నుండి లోక్ సభకు ఎంపికయ్యాడు. మహారాష్ట్రలోని రాంటెక్ మొదలు నంద్యాల వరకూ వివిధ స్థానాల నుండి పలుమార్లు లోక్ సభ ఎన్నికల్లో నిల్చొని, గెలిచి, అనేక శాఖలకు కేంద్రమంత్రిగా పదవులు పొందాడు.

హోమ్  మొదలు అనేక శాఖలు నిర్వహించినా, విదేశాంగ, మానవవనరుల శాఖలకు విశేషమైన శోభలను అద్దాడు. విశిష్టమైన గుర్తింపు తెచ్చాడు.తానూ  తెచ్చుకున్నాడు. బహుభాషా కోవిదుడైన పి.వి ఈ రెండు శాఖల్లో విజృంభించాడు.1983లో అలీనా దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి ప్రపంచ నాయకులను ఆశ్చర్యచకితులను చేశాడు. క్యూబా అధ్యక్షుడు ఫెడరల్ కాస్ట్రో అబ్బురపడిపొయ్యాడు. మానవవనరుల శాఖ వ్యక్తిగతంగా బాగా ఇష్టమైన శాఖ అని చెప్పవచ్చు.

ఈనాడు, మానవవనరులు అనే శాఖ, సర్వత్రా  చాలా ఆవశ్యకమైన సబ్జెక్ట్ గా రాణకెక్కిందంటే, అది పి.వి అప్పుడు వేసిన పునాదులే. అమెరికా వంటి అగ్రదేశాలలోనూ, ఈ రంగంలో భారతీయులే నేడు అగ్రగాములుగా ఉన్నారు, అన్న విషయాన్ని, మనం ఈ సందర్భంలో గుర్తించాలి.పి.వి నెరపిన విదేశాంగ  విధానం  చాలా గొప్పది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా ఉన్నంతకాలం అటు చట్టసభల్లోనూ, వారు జీవించి ఉన్నంతకాలం, ఇటు వ్యక్తిగతంగానూ వారికి అభిమానపాత్రుడుగా, విశ్వాసపాత్రుడుగా మెలిగాడు.

అస్త్ర సన్యాసం చేసినా దక్కిన ఉన్నత పీఠం

మన్ననలూ పొందాడు. తర్వాత పరిణామాల్లో రాజకీయ అస్త్రసన్యాసం చేసి, సన్యాసాశ్రమం తీసుకొని, కుర్తాళం పీఠాధిపతిగా ఆధ్యాత్మిక జీవనం సాగిద్దామని నిర్ణయం తీసుకున్నాడు. ఆ దశలో, రాజీవ్ గాంధీ అకాలమరణం చెందడంతో, ఆధ్యాత్మిక పీఠం బదులు,  ఢిల్లీ రాజకీయ పీఠాధిపతి అయ్యాడు. 

గతంలో వచ్చిన ముఖ్యమంత్రి పదవి లాగానే, ఇప్పుడు, ఈ ప్రధానమంత్రి పదవి కూడా తాను కోరుకున్నది కాదు. అదే వలచి, వరించి వచ్చి, ఇతన్ని చేరింది. దీనికి కూడా కారణాలు: విధేయుడు, వినయసంపన్నుడు, వివాదరహితుడు, వర్గాలకు అతీతుడు, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు అనే అభిప్రాయాలు సోనియాగాంధీకి, ఆమెకు తోడు ఆ పక్కన ఉన్నవారికి  ఉండడం వల్లేనని చెప్పాలి. వీరిలో హక్సర్ ను ప్రధానంగా చెప్పాలి.

ఇందిరాగాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడైన కార్యదర్శిగా ఈయన పనిచేశాడు. సోనియాగాంధీకి కూడా హక్సర్ పట్ల అంతే విశ్వాసం ఉంది. అప్పుడు పి.వి ని ప్రధానమంత్రిగా సూచించినవారిలో అర్జున్ సింగ్ పేరు కూడా చెబుతారు. ఈ విషయంలో అసలు నిజాలు సోనియాగాంధీకే తెలియాలి. పి.వి. నరసింహారావు- సోనియా అనుబంధం ఎక్కువకాలం సాగలేదు.పివిపై వ్యతిరేకంగా  కొందరు చాడీలు చెప్పడం ప్రారంభించారు.

చాడీలు విన్న సోనియాగాంధీ

ఇది వీరిద్దరి మధ్యా దూరాన్ని పెంచింది. ఇంకొక పక్క మైనారిటీ ప్రభుత్వం, భయంకరమైన ఆర్ధికలోటు. ఈ సవాళ్లనన్నీ తన ధీయుక్తితో ఎదిరించిన వీరుడు, అపరచాణుక్యుడు పి.వి.నరసింహారావు. ఆర్ధికరంగ నిపుణుడు మన్ మోహన్ సింగ్ ను ఆర్ధికమంత్రిగా నియమించుకున్నాడు. ఆర్ధికసంస్కరణలు  అనే విశేష ప్రయోగాలను చేపట్టాడు. రూపాయి విలువను 18శాతం తగ్గించాడు. లండన్ బ్యాంక్ కు బంగారం నిల్వలు తరలించి విదేశీ మాదక ద్రవ్యం సంపాదించాడు.

మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టీవ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ (ఎం.ఆర్.టి.పి ) చట్టాన్ని రద్దు చేశాడు. లైసెన్స్ -పర్మిట్ రాజ్ కు చరమగీతం పాడాడు.దిగుమతి సుంకాలు, ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్నును తగ్గించాడు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాడు.విదేశీ పెట్టుబడులను ఉదారంగా స్వాగతించాడు.

నూతన పారిశ్రామిక విధానం రూపొందించాడు. ఆర్ధిక అభివృద్ధి రేటు సగటున 6.5 సాధించాడు.తన పదవీకాలం చివరి రెండేళ్లలో 7.5 శాతం కూడా సాధించాడు. ఆర్ధికంగా తాకట్టు స్థితి  నుండి,  తలెత్తుకొని తిరిగే దశకు భారతదేశాన్ని నడిపించాడు. ఇవి పివి చేపట్టిన ఆర్ధిక సంస్కరణల అపూర్వమైన ఘనత.

ఈ రోజు మనం అనుభవించే ఫలాలు పీ వీ చలువే

ఈరోజు మనం అనుభవించే ఫలాలు పి.వి చలువే. వాజ్ పేయి నుండి నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకూ పాలకులంతా  పి.వి బాటలోనే నడక సాగించారనడం అతిశయోక్తి కానే కాదు.పి.వి  కార్యక్షేత్రంలో పుట్టిన ఆ  బీజాలు  నేడు కల్పతరువులయ్యాయి. భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరింది.

అది పి.వి భవ్య ఆలోచనా ప్రసాదమే అని ముమ్మాటికీ భావించాలి. ఇప్పటి వరకూ భారత్- చైనా మధ్య శాంతి, సామరస్యం వెల్లివిరిసిందంటే, ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా, అప్పుడు ఇరుదేశాలు కుదుర్చుకున్న ఇండియా-చైనా పీస్ అండ్ ట్రాంక్విల్టీ అగ్రిమెంట్ అని మనం గుర్తుంచుకోవాలి.

ఇలా ఇరుగుపొరుగు దేశాలు, బలమైన దేశాల పట్ల పి.వి. నరసింహారావు పాటించిన రాజనీతిజ్ఞత విదేశాంగ విధానంలో కొత్త పుంతలు తొక్కించింది. పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివెయ్యడం పి.వి ఘనతగానే చెప్పాలి. పాకిస్తాన్ తీవ్రవాదానికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని చర్చకు పెట్టి, ఆ దేశాన్ని దోషిగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టాడు.

అణుపరీక్షలు చేసిన ఘనుడు

ఆగ్నేయ దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, అణుపరీక్షలకు శ్రీకారం చుట్టడం మొదలైనవి పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా సాధించిన ఘనతలు, వేసిన ముద్రలు. ఈ విజయాలు, వైభవాలతో పాటు అవమానాలు, ఆవేదనలు, అపజయాలు, అపప్రధలు కూడా మూటగట్టుకున్నాడు.

బాబ్రీ మసీదు విధ్వంసం పి.వికి ఒక  మచ్చను  మిగిల్చింది. ప్రభుత్వాన్ని, ప్రధాని పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాలకు డబ్బులు పంచారనే  అంశాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నాడు. తదనంతర కాలంలో, కోర్టుల చుట్టూ తిరిగాడు. చివరకు తానే గెలిచాడు. కోర్టుల్లో కేసులు కొట్టేశారు. తన ఆత్మకథ సంపూర్ణంగా వెలుగుచూడ లేకపోయింది. ఇన్ సైడర్ పేరుతో వచ్చిన కాల్పనిక రచన కొంత న్యాయం చేసింది.

వినయ్ సీతాపతి తీసుకు వచ్చిన పివి జీవిత చరిత్ర హాఫ్ లయన్,కేంద్ర మాజీ మంత్రి  జై రామ్ రమేష్ రచించిన టూ ది బ్రింక్ అండ్ బ్యాక్ : ఇండియాస్ 1991స్టోరీ మొదలైన పుస్తకాలు పి.వి.నరసింహారావు గురించి తెలుసుకోడానికి కొంత ఉపకరిస్తాయి. పి.వి పై ఇంకా సమగ్రంగా రచనలు రావాలి. తాను రాసుకున్న అంశాలు, నోట్స్ కుటుంబసభ్యుల దగ్గర ఉన్నాయంటారు.కుటుంబ సభ్యులు అవి ఒక్కచోటకు చేర్చి, పుస్తకంగా ప్రకటించడం సముచితం. ఈ వందేళ్ల పండుగ వేడుకలలో సందర్భోచితం కూడా  అవుతుంది.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ఇమ్రాన్ ఖాన్ భావాలకు అనుగుణంగానే అమెరికా

Satyam NEWS

GST fear: కల్వకుర్తిలో వ్యాపారుల లాక్ డౌన్

Satyam NEWS

ఈ నెల 30న స్వరూపానందేంద్ర స్వామి రాక

Bhavani

Leave a Comment