32.7 C
Hyderabad
April 27, 2024 02: 12 AM
Slider హైదరాబాద్

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

#bonalu

తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం  బేగంపేట లోని హరిత ప్లాజా లో జూన్ 22 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, DGP అంజనీ కుమార్, MLC లు ప్రభాకర్ రావు, సురబి వాణిదేవి, MLA లు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, అరికేపూడి గాంధీ, ట్రాన్స్ కో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర పండుగగా ప్రకటించారని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం జూన్ 22 నుండి ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.

22 న గోల్కొండ లో బోనాలు ప్రారంభం అవుతాయని, జులై 9 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16 వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. బోనాల ఉత్సవాలను ఎంతో సంతోషంగా, ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో అనేక ప్రైవేట్ దేవాలయాలకు  ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని, ఈ విధంగా దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం లేదని తెలిపారు.

బోనాల సందర్బంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్ల కోసం సుమారు 200 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఈ బోనాల ఉత్సవాల సందర్బంగా నగరం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ఆలయాల పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ కోసం GHMC అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. ఊరేగింపు నిర్వహించే రహదారులు, ఆలయాలకు వెళ్ళే రహదారులలో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని, క్యూ లైన్ లలో ఉండే  వారికి నీటిని అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తామని అన్నారు.

శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఇతర జిల్లాల నుండి అదనపు పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందని, అవసరమైన ప్రాంతాలలో CC కెమెరాలను బోనాల ఉత్సవాల కోసం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మఫ్టీ పోలీసులు, షీ టీం లను బందోబస్తు విధుల కోసం నియమించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ దేవాలయాల భక్తులకు స్వచ్చందంగా సేవలు అందించే వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేస్తామని తెలిపారు.

స్వచ్చందంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు. బోనాల ఉత్సవాల సందర్బంగా గోల్కొండ లోని శ్రీ జగదాంబిక ఆలయంలో, సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్ సిటీ లోని శ్రీ అక్కన్న మాదన్న తదితర 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

ఉజ్జయిని మహంకాళి, అక్కన్న మాదన్న, సబ్జిమండి ఆలయాలకు అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పలు ప్రముఖ ఆలయాల వద్ద భక్తుల ఆహ్లాదం కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల తో బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందని, నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని చెప్పారు.  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు.

గత ప్రభుత్వాలు బోనాల పండుగ సరిగా జరపలేదని, తెలంగాణా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని అన్నారు. ఈ సంవత్సరం కూడా ఏర్పాట్ల కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ MD దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ లు CV ఆనంద్, చౌహాన్, వివిధ శాఖల కు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Related posts

క్యాన్సర్ కారక పెయింటింగ్ యూనిట్ ను  ఎత్తివేయాలి

Satyam NEWS

రైతు మేలు కోసమే నియంత్రిత సాగు విధానం

Satyam NEWS

దేవుడు కన్నా మోడీ అంటేనే జగన్ కు భయం

Satyam NEWS

Leave a Comment