గత ఐదేళ్లుగా కేవలం అమరావతి-పోలవరం భజన చేయడం వల్లే చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లు పగలంతా పోలవరం, మధ్యాహ్నం అమరావతి అన్నట్టుగానే చంద్రబాబు వ్యవహరించారని ఆయన అన్నారు. అమరావతిని బ్యాంకాక్ చేస్తా.. సింగపూర్ చేస్తానంటూ రాష్ట్రంలోని సమస్యలు, ప్రజల కనీస అవసరాలు గాలికొదిలేశారన్నారు. రాజధానిని మారుస్తామని.. పోలవరం ప్రాజెక్టును నిలిపేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎక్కడా చెప్పలేదని, దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. ఈరోజు సచివాలయంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా అమరావతి, పోలవరంపై ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018లో నీళ్లు ఇస్తాం రాసుకో అని అన్నారు. 5 ఏళ్ళ పాలన పూర్తైన తర్వాత కూడా అవే మాటలు చెప్పారు. దాంతో ప్రజలు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు అని ఆయన అన్నారు. పోలవరం, అమరావతి భజనను చంద్రబాబు ఆపకుంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలవదని మంత్రి అన్నారు. పోలవరం ఆపుతామని సీఎం ఎక్కడా చెప్పలేదన్నారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్తాం.. కాకపోతే 3నెలలు, 4 నెలలు ఆలస్యం అవుతుంది. ప్రాజెక్టు పేరుతో.. రాష్ట్ర ఆదాయాన్ని గత పాలకులు దోచుకున్నారు. దాన్ని అరికట్టడానికే రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నామని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజధానిపై అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, వీటిని సమీక్షించుకొని ముందుకువెళ్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారని కొడాలి గుర్తు చేశారు.
previous post