Slider సంపాదకీయం

క్యాస్ట్ పాలిటిక్స్: పాతది నాశనం కొత్తదానికి శ్రీకారం

amaravathi agitation

తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనేవాడికి ఎవరూ ఏం చెప్పలేరు. కమ్మ వాళ్ల మీద కోపంతో, కసితో రాజధానిని సర్వ నాశనం చేస్తామంటే ఎవరూ ఒప్పుకోరు. ఎవరూ ఒప్పుకోకపోయినా నేను చేసేస్తాను అంటే ఓటేసిన ప్రజలు కూడా ఏమీ చేయలేరు. అన్ని అంశాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఫాలో అవుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయం మార్చడంలో కూడా అదే పంథా అనుసరించారు.

హైదరాబాద్ లో నిక్షేపంలా ఉన్న సచివాలయాన్ని కూలగొట్టడంలో కేసీఆర్ ఎంత నిర్దయగా వ్యవహరించారో అంతకన్నా రెట్టించిన పట్టుదలతో జగన్ అమరావతిని భూ స్థాపితం చేయడానికి ఉపక్రమించారు. హైదరాబాద్ లో సెక్రటేరియేట్ ను మార్చద్దని ఎందరు మొత్తుకున్నా కేసీఆర్ వినలేదు. ఇరుకైన గదుల్లో కట్టిపడేశారు. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అంతే. అమరావతి ని కూడా మార్చేస్తానంటే జగన్ ను ఎవరూ ఏమీ చేయలేరు.

ఈ సీక్రెట్ కనిపెట్టిన జగన్ అమరావతిని మార్చి అవతల పడేస్తున్నారు. ఎవరూ ఏమీ చేయలేరు. ఈ విషయం ఇప్పటికే స్పష్టం అయిపోయింది. కమ్మోళ్లు కట్టిన భవనాల్లో నేను ఉండేది లేదు అని ఆయన చెప్పకనే చెబుతున్నారు. అమరావతిలో కట్టిఉన్న భవనాలు చంద్రబాబు సొంత డబ్బులతో కట్టినట్లుగా జగన్ భావిస్తున్నట్లు గా కనిపిస్తున్నది. అంతకు ముందుకు చంద్రబాబునాయుడు కూడా అమరావతి ఏర్పాటు చేయడంలో ఇలానే ప్రవర్తించారు.

అయితే ఇంత మూర్ఖంగా కాదు కానీ దాదాపుగా ఇలానే ప్రవర్తించారు. విజయవాడను రాజధానిగా ప్రకటించి ఉంటే అందరూ ఆమోదించి ఉండేవారు. కొత్త రాజధాని కడతా దాన్ని సింగపూర్ చేస్తా అంటూ లేని విషయాలు ప్రజల ముందు ఉంచే సరికి చంద్రబాబు భక్తులు కూడా నమ్మలేదు. తన భక్తుల్ని నమ్మించేందుకే చంద్రబాబుకు మూడేళ్లు పట్టింది. అందుకే రాజధాని ప్రాంతంలో కూడా చంద్రబాబునాయుడికి ఓట్లు రాలేదు.

చంద్రబాబునాయుడికి ఓట్లు రాలేదు కదా మనకే ఓట్లు వచ్చాయి అని జగన్ సంతృప్తి చెందలేదు. చంద్రబాబునాయుడి ఆర్ధిక మూలాలు దెబ్బ కొడితే తప్ప తాను రాజ్యం చేయలేనని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అందుకే అమరావతిని మార్చేందుకు ఉద్యుక్తుడయ్యారు. అంతకు ముందు జగన్ ను నిలువరించేందుకు చంద్రబాబు తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించారు. ఇప్పుడు జగన్ అదే చేస్తున్నారు.

అందుకే అమరావతికి అనుకూలంగా చంద్రబాబు చేస్తున్న ఉద్యమానికి ఊపు రావడం లేదు. చంద్రబాబు కేవలం కమ్మ కులం వారికి ప్రయోజనం చేశారని అందుకే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సమాజంలోని చాలా వర్గాలకు చంద్రబాబు పై ఉన్న కోపం ఇంకా చల్లారలేదు. చంద్రబాబు హయాంలో కమ్మ కులం వారు చేసిన దాష్టీకాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు జగన్ చేసే నిర్ణయాలలో తప్పును వెతకలేకపోతున్నారు.

ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయో అర్ధం చేసుకోలేకపోతున్నారు. చంద్రబాబు పై కోపాన్ని పెట్టుబడిగా పెట్టుకుని జగన్ తన రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. ఇలా ఎంత కాలం సాగుతుంది? అనేది ప్రశ్న. చంద్రబాబు లేదా జగన్ వైపు చూడటం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. రాజధాని మార్చద్దు అంటే కమ్మవాడని అర్ధం. రాజధాని మార్చు అని అంటే రెడ్డి అని అర్ధం. ఇంతే ఆంధ్రా ప్రజలు బతుకులు.  

Related posts

భూమనకి టీటీడీ పదవి పై తీవ్ర వివాదం..

mamatha

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి భార్య, బిడ్డకు గాయాలు

Satyam NEWS

వివేకా హత్య కేసు దర్యాప్తులో తాత్కాలిక విరామం

Satyam NEWS

Leave a Comment