ఎప్పుడెప్పుడు దూకుదామా అని ఉత్సాహం పై ఉన్న తెలంగాణ బిజెపి ఆశలపై బిజపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నీళ్లు చల్లారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ బిజెపి నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్నొక పండుగ కార్యక్రమంగా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి అతిథిగా కేంద్ర హోం మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తారని కూడా తెలంగాణ బిజెపి నేతలు చెప్పారు. అయితే, అనూహ్యంగా ఆయన పర్యటన రద్దు అయింది. బిజెపి అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పటాన్ చెరులో పార్టీ తలపెట్టిన బహిరంగ సభకు అమిత్ షా హాజరు కావడం లేదని చెప్పారు. ఆరోజున ఢిల్లీలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలున్నాయనీ, అందుకే రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆయన స్థానంలో మరో కేంద్రమంత్రిని ముఖ్య అతిథిగా పంపిస్తారని అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతీ ఒక్కర్నీ స్మరించుకోవాలనీ, విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న ఊరు నిండా జెండాలు అనే కార్యక్రమాన్ని పార్టీ చేపడుతోందని చెప్పారు.
previous post
next post