26.7 C
Hyderabad
April 27, 2024 09: 35 AM
Slider సంపాదకీయం

మన మనసుకు నచ్చినట్లే తీర్పులు రావాలంటే ఎలా?

#LawInIndia1

న్యాయస్థానాలను విమర్శించడం, న్యాయమూర్తుల్ని తిట్టడం వారి తీర్పుల్ని తప్పుపట్టడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తీర్పు అలా ఇస్తే ఎలా? అంటూ ప్రశ్నించే స్థాయికి ప్రజలు చేరుకున్నారు. న్యాయశాస్త్రం చదివావా?, రాజ్యాంగ సూత్రాలను ఒక్క సారైనా పరికించావా?

మరి నీవు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఎలా తప్పుపడతావు? అని ప్రశ్నిస్తే ‘అది అన్యాయం. అంతే’ అనే సమాధానం చెప్పేవారు ఎక్కువ అయ్యారు. న్యాయమో అన్యాయమో చెప్పడానికి నువ్వెవరు? జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పినదానికి అభ్యంతరం ఉంటే దానికి న్యాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి.

వాటిని అనుసరించడం మాట అటుంచి న్యాయ వ్యవస్థ ను కించపరడం ఎంత వరకు సబబు? ఈ ప్రశ్నకు లాజికల్ గా సమాధానం చెప్పేవారు లేరు. ఎన్నికైన ప్రభుత్వాలను పని చేసుకోనివ్వకపోతే ఎలాగండీ అంటూ ప్రశ్న వేస్తారు. ఎన్నికయిన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని చెప్పడం తప్పా?

ప్రశ్నించిన వారి పక్షాన నిలవడం న్యాయస్థానాల తప్పా?

సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలను బాధితులు ప్రశ్నించడం తప్పా? అలా ప్రశ్నించిన వారి వైపు నిలబడటం న్యాయస్థానాల తప్పా? అలా బాధితులవైపు, సహజ న్యాయ సూత్రాల వైపూ కాకుండా ప్రభుత్వం వైపు మాత్రమే న్యాయ వ్యవస్థ నిలబడాలని కోరుకోవడం ఎంత వరకూ సబబు?

దేశ ప్రధానికి కూడా వ్యతిరేకంగా తీర్పు చెప్పిన అత్యున్నత న్యాయవ్యవస్థ మనది. దేశ ప్రధానిగా పని చేసిన వారిని కూడా న్యాయస్థానాలలో నిలబెట్టిన చరిత్ర మనది. అలాంటి న్యాయవ్యవస్థ పక్షపాతంతో తీర్పులు ఇస్తున్నదని చెప్పడం ఎంత వరకూ సబబు?

బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రపూరితంగా జరిగింది కాదు అంటూ లక్నో సీబీఐ కోర్టు తీర్పు చెప్పగానే దారుణమైన విమర్శలు వెల్లువెత్తాయి. బాబ్రీ మసీదు ఎవరూ కూల్చేయలేదు దానంతట అదే కూలిపోయింది అంటూ కోర్టులు తీర్పులు చెబుతున్నాయి అంటూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులే తీర్పును వక్రీకరించి చెప్పారు.

బాబ్రీ మసీదు కూల్చివేయడమే నా జీవితాశయం అని అద్వానీ తన రథయాత్ర ప్రారంభం సమయంలోనే చెప్పారని, అలాంటి వ్యక్తి బాబ్రీ మసీదు కూలగొట్టలేదని తీర్పు ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఏ కోర్టు అయినా తీర్పు చెప్పడానికి న్యాయ సూత్రం ఆలంబన ఉండాలి.

సాక్ష్యం ఆధారం ఉండాలి. వాదించే న్యాయవాది అన్ని విషయాలూ విడమరచి చెప్పాలి. ఇవేవీ లేకుండా పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి కోర్టులో తీర్పులు రావు. ఈ దేశంలో మాకు న్యాయం జరగదని అర్ధం అయిపోయింది అంటూ ఒక ముస్లిం నాయకుడు దారుణమైన వ్యాఖ్య చేశారు.

అప్పీలుకు వెళ్లవచ్చు కానీ ఆరోపణలు చేస్తారా?

ఇంతటి తీవ్రమైన వ్యాఖ్య చేయడం అవసరమా? లక్నో సీబీఐ కోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే అలహాబాద్ హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. అయోధ్య కేసు అలాగే వెళ్లలేదా? మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా తీర్పు రాగానే న్యాయమూర్తుల్ని తిట్టే సంస్కృతి పోకపోతే ఈ దేశానికి ఉపద్రవం వచ్చినట్లే.

కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తే న్యాయమూర్తుల్ని తిట్టే సంస్కృతి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తక మానదు. ఎన్నిక అయిన వాడే సర్వాధికారి అనే అభిప్రాయం కూడా మారాలి. గతంలో ఎన్ టి రామారావుపై ద్రోణంరాజు సత్యనారాయణ అనే కాంగ్రెస్ నాయకుడు హైకోర్టులో కేసు దాఖలు చేసినప్పుడు కేసులో ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

ఆ సమయంలో తెలుగుదేశం నాయకులు నేరుగా కాదు కానీ న్యాయస్థానాలను పరోక్షంగా విమర్శించారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చినపుడు కాంగ్రెస్ వారికి బాధ కలిగి ఉండవచ్చు. అయోధ్య తీర్పు వచ్చినప్పుడు ముస్లింలకు మనోవేదన కలిగి వుండవచ్చు.

ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నందున జగన్ ను గుడ్డిగా అభిమానించే వారికి న్యాయ వ్యవస్థ నచ్చకపోవచ్చు. ఇదే హైకోర్టులో ఒక్క అనుకూల తీర్పు వచ్చేస్తే చాలు జగన్ అభిమానులు కోర్టును పొగుడుతారు. ఇదే తెలుగుదేశం నాయకులు కోర్టును తిడతారు.

అందువల్ల తెలివితేటలు గల ప్రజలు ఈ రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుని పరాధీన మనసుతో ఆలోచించకుండా, రాజకీయాలు అతీతంగా సొంత మనసుతో ఆలోచించాలి. కోర్టులను విమర్శించినా కూడా  రాజకీయ నాయకులకు, వారి వందిమాగదులకు బాగానే ఉంటుంది. వారు ఎలాగైనా నెట్టుకురాగలరు. నలిగిపోయేది కోర్టులను ఫ్యాషన్ కోసం విమర్శించే సామాన్య ప్రజలే.    

Related posts

కొల్లాపూర్ కోటలో ప్లాట్లు కొంటే ఆగమౌతారు జాగ్రత్త

Satyam NEWS

విజయనగరం కలెక్టర్ గా సూర్యకుమారి చెరగని ముద్ర…!

Satyam NEWS

నంద్యాల ప్రాంతంలో భారీ ఎత్తున పట్టుబడ్డ డబ్బులు

Satyam NEWS

Leave a Comment