32.7 C
Hyderabad
April 26, 2024 23: 25 PM
Slider ముఖ్యంశాలు

Analysis: దుబ్బాక భంగపాటుతో దిద్దు ‘పాట్లు’

#GHMCElections

దుబ్బాక ఎన్నికల్లో దారుణమైన పరాభవం పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి దిద్దుబాట్లను చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక ఎన్నికల చేదు గుర్తులను మర్చిపోకముందే భయంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ప్రాపర్టీ టాక్స్ ను సగానికి తగ్గించి వసూలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయించారు.

15 వేల రూపాయల లోపు  ప్రాపర్టీ టాక్స్ కట్టే దాదాపు 13 లక్షల ఇండ్లకు, వాటి యజమానులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. అలాగే జిహెచ్ఎంసి పరిధిలో పని చేసిన సఫాయి కార్మికులకు వేతనాలను మూడువేల రూపాయలు పెంచుతున్నట్టు అదే నోటితో తెలిపారు.

ప్రస్తుతం 14,500 ఉన్న వారి జీతం పెంచిన 3వేలతో కలిపితే 17,500 రూపాయలు కానున్నది. ఇటీవల భారీ వర్షాలకు సర్వస్వం కోల్పోయిన వారు ఈ సేవలో‌ అప్లై చేసుకుంటే వారికి పది వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని మంత్రి తెలిపారు.

జిహెచ్ఎంసి లో గెలుపు కోసమే తాత్కాలిక తాయిలాలు

దుబ్బాక లో దారుణంగా భంగపడ్డ అధికార పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లందరిని మచ్చిక చేసుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నదని కనీస జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉన్నది. హైదరాబాద్ను విశ్వ నగరంగా చేస్తామని ప్రకటించి ఆరు సంవత్సరాలు అయినా మాటలు నీటి మూటలే అయిన సందర్భంలో అధికార పార్టీ అన్యమనస్కంగా నైనా ఈ చర్యలకు సిద్ధపడింది.

దుబ్బాక లో దిమ్మతిరిగే ఓటమి చవిచూసిన టిఆర్ఎస్ బీజేపీని ఎలాగైనా హైదరాబాదు పీఠం చేజారి పోకుండా దిద్దుబాటు చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నది. ఈ హడావిడిలో అసదుద్దీన్ ఓవైసీ తో కెసిఆర్ రహస్య చర్చలు చేయడం తెలిసిందే.

కెసిఆర్ తప్పుటడుగులు

దుబ్బాక ఫలితాలను తెలంగాణ ప్రజలే కాదు, కనీసం వేరే రాష్ట్రాల ప్రజలు కూడా మరవకముందే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తో చర్చలు చేయడం వల్ల కెసిఆర్ తనకు తెలియకుండానే బిజెపికి తమ ఓట్ల పోలరైజేషన్ లో సహాయపడ్డాడు. బిజెపి తన బలంతో కాకుండా కెసిఆర్ తప్పిదాలతో, తప్పుడు వ్యూహాలతో కష్టపడుతూ నైనా గెలుస్తూ వస్తున్నది. ఇప్పుడు హైదరాబాద్ పీఠాన్ని కైవసం చేసుకోవడం బిజెపికి సులువు చేయడంలో అధినేత నిర్ణయాలు బాగా పనికి వస్తాయని తెలుస్తున్నది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతంగా ప్రాపర్టీ టాక్స్ లు, కరోనా ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం, అధిక వర్షాలకు హైదరాబాద్ పట్టణం చిగురుటాకులా వణికిపోవడం, రోడ్లన్నీ జలమయమై పోవడం, నిజంగా హైదరాబాద్ వీధుల్లో పడవ ప్రయాణం చేయడం ఇవన్నీ ప్రజల మనసుల పైన తీవ్రమైన ముద్రను వేశాయి.

టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత జిహెచ్ఎంసి పరిధిలోని ప్రజా జీవితంలో పెద్ద మార్పు వచ్చినట్టు ఏమి కనబడడం లేదు. ప్రజలు కూడా ఈ మాటనే మనసులో పంచుకున్నట్టు కనిపిస్తుంది. ఫలితంగా తమ సంఘర్షణలకు మూలమైన టిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఎప్పటినుండో ప్రజలు నిరీక్షిస్తున్నట్టు, తగిన సమయం కోసం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో జిహెచ్ఎంసి ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి దుబ్బాక దెబ్బ ప్రేరణ కూడా కాగలదు.

ప్రజలు నమ్ముతారా?

జిహెచ్ఎంసి పరిధిలోని ప్రజలు,ఓటర్లు టిఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టడానికి సుముఖంగా ఉండరని పై కారణాల వల్ల అంచనా వేసుకోవచ్చు. గతంలో సాధించిన వంద స్థానాలు నిలబెట్టుకోవడం టిఆర్ఎస్ కు కష్టసాధ్యమే. తాత్కాలిక తాయిలాలతో ప్రజలను ప్రభుత్వాలు ఏమర్చినంత మాత్రాన ఓటర్లు లొంగే అవకాశాలు కనబడడం లేదు. కెసిఆర్ లాంటి పరిపక్వత చెందిన నాయకుడు కూడా దీర్ఘకాలిక లక్ష్యాల పైన దృష్టి నిలపకుండా కేవలం ప్రజలను లోబర్చుకునే ప్రయత్నాలు చేయడం వల్ల జిహెచ్ఎంసి అధికార పీఠం పైన మరోసారి గులాబీ జెండా ఎగుర వేయగలరా? అనే విషయం హైదరాబాద్ మహానగర ఓటర్లు మాత్రమే నిర్ణయించాలి.

– కే శ్రీనివాసాచారి, మనో విజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడు

Related posts

ఈ నెల 26న విడుదల అవుతున్న డార్క్ కామెడీ “క్షణ క్షణం”.

Satyam NEWS

మాడిపోతున్న దేశ రాజధాని ఢిల్లీ

Satyam NEWS

కీలకమైన రెండు కేసులు….: ఈ సీబీఐ కి ఏమైంది?

Satyam NEWS

Leave a Comment