38.2 C
Hyderabad
April 27, 2024 15: 59 PM
Slider ప్రపంచం

మయన్మార్ సైన్యం సృష్టిస్తున్న మారణహోమం

#Maynmar

మయన్మార్ లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. సైన్యం కాల్పుల్లో తాజాగా ఏడుగురు మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే ఉంది. అనేకమంది గాయాలపాలయ్యారు. సైనిక దమనకాండలో ఇప్పటిదాకా 70మందికి పైగా సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

బహుశా! ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందనే ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.ఈ దేశంలోని ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతోనే నిండిపోతున్నాయి.దేశ పాలనను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం, దీన్ని నిరసిస్తున్న ప్రజాస్వామ్య వాదులను కబళిస్తూనే ఉంది. నిర్ధాక్షిణ్యంగా వారిపై కాల్పులు జరుపుతూనే ఉంది.

అణచివేత ఎంతున్నా ఆగని పోరాటం

అరెస్టులు, హత్యలను లెక్కచేయకుండానే ప్రజలు పోరాడుతున్నారు. సైనిక పాలన ముగిసి, పౌర ప్రభుత్వం ఏర్పడేవరకూ ఈ యుద్ధం ఆగేట్టు లేదు. ప్రజాస్వామ్యవాదులతో పాటు జర్నలిస్టులు సైతం అరెస్టులకు గురవుతున్నారు.

దేశాధ్యక్ష స్థానం నుంచి ఆంగ్ సాన్ సూకీని దించేసిన సైన్యం దేశంలో భయోత్పాతాన్ని సృష్టిస్తూనే వుంది.ప్రజాస్వామ్య దేశాలన్నీ సైన్యం చేస్తున్న దమనకాండపై మండిపడుతూనే వున్నాయి.ఈ ఘోరకలికి ముగింపు పలకాలని పలు దేశాలు ఐక్య రాజ్య సమితిపై ఒత్తిడి తెస్తున్నాయి.

బ్రిటన్ తాజాగా భద్రతామండలిపై ఈ దిశగా ఒత్తిడి తెచ్చింది. హింసకు ముగింపు పలికి, చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య కూడా సూచించింది. మయన్మార్ లో జరుగుతున్న దుష్ట పరిణామాలను వెలుగులోకి తెచ్చిన అసోసియేటెడ్ ప్రెస్ (ఏ పి) కు చెందిన పాత్రికేయుడు థెయిన్ ఝా, మరో ఐదుగురు జర్నలిస్టులను సైన్యం అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టింది.

మీడియాపై కూడా సైనిక ప్రతాపం

ప్రజా భద్రతా చట్టం ఉల్లంఘన కింద కేసులు పెట్టి, మీడియా గొంతు నొక్కే పనిలో సైన్యం ఉంది. అయినప్పటికీ, లొంగకుండా, నిర్భయంగా సైన్యం చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా జర్నలిస్టులు కలంపోరాటం కొనసాగిస్తూనే వున్నారు. మయన్మార్ లో మొదటి నుంచీ యుద్ధకాండ కొనసాగుతూనే ఉంది.

శతాబ్దాల నుంచి ఈ దేశం దురాక్రమణలకు గురి అవుతూనే వుంది. బహుజాతుల సమ్మేళనంగా ఉన్న ఈ దేశంలో ఎప్పుడూ అంతర్గత కుమ్ములాటలు సాగుతూనే వున్నాయి. భారతదేశంలో వలె ఇక్కడ కూడా బ్రిటిష్ వారు చాలాకాలం పాటు పరిపాలించారు. అనేక పోరాటాల ఫలితంగా 1948లో స్వాతంత్య్రం వచ్చినా, దేశంలో అంతర్గత స్వాతంత్య్రం లేనే లేదు. ఏళ్ళ తరబడి సైన్యమే పరిపాలించింది.

ప్రజలకు ప్రపంచ దేశాల మద్దతు

ఇప్పుడు కూడా మళ్ళీ సైన్యమే  తన కబంధ హస్తాల్లోకి తీసుకుంది. విదేశీయుల నుంచి విముక్తి లభించినా, స్వదేశీయుల నుంచి స్వేచ్ఛ లేక ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఈ దుస్థితిని గమనిస్తున్న ప్రజాస్వామ్య దేశాలు మయన్మార్ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నాయి.

ఆ దేశ అంతర్గత విధానాల్లో జోక్యం చేసుకునే అధికారం లేక, ఆవేదనకు, అగ్రహానికే పరిమితమవుతున్నాయి. అనేక ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల ఫలంగా 2011 నుంచి ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. ఆంగ్ సాన్ సూకీ అధ్యక్షురాలుగా అధికారాన్ని చేపట్టారు.

నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధినేతగా ప్రజాస్వామ్య స్థాపనకు ఆమె అవిరళ కృషి చేస్తున్నారు.ఆమె 1990లోనే 81శాతం పార్లమెంట్ స్థానాలను సంపాయించుకుంది. అయినప్పటికీ, బర్మా ప్రభుత్వం ఆమెను గృహ నిర్బంధంలోనే ఉంచింది. 15 సంవత్సరాలకు పైగా ఆమె రాజకీయ ఖైదీగానే గృహ నిర్భంధంలోనే ఉండి చరిత్ర సృష్టించారు.

ఆమె నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు. ప్రతిష్ఠాత్మాకమైన అనేక విదేశీ పురస్కారాలు కూడా ఆమెను వరించాయి.ఆమె తండ్రి ఆంగ్ సాన్ కూడా పోరాట యోధుడు. ‘బర్మా దేశపిత’గా ఆయనకు ఎంతో ఖ్యాతి వుంది. బర్మీయుల స్వాతంత్య్రం కోసం పోరాడి ఆయన ప్రాణాలు కూడా కోల్పోయాడు.

అటువంటి తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈమె బర్మా దేశీయుల కోసం నడుం కట్టారు.ఆమె తల్లి కూడా రాజకీయ ప్రాముఖ్యతను తెచ్చుకున్న వ్యక్తి కావడం విశేషం. ఎట్టకేలకు  ఆమె 2011లో బర్మా పాలనను చేపట్టింది.విద్యావేత్త, విలువలు కలిగిన సూకీ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని అందరూ ఆశించారు.

నిరంకుశంగా వ్యవహరిస్తున్న సైన్యం

ఈ పదేళ్లల్లో కొంత ప్రగతి, శాంతి సాధించినప్పటికీ, మళ్ళీ సైన్యం దేశాన్ని చేజిక్కించుకుంది. ప్రజల చేత ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకొనబడిన సూకీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకూ సైన్యం నిద్ర పోలేదు.సైన్యం మళ్ళీ సూకీని నిర్బంధంలోకి తీసుకుంది.దీనితో ప్రజాగ్రహం పెల్లుబికింది.

లక్షలాది మంది దేశ ప్రజలు సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, వారిలో ఎటువంటి కనికరం కలుగలేదు. ఆంగ్ సాన్ సూకీ నిర్భంధాన్ని పొడిగిస్తూనే వున్నారు. ఆమెకు ప్రస్తుతం 76సంవత్సరాలు. వృద్ధాప్యంలోనూ ఆమె దేశం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.

గత ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని, అందుకే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సైన్యం చెబుతోంది. సైన్యం చెప్పే మాటలపై ప్రపంచ దేశాల్లో ఎక్కడా విశ్వాసం, గౌరవం లేదు.సూకీ ఒంటరి కారు. ఆమె వెనుక కోట్లాదిమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల వెనుక న్యాయం, ధర్మం ఉన్నాయి.

మయన్మార్ ప్రజలు పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతున్నారు. కోట్లాదిమంది ప్రజలు ఏకమైతే, అడ్డుకునే శక్తి ఏ సైన్యానికీ ఉండదు. వివిధ దేశాల మద్దతు మయన్మార్ ప్రజలకు, నాయకురాలు సూకీకి ఉండనే ఉంది. మూర్ఖత్వం, దురహంకారాన్ని వీడి,ఆంగ్ సాన్ సూకీకి మళ్ళీ ప్రభుత్వం అప్పచెప్పకపోతే, సైన్యం భారీ మూల్యం చెల్లించక తప్పదు.ప్రజాస్వామ్యాన్ని మించిన ధర్మం లేదు. మయన్మార్ లో జరుగుతున్న సైనిక దురాగతానికి ప్రజలే చరమగీతం పాడతారని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

“లెహరాయి” చిత్రం నుండి “అప్సరస అప్సరస” పాట విడుదల

Satyam NEWS

లవర్స్: మూడు రోజులకు తేలిన మృతదేహాలు

Satyam NEWS

నెహ్రూ కుటుంబంపై వ్యాఖ్యలతో నటి అరెస్టు

Satyam NEWS

Leave a Comment