టీడీపీ క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకు చంద్రబాబునాయుడు చేపట్టిన చలో ఆత్మకూరు దేశవ్యాప్త మీడియా దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ప్రాంతీయ పార్టీల రాజకీయ కార్యక్రమాలకు జాతీయ మీడియాలో పెద్దగా గుర్తింపు లభించదు. కనీస కవరేజీ కూడా దొరకదు. కానీ ఈ సారి తెలుగుదేశం చేపట్టిన చలో ఆత్మకూర్ కార్యక్రమానికి మాత్రం నేషనల్ ఛానెల్స్ హెడ్ లైన్స్ లో నిలిచింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని హౌస్ అరెస్ట్ చేయడం నుంచి ఆ తర్వాత ప్రతీ దశలోనూ అమరావతి న్యూస్ జాతీయ స్థాయిలో హైలెట్ అయింది. అసలేం జరిగిందని ఏపీలో పోలీసులు ఇంత హడావుడి చేస్తున్నారనే ఆసక్తి అంతటా ఏర్పడింది. పల్నాడులోని గ్రామాల్లో పరిస్థితి ఏమిటన్నదానిపై జాతీయ మీడియా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి. చంద్రబాబు వెళ్లాలనుకున్న ఆత్మకూరులోని పరిస్థితిని కూడా జాతీయ మీడియా చానళ్లు రిపోర్ట్ చేశాయంటే పరిస్తితి జాతీయ స్థాయిలో ఎంత ఆసక్తి కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటి వరకూ కాశ్మీర్ లో నేతల గృహనిర్బంధాల కథనాలు మాత్రమే జాతీయ మీడియా ఇచ్చింది.
ఆ స్థాయిలో ఏపీలో టీడీపీ నేతల గృహనిర్బంధం ఎపిసోడ్ ను జాతీయ మీడియా చూపించింది. ఈ నిర్బంధాలు గతంలో ఏ రాష్ట్రంలోనూ లేని స్థాయిలో ఉండటం జాతీయ మీడియాకు సైతం న్యూస్ గా మారింది. ఓ మహా ఉద్యమం ఏదో జరగబోతోందన్నట్లుగా టీడీపీలో ఓ స్థాయి నేతల దగ్గర్నుంచి చోటా,మోటా నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు బాధితుల్ని తీసుకుని ఆత్మకూరు వెళ్లినట్లయితే ఏం జరిగి ఉండేదో కానీ ఆయనను ఆపడం వల్ల ఏపీలో ఏదో జరుగుతోందన్న భావన మాత్రం దేశం మొత్తం వ్యాపించేలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జాతీయ మీడియాను సమన్వయం చేసుకుని ప్రభుత్వం తరపున అనుకూల వార్తలు ఇప్పించుకునే ప్రయత్నం చేయడంలో ఏపి ప్రభుత్వం విఫలం అయింది. అనుకూల వార్తల సంగతి దేవుడెరుగు కనీసం పల్నాడులోని వాస్తవ పరిస్థితిని జాతీయ మీడియాలో వచ్చేలా చేసుకోవడం లో కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, వైసిపి పార్టీ యంత్రాంగం కూడా విఫలం అయ్యాయి.