26.7 C
Hyderabad
May 3, 2024 10: 12 AM
Slider తూర్పుగోదావరి

జగ్గంపేట వైసీపీలో కూడా అంతర్గతంగా మరో పోరు

#totanarasimham

వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు … మాజీ ఎంపీ తోట నరసింహం మద్య కోల్డ్ వార్

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పోరు అధికంగా కనిపిస్తోంది. ఇప్పటికే కోనసీమ జిల్లాలో ఎంపీ బోస్, మంత్రి చెల్లుబోయిన వర్గాల మధ్య విభేదాలు రచ్చాకెక్కాయి. చివరకు సీఎం జగన్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ మంటలు చల్లారక ముందే తాజాగా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు … మాజీ ఎంపీ తోట నరసింహం మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత 2-3 ఏళ్ళుగా తోట నరసింహం ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన కుమారుడు తోట రాంజీ నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. తోట నరసింహం మళ్ళీ కోలుకోవడంతో జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన కుమారుడు రాంజీ ఎమ్మేల్యే జ్యోతుల చంటిబాబుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. “పంది ఎంత బలిసినా అది పందే అవుతుంది తప్ప ఏనుగు కాలేదు. ఇక్కడ ఎమ్మెల్యే (జ్యోతుల చంటిబాబు) పరిస్థితి కూడా సరిగ్గా ఇదే నని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే చంటిబాబు  ఇక్కడ మరో పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు తిరిగినా మా తండ్రిగారికే ప్రజలు, కార్యకర్తలు మద్దతు ఉంటుందనీ, ఎమ్మెల్యే మా నాన్నగారి గురించి ఏదేదో వాగుతున్నారు.

వాటికి నేను కాదు మా నాన్నగారే సరైన సమాధానం చెపుతారు. వచ్చే ఎన్నికలలో జగ్గంపేట నుంచి ఆయనే పోటీ చేయబోతున్నారు. ఇది తధ్యం. కనుక ఆయనే నీ లెక్కలన్నీ తేల్చేస్తారు,” అని హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. తోట నరసింహం మాట్లాడుతూ, “రాజకీయాలు మాకేమీ కొత్తకాదు. అవి మా రక్తంలోనే ఉన్నాయి. ఒక్క గంట టైమ్ ఇస్తే చాలా నీ సంగతి తేల్చేస్తానని హెచ్చరించారు.

ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు 100 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేశావని ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ ఆరోపించినప్పుడు సమాధానం చెప్పుకోలేకపోయావు కదా?కనీసం నీ అనుచరులు ఎవరూ కూడా వారి ఆరోపణలను ఖండించలేకపోయారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో జగ్గపేట నుంచి నేనే పోటీ చేస్తాను. దమ్ముంటే మళ్ళీ టికెట్‌ సంపాదించుకో,” అంటూ తోట సవాల్ విసిరారు.

వైసీపీ నేతల మద్య విభేదాలు, టికెట్ల కోసం జరిగే ఇటువంటి కొట్లాటలలోనే ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో కూడా వారి నోటితోనే స్వయంగా బయటపెట్టుకొంటున్నారు. తోట నరసింహం లెక్క ప్రకారం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఖాతాలో 100 ఎకరాలు వేసుకొన్నారని తేలింది కదా.. అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత ఎన్నికలలో జగ్గంపేట నుంచి టిడిపి అభ్యర్ధిగా జ్యోతుల నెహ్రూ పోటీ చేశారు కానీ వైసీపీ ప్రభంజనంలో ఓడిపోయారు.

అయితే ఈసారి అటువంటి ప్రభాజనాలు ఏమీ ఉండవు. పైగా వైసీపీ ఇద్దరూ కుమ్ములాడుకొంటున్నారు కూడా. మరో విషయం ఏమిటంటే జగ్గంపేటలో కాపు సామాజికవర్గం చాలా బలంగా ఉంది. ఒకవేళ టిడిపి, జనసేనలు కలిసి పనిచేస్తే వారి ఓట్లు తనకే పడతాయని కనుక వచ్చే ఎన్నికలలో తాను అవలీలగా గెలవగలనని జ్యోతుల నెహ్రూ నమ్మకంగా ఉన్నారు. మరి జగ్గంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం, టిడిపి నేత జ్యోతుల నెహ్రూలలో ఎవరి రాజకీయం ఫలిస్తుందో చూడాలి.

Related posts

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నోటీస్

Sub Editor

విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌ బాబు బదిలీ

Satyam NEWS

యాదాద్రి వద్ద భారీ ఎత్తున పట్టుబడ్డ బంగారం

Satyam NEWS

Leave a Comment