38.2 C
Hyderabad
April 29, 2024 21: 22 PM
Slider ప్రత్యేకం

‘‘మాట తప్పి…మడం తిప్పి మా మనసుల్ని గాయపరచద్దు జగన్’’

#raghurama

మూడు రాజధానుల విషయంలో బిల్లును సెలక్టు కమిటీకి పంపిన శాసన మండలిపై అప్పటిలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరగారు. శాసన మండలి ఉండటం వల్ల ప్రజాధనం వృధా అవుతున్నదని ఏకంగా మండలి రద్దుపై శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది. ఇప్పుడు పరిస్థితి మారింది. శాసన మండలిలో ఖాళీ అయిన స్థానాలను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అభ్యర్ధులతో నింపేస్తున్నారు. క్రమంగా శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నది. ఈ దశలో ‘‘శాసన మండలి రద్దు’’ అంశంపై మాటపై ఉంటారా? మడం తిప్పుతారా? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంచలనాత్మక లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం:

21 జూన్, 2021

శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి

ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్

విషయం: ఏపి శాసన మండలి రద్దు

సూచిక: నవ ప్రభుత్వ కర్తవ్యాలు లేఖ 2

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ,

అధికారంలోకి వచ్చి రెండు సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఏపి శాసన మండలిలో మెజారిటీ సాధించినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా 2020 జనవరి 27న అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం గురించి మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. రాష్ట్ర రాజధానిని మూడు భాగాలు చేయాలనే మీ తలంపును బిల్లు రూపంలో శాసన మండలిలో ప్రవేశ పెట్టినప్పుడు దానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైనందున ఏకంగా మండలినే రద్దు చేయాలని మీరు భావించి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

శాసన మండలిని మరికొంత కాలం కొనసాగిస్తే మెజారిటీ వస్తుందని తెలిసినా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే సంకల్పం ముందు మండలిలో బలం సాధించడం అనేది పెద్ద విషయం కాదని తమరు గౌరవ శాసనసభలో చెప్పినట్లుగా నాకు లీలగా గుర్తుకువస్తున్నది. అందువల్లే శాసన మండలిని రద్దు చేసే తీర్మానాన్ని అందరూ ఆమోదించాల్సిందిగా కూడా మీరు కోరినట్లు గుర్తు.

మీకు అత్యంత అభిమానులమైన మాకు మీ గురించి సంపూర్ణంగా తెలుసు. మీరు మాట తప్పరు మడమ తిప్పరు. మీరు చెప్పిన మాటపై మీరు వెనక్కి వెళ్లరనేది మాలాంటి అభిమానుల నమ్మకం.

శాసన మండలిని కొనసాగించడం వల్ల ఎంతో ప్రజాధనం వృధా అవుతుందని, ఎంత విలువైన సమయం కోల్పోతున్నామని మీరు శాసన మండలిలో బలం లేనప్పుడు చెప్పిన విషయాలను చాలా మంది నమ్మ లేదు. కారణం ఏమిటంటే మీకు శాసన మండలిలో బలం లేదు కాబట్టి అలా చెబుతున్నారనే అనుకున్నారు.  అయినా సరే మీరు మాత్రం శాసన మండలి వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదని, ప్రజాధనం ఒక్క రూపాయి అయినా సరే దానిపై ఖర్చు చేయడం వృధా అని మీరు శాసనసభలో నొక్కివక్కాణించారు.

ఏడాదికి రూ.60 కోట్లు ఎవరికి ఉపయోగం లేని శాసన మండలిపై ఖర్చు చేయడం అవసరమా అని మీరు గట్టిగా వేసిన ప్రశ్న పై కూడా ప్రజలు కొందరు అనుమానాలను వ్యక్తం చేశారు. మీరు ఎంత గట్టిగా మీ అభిప్రాయాన్ని చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. ఇలా ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా లాంటి మీ గాఢమైన అభిమానుల గుండెల్ని తీవ్రంగా గాయపరిచాయి.

వ్యక్తిగత విలాసాలకు రూ.26 కోట్లు ఖర్చు చేసినా మేం అడగం

శాసన మండలిని నిర్వహించడం వల్ల ఎంతో ప్రజాధనం వృధా అవుతుందని చెబుతున్న మీరు, మీ విలాసాలకు, మీ విమానాలకు  జూన్ 2019 నుంచి నవంబర్ 2020 వరకూ దాదాపుగా రూ.26 కోట్లు ఖర్చు చేశారని మీరంటే గిట్టని వారు, మీ ప్రత్యర్థులు వ్యాఖ్యానించడం మాలాంటి అభిమానులకు తీవ్ర మనోవేదన కలిగించింది.

మీ ప్రత్యర్థులు వేసిన ప్రశ్నలకు, చేసిన ఆరోపణలకు కచ్చితమైన సమాచారం చెప్పే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇప్పుడు మన పార్టీకి శాసన మండలిలో పూర్తి మెజారిటీ వచ్చింది. అందువల్ల మెజారిటీ మన పక్షానే ఉన్నందున తక్షణమే శాసన మండలిని సమావేశ పరిచి శాసన మండలిని వెంటనే రద్దు చేయాలని తీర్మానం చేయడం సబబు గా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఇప్పటి వరకూ మిమ్మల్ని విమర్శించిన వారికి తగిన సమాధానం చెప్పినట్లు అవుతుంది. ఆ సమయంలో మీరు చేసిన వ్యాఖ్యలకు కట్టబడి ఉన్నట్లుగా కూడా అవుతుంది.

మీరు అప్పటిలో శాసనసభలో ఆమోదించి పంపిన మండలి రద్దు తీర్మానం రాజ్యాంగంలోని 169(1) అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచాల్సి వస్తుంది. మండలిని రద్దు చేయాలా లేక ఉంచాలా అనే అంశంపై పార్లమెంటులో చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.

మీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే పార్లమెంటు సభ్యుడిగా నేను, నా సహచర పార్లమెంటు సభ్యులం అందరం 2020 సెప్టెంబర్ 14న మీరు వీడియో కాన్ఫరెన్సు లో చెప్పినట్లు ఈ అంశాన్ని వచ్చే నెల 19 నుంచి జరగబోతున్నట్లు చెబుతున్న పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించి మండలి రద్దు చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకునే విధంగా కోరతాము.

ఆత్మను అమ్ముకున్న కొందరు నాపై ఇటీవలి కాలంలో కొన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా పార్టీ అభిప్రాయాలను గుడ్డిగా నమ్మి అత్యంత విధేయతతో అనుసరించే నేను శాసన మండలి రద్దు గురించి పార్లమెంటులో ప్రస్తావించి మీరు ఇప్పటి వరకూ చెప్పిన మాటలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను.

మీ అభిమానిగా చెబుతున్నాను కౌన్సిల్ రద్దు పై మాట మార్చద్దు

అదే విధంగా ఎవరు ఏమన్నా మీ వ్యక్తిత్వం చెదిరేది కాదని మరొక్క మారు నిరూపించాలని కూడా నేను భావిస్తున్నాను. మీ కోరికలను తీర్చుకోవడానికి మీరు ఎంత పట్టుదలతో ఉంటారో నాకు బాగా తెలుసు. డబ్బుకు అమ్ముడుపోయిన కొందరు వ్యక్తులు నా దిష్టి బొమ్మ దగ్ధం చేసినా నేను అవేవీ పట్టించుకోకుండా మీ మాటలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తానని తెలియచేసుకుంటున్నాను.

తద్వారా మీరు మాట తప్పని మనిషిగా నిరూపించే బాధ్యతను నా భుజస్కంధాలపై మోసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని తెలియ చేస్తున్నాను. నా సహచరులతో కూడా కలిసి మీ మాటతప్పని నైజాన్ని పార్లమెంటు ద్వారా దేశ ప్రజలకు కూడా వెల్లడించేందుకు కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చి ఆంధ్ర్రప్రదేశ్ శాసన మండలి రద్దు జరిగేలా ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

యాదగిరి గుట్టలో విషాదం: భవనం నేల కూలి నలుగురి మృతి

Satyam NEWS

మూఢ నమ్మకం అయినా సరే వాస్తు గెలిచింది

Satyam NEWS

వివేకా హత్య కేసు నిందితుడికి బెయిల్ మంజూరు

Satyam NEWS

Leave a Comment