30.7 C
Hyderabad
April 29, 2024 04: 53 AM
Slider జాతీయం

Attention: నిరాశ వద్దు సోదరా కరోనా చచ్చేరోజు ఉంది

#corona treatment

కరోనా వైరస్ అనే అంశం మనుషుల్ని నిస్తేజానికి, నిర్వీర్యానికి, నిరాశలకు గురి చేస్తోంది. కొన్ని వార్తలు, మరి కొంత సమాచారం భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి. ఇవి  మనుషుల్ని మరింత  చీకట్లోకి తీసుకెళ్తున్నాయి. మనిషి ఆశాజీవి. రేపు వెలుగులు ఉంటాయని, ఆశిస్తాడు. భావిస్తాడు.

మనిషిలో రేపటి పట్ల విశ్వాసం లేకపోతే, ఈరోజు బతకలేడు. కొన్ని వార్తలు, కొన్ని సమాచారాలు చేదు నిజాలు కావచ్చు. అన్నింటా అవే కావు. తీపి కబుర్లు ఉన్నాయి. విజయ గాథలు ఉన్నాయి. వాటిని తలచుకుందాం. కొండంత వెలుగును చూద్దాం.

బతుకు సమయంలో చీకటి వెలుగులు ఉన్నట్లే, కరోనా ప్రభావ ప్రపంచంలో ఉషోదయాలు ఉన్నాయి. కరోనా బారిన పడి బాధపడే వారితో పాటు, గెలిచి, ఆత్మవిశ్వాసం పెంచేవారూ ఉన్నారు. చిన్న పిల్లలు, ముసలివాళ్ళు కూడా కరోనా సోకిన తర్వాత, చికిత్స అనంతరం  త్వరగా, బాగా  కోలుకున్నవారు కూడా చాలామంది ఉన్నారు.

కోలుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండికూడా,  కరోనా సోకి, ఆరోగ్యంగా బయటకు వస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. కరోనా సోకి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నయమైన వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ దేశంలో సుమారు 11లక్షల 20వేల కేసులు నమోదయ్యాయి. వారిలో,7లక్షల మంది కోలుకొని,సాధారణ జీవితం గడుపుతున్నారు.

3 లక్షల,90 వేలమంది చికిత్స పొందుతున్నారు. 27వేలమంది మరణించారు. దాదాపు 65శాతం మంది కోలుకొని బయటకు వచ్చారు. ఇది భారతదేశంలో సగటు రీకవరీ రేటు. కరోనా సోకిన వారిలో 2.5 శాతం మంది మాత్రమే  మరణించారు. అంటే, 97.5శాతం  సురక్షితంగా ఉన్నారు.

మిగిలిన దేశాలతో పోల్చుకుంటే, 139కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కరోనా ప్రభావం తక్కువే, అని చెప్పాలి. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో, 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దేశంలోని సగటు రికవరీ రేటు కంటే ఎక్కువ నమోదు చేసుకున్నాయి.

కొన్ని రాష్ట్రాలలో రికరవరీ రేటు మరీ ఎక్కువ

లడాఖ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గడ్, హిమాచల్ ప్రదేశ్,  హర్యానా, చండీ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో రికవరీ రేటు 75-85 శాతం వరకూ ఉంది. త్రిపుర, బీహార్, పంజాబ్, మిజోరాం, అస్సాం, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్  రాష్ట్రాల్లో, దేశ సగటుతో సమానంగా కొన్నిచోట్ల , సగటుకు మించి మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి.

కరోనాకు చరమగీతం పాడే వ్యాక్సిన్ల రూపకల్పనా ప్రక్రియ రోజు రోజుకూ వేగవంతమవుతోంది. భారతదేశంలో కొన్ని ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు వ్యాక్సిన్ల తయారీ చేపట్టాయి. ప్రపంచంలోని వివిధ దేశాలలోనూ ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రపంచంలో ఆక్సఫర్డ్ చాలా ప్రతిష్ఠాత్మకమైన సంస్థ. వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలకమైన పురోగతులు కనిపిస్తున్నాయి.

ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ తొలి దశలు పూర్తయ్యాయి

ఆక్సఫర్డ్ రూపొందించిన వ్యాక్సిన్ మానవులపై చేసిన తొలి దశ క్లినికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని సమాచారం. కరోనా వైరస్ నుండి మనిషిని రక్షించడంలో రెట్టింపు శక్తి ఈ వ్యాక్సిన్ కు  ఉన్నట్లుగా ఈ పరీక్షలు చెప్పడం గొప్ప పరిణామం.

వ్యాక్సిన్ ప్రయోగించిన వాలంటీర్ల నుండి నమూనాలు సేకరించి, పరిశీలించిన శాస్త్రవేత్తలు కీలకమైన అంశాలను గుర్తించారు. వైరస్ ను చంపే టి-కణాల ఉత్పత్తి, యాంటీ బాడీలు తయారవ్వడానికీ  ఈ వ్యాక్సిన్ ప్రేరేపిస్తున్నట్లు నమూనాలు చెబుతున్నాయని సమాచారం. ఇది చాలా ఆశావహమైంది.

ఇది ఒక ప్రయాణం…

అయితే, సుదీర్ఘకాలం పాటు వైరస్ నుండి రక్షణ ఎంతవరకూ లభిస్తుందనేది, ఇంకా తేలాల్సి ఉంది. వ్యాక్సిన్ ప్రయోగాలలో ఇంకా అనేక దశలు ఉన్నాయి. ఇవన్నీ ఫలవంతమవ్వాలి. ఇదొక పెద్ద ప్రయాణం. ఇందులో తొలి అడుగులు విజయవంతం కావడం శుభ పరిణామం.

తర్వాత జరిగే ప్రయోగాలు వేలమందిపై చెయ్యాల్సి ఉంటుంది. సెప్టెంబర్ కల్లా తేవాలనే దృఢ నిశ్చయంతో ఆక్సఫర్డ్ ఉంది. వ్యాక్సిన్ ప్రయాణంలో అనూహ్యమైన పరిణామాలు కూడా ఉంటాయి. వ్యాక్సిన్ తయారీలో,   హైదరాబాద్ లోని నిమ్స్ లో,  క్లినికల్ ట్రైయల్స్ లో భాగంగా,  గడచిన సోమవారం నాడు ఇద్దరు వాలంటీర్లకు తొలి డోస్ ఇచ్చారు. 

తయారీ పలుచోట్ల వివిధ దశల్లో సాగుతోంది. ప్రపంచంలో, కొన్ని దేశాల్లో రెండో దశ ప్రయోగాలు కూడా పూర్తయ్యాయి. భారతదేశంలోని వివిధ కంపెనీల తయారీ విధానం  కూడా పలు దశల్లో ఉంది. మొత్తంమీద, 2020లోపు కొన్ని కంపెనీల వ్యాక్సిన్లు  అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిగిలిన సంస్థలవి 2021మార్చి -జులై మధ్యలో రావడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ఊరట ఇచ్చే అంశం. వ్యాక్సిన్ ను సంజీవినిగా భావించాలి. వ్యాపారాలు, రాజకీయాలు, కీర్తి వ్యామోహాలకు అతీతంగా ఔషధాలు, వ్యాక్సిన్ల రూపకల్పన జరగాలి.

సంపూర్ణమైన రక్షణ కల్పించి, వైరస్ ను తుది వరకూ మట్టికరిపించే వ్యాక్సిన్ల తయారీయే ఏకైక లక్ష్యం కావాలి. దేశభక్తి, మానవత్వం ఉన్న సంస్థలు, శాస్త్రవేత్తలు  ఈ భూమిపై ఉన్నారు. వీరందరూ సాధ్యమైనంత త్వరలోనే కరోనా నుండి ప్రపంచాన్ని రక్షిస్తారని విశ్వసిద్దాం. కొన్ని నెలల పాటు జాగ్రత్తలు పాటిస్తూ, ధైర్యంగా ఉందాం. 2021లో కరోనాను పూర్తిగా మరచిపోదాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ఆ పుస్తకాన్నిపిల్లలే కాదూ పెద్దలూ చదవాల్సిందే!

Sub Editor

నిత్యావసరాలు పంచిపెట్టిన అంబర్ పేట్ శంకర్

Satyam NEWS

పోలీసు “స్పందన” కు ఎంతమంది బాధితులు ఫిర్యాదు ఇచ్చారో తెలుసా…!

Satyam NEWS

Leave a Comment