తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీలలో బ్యాంకు సిబ్బంది సమ్మె చేయబోతున్నారు. వేతనాలు 20 శాతం పెంచాలని, వారానికి అయిదు రోజుల పని దినాలు అమలు చేయాలని, కొత్త పింఛను విధానం రద్దు చేసి పాత విధానం అమలు చేయాలనేవి వారి డిమాండ్లు. అదే విధంగా కుటుంబ పింఛను శాతం పెంచాలని, కాంట్రాక్టు, బిజినెస్ కరస్పాండెంట్లకు సమాన పనికి సమాన వేతనం కల్పించడం వంటి డిమాండ్లతో దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజులు, మార్చి 11,12,13 తేదీల్లో సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈలోగా సమస్యలు పరిష్కరించకుంటే డిమాండ్ల సాధనకు ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని ఆయా సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపు నివ్వడంతో ఆయా రోజుల్లో నగదు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఖాతాదారులు ముందస్తుగా అప్రమత్తం కాకుంటే ఆర్థిక లావాదేవీల నిర్వహణకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.