37.2 C
Hyderabad
May 2, 2024 13: 42 PM
Slider ప్రత్యేకం

రఘురామకృష్ణంరాజుకు భారీ ఊరట కల్పించిన సుప్రీంకోర్టు

#Raghuramakrishnamraju

ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ సీబీసిఐడి పోలీసుల కష్టడీలో ఉన్న తనపై దాడి జరిగిందని రఘురామకృష్ణంరాజు ఆరోపించిన విషయం తెలిసిందే.

ఆయన కాళ్లకు తీవ్ర గాయాలు ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో కూడా టెస్టు చేయించాలని కోర్టు ఆదేశించినా సీఐడి పోలీసులు ఆ విధంగా చేయకుండా గుంటూరు జైలుకు తరలించారు.

ఈ నేపథ్యంలో తన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన అంశంపై రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజు ను వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది.

జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బి ఆర్ గవాయ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం రఘురామకృష్ణంరాజుకు ఊరట కలిగించే అంశం. రఘురామకృష్ణంరాజును 14వ తేదీన ఏపి సీఐడి పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు.

ఆ తర్వాత ఆయనను గుంటూరు కు తరలించారు. మరునాడు సిఐడి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టగా తనను చిత్ర హింసలకు గురి చేశారని రఘురామకృష్ణంరాజు కోర్టుకు తెలిపారు. రఘురామకృష్ణంరాజు శరీరంపై ఉన్న గాయాలను సీఐడి కోర్టు న్యాయమూర్తి చూశారు.

ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని ఆయనకు తదుపరి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వైద్య పరీక్షలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై వాదోపవాదాలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది.

సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణంరాజుకు నేడే వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నియమించే జ్యుడీషిలయ్ అధికారి ఎదుట వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షలను వీడియో తీసి సీల్డు కవర్ లో తమకు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండాలని, ఈ సమయం మొత్తం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నట్లుగానే భావించాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే శుక్రవారంనాడు జరుగుతుంది. రఘురామకృష్ణంరాజు తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందున ప్రభుత్వం రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేసిందని ఆయన కోర్టుకు తెలిపారు. తన ప్రాణానికి ముప్పు ఉందని చెప్పిన రఘురామకృష్ణంరాజుకు ఢిల్లీ హైకోర్టు వై క్యాటగిరీ భద్రతను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన కోర్టుకు విన్నవించారు.

రఘురామకృష్ణంరాజు చేసిన ప్రసంగాలలో ఎక్కడా రెచ్చగొట్టే పదాలు లేవని, ప్రభుత్వాన్ని అస్ధిరపరచే కుట్ర ఏదీ లేదని ఆయన చెప్పారు. అందువల్ల ఆయనపై దేశ ద్రోహం కేసు మోపడం కరెక్టు కాదని ముకుల్ రోహత్గి అన్నారు. పుట్టిన రోజు నాడు ఆకస్మికంగా అరెస్టు చేయడమే కాకుండా 300 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేయించిన పోలీసులు ఆయనను కష్టడీలో చిత్రహింసలు పెట్టారని ముకుల్ రోహత్గి వెల్లడించారు.

ఆయనకు పెట్టిన చిత్ర హింసలపై ప్రభుత్వ వైద్యులతో, ఒక ప్రయివేటు ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన సుప్రీంకోర్టుకు వివరించారు. రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏపి హైకోర్టు ఒక మెడికల్ బోర్డును ఏర్పాటు చేసిందని అయితే ఆ బోర్డుకు నేతృత్వం ఒక గైనకాలజిస్టుకు అప్పగించారని, ఆమె భర్త ప్రభుత్వంలో న్యాయ విభాగంలో పని చేస్తున్నారని ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు.

మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించవచ్చునని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే సూచించగా అందుకు రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది ఆదినారాయణ రావు అభ్యంతరం చెప్పారు. ఎయిమ్స్ బోర్డులో అధికార పార్టీ ఎంపిలు సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు. దాంతో సుప్రీంకోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రాజును తరలించాలని నిర్ణయానికి వచ్చింది.

Related posts

నాట్ ఇన్ థట్ వే :భారత్ పై మలేసియా ప్రతీకారామా?

Satyam NEWS

ఆటో బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

Satyam NEWS

ఉదారత చాటిన దళిత గిరిజన ప్రజాప్రతినిధులు

Satyam NEWS

Leave a Comment