38.2 C
Hyderabad
April 29, 2024 20: 43 PM
Slider సంపాదకీయం

ట్విస్ట్: అన్నయ్యా అర్జెంటుగా చేయాల్సింది ఏముంది?

amith sha kcr ys

అమరావతి అంశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి జోక్యం చేసుకుంటుందని ఆశతో ఉన్నవారికి నిరాశ తప్పదు. ఒక్క అమరావతి విషయంలోనే కాదు, తెలుగు రాష్ట్రాలలో ఏ విషయంలో కూడా కేంద్రం జోక్యం చేసుకునే అవసరం ఉందని కేంద్రంలోని బిజెపి భావించడం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రెండు పార్టీలూ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే అవకాశమే లేనందున తమకు అర్జెంటుగా వచ్చిన అసాయమేమీ లేదని బిజెపి భావిస్తున్నది. అందుకే మూడు స్తంభాల ఆటను రాబోయే నాలుగున్నర ఏళ్లు కూడా సాగదీయాలనే బిజెపి అనుకుంటున్నది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు. అందువల్ల కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం లేదు. బిజెపికి ఇది చాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసిపికి ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ గత ఎన్నికలలో కాంగ్రెస్ తో అంటకాగింది.

అంతే కాకుండా తనను జైలుకు పంపింది సోనియాగాంధీ అని బలంగా నమ్ముతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు వెళ్లరు. అందువల్ల అక్కడ కూడా బిజెపి సేఫ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలూ కాంగ్రెస్ ను తమ ప్రధాన శత్రువుగా భావించడం చాలని బిజెపి అనుకుంటున్నది.

అర్జెంటుగా ఈ రెండు రాష్ట్రాలలో అధికారంలోకి రావడంగానీ, అత్యధికంగా ఎంపి సీట్లు గెలవడం గానీ కుదిరే పని కాదని ఆ పార్టీ నాయకులకు అర్ధం అయింది. అందువల్ల తదుపరి చర్యలను బిజెపి తీసుకునే అవకాశం లేదు. తెలంగాణ లో కేసీఆర్ కు ఆటంకాలు ఏర్పరిస్తే కాంగ్రెస్ పుంజుకుంటుంది. అలానే ఆంధ్రాలో జగన్ కు ఆటంకాలు ఏర్పాటు చేస్తే బిజెపికి ప్రయోజనం రాదు. ఆ బెనిఫిట్ తెలుగుదేశం పార్టీకి పోతుంది.

అందువల్ల ఆంధ్రాలో బిజెపి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి రాజధానిని కదిలించే ప్రయత్నాన్ని అడ్డుకునే అవకాశం కనిపించడం లేదు. పైగా ఇటు టిఆర్ఎస్ అటు వైసిపి కూడా అవసరమైనప్పుడు బిజెపికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. అందువల్ల బిజెపికి అర్జెంటుగా వచ్చిన నష్టం ఏమీ లేదు.

కాబట్టి పౌరసత్వ చట్టంపై టిఆర్ఎస్ అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేసినా, వైసిపి ఇప్పుడిప్పుడే రోడ్డు మీదకు వచ్చి ఉద్యమం చేస్తున్నా కూడా బిజెపి పట్టించుకోవడం లేదు. ఈ రెండు పార్టీల సర్వైవల్ కు అడ్డుపడితే తమకు వచ్చే లాభం లేదు కాబట్టి కమలనాథులు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఈ రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలు ఏం చేసినా అడ్డు చెప్పడం లేదు. అందువల్ల మరో నాలుగున్నర ఏళ్ల పాటు ఈ మూడు స్తంభాల ఆట తప్పదు.

Related posts

మాణిక్యాలరావుపై అసత్య ప్రచారం

Satyam NEWS

దళితులపై జరిగే దాడులపై ఎస్సీ కమీషన్ తక్షణమే చర్యలు చేపట్టాలి

Satyam NEWS

ఈ సారి పోలీసు స్పందనకు వచ్చిన ఫిర్యాదులెన్నో తెలుసా..

Satyam NEWS

Leave a Comment