38.2 C
Hyderabad
April 29, 2024 20: 17 PM
Slider ప్రత్యేకం

పి వి నరసింహారావు ‘కాలాతీతుడు’ కవిమిత్రులకు ఘన సత్కారం

#manjulasurya

దేశం ఆర్ధికంగా పతనం అంచున ఉన్న సమయంలో ప్రధాని బాధ్యతలు చేపట్టి సరళీకృత విధానాల ద్వారా దేశానికి మళ్లీ పునర్వైభవాన్ని తీసుకువచ్చిన ధీరోదాత్తుడు మన పి వి నరసింహారావు అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. అంతటి మహోన్నతుడైన పి వి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు.

పి వి నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన 9 గ్రంథాలలో ఒకటైన ‘‘కాలాతీతుడు’’ కవితల సంకలనం రచయితలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పి వి నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి హాజరై కాలాతీతుడు పుస్తకాన్ని సభికులకు అందచేశారు.

తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణా సాహిత్య అకాడమి, హైదరాబాద్ పాత నగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత డా. కాంచనపల్లి అధ్యక్షత వహించారు. హైదరాబాద్ పాత నగర కవుల వేదిక కన్వీనర్ కె.హరనాథ్ సభకు ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఉత్తరాదికి అందునా ఉత్తర ప్రదేశ్ కు పరిమితమైన ప్రధాని పదవిని దక్షిణాదికి పరిచయం చేసిన కారణజన్ముడు పి వి నరసింహారావు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మహనీయుడిని స్మరించుకోవడం బాధ్యతగా భావించారని శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని మామిడి హరికృష్ణ గుర్తు చేశారు.

ముందుగా జ్యోతిప్రజ్వలనం చేసి సభను ప్రారంభించిన సురభి వాణీదేవి కాలాతీతుడు పుస్తకంలో పి వి నరసింహారావు వ్యక్తిత్వాన్ని ఎంతో మహోన్నతంగా ప్రతిబింబించిన కవులకు, కవయిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్, ప్రముఖ రచయిత డా. ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ పి వి నరసింహారావు రాజకీయాలలోకి రాకపోయి ఉంటే సాహిత్యంలో నోబెల్ బహుమతిని తెచ్చి ఉండేవారని అన్నారు.

పి వి నరసింహారావు చేసిన రచనలు రవీంద్రనాథ్ టాగోర్ స్థాయిలో ఉంటాయని ఆయన తెలిపారు. సత్యం న్యూస్ చీఫ్ ఎడిటర్ పులిపాక సత్యమూర్తి మాట్లాడుతూ పి వి నరసింహారావు లాంటి మహోన్నతుడి వ్యక్తిత్వాన్ని కవులు ఎంతో ప్రతిభావంతంగా చిన్న కవిత్వంలో పొందుపరచారని అన్నారు.

తెలంగాణ ప్రాంతంలోని మారు మూల ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రా లోని అరకు, పాడేరు, రంపచోడవరం లాంటి ప్రాంతాల నుంచి కూడా కవులు స్పందించి పి వి నరసింహారావు పై కవిత్వాలను అందచేశారని తెలిపారు. పి వి పై కొత్త తరం రచయితలు కూడా కవిత్వం రాయడం ఎంతో ఆనందం కలిగించిందని, అన్ని వయసుల వారూ పి వి ని గుర్తు పెట్టుకుని ఆయన జీవితాన్ని అధ్యయనం చేశారనడానికి ఇది నిదర్శనమని అన్నారు.

పి వి పై కవితలను సత్యంన్యూస్.నెట్ లో ప్రచురించామని, ఆ తర్వాత వాటిలో శ్రేష్టమైన వాటిని ప్రముఖ రచయితల కమిటీ ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. వరంగల్ కు చెందిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్ పర్సన్ డా. కె.అనితారెడ్డి మాట్లాడుతూ పి వి నరసింహారావు ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపిన మహనీయుడని అన్నారు.

కాలాతీతుడు కవిత్వ సంకలనంలో ప్రచురితమైన కవిత్వాలలో మొదటి బహుమతి పొందిన నూటెంకి రవీంద్ర (లోపలి మనిషి), ద్వీతీయ బహుమతి పొందిన గుండేటి వెంకటరమణ (బలగం లేని బలమైన నాయకుడు), తృతీయ బహుమతులు పొందిన అరుణ నారదభట్ల (తోరణాలు) పి.వి.యస్ కృష్ణకుమారి (నీవు ఎవరు) మంజుల సూర్య (పి.వీ.ఠీవి) లను ఎమ్మెల్సీ వాణీదేవి సన్మానించి పారితోషికం అందచేశారు.

హైదరాబాద్ పాత నగర కవుల వేదిక కన్వీనర్ కె.హరనాథ్ దంపతులు ముఖ్య అతిధి ఎమ్మెల్సీ వాణీదేవిని సత్కరించి మెమెంటో అందచేశారు. అనంతరం శ్రీ శుభకృత్ ఉగాది సందర్భంగా 30మంది కవులతో డా. వడ్డేపల్లి కృష్ణ, డా.కాంచనపల్లి, డా. ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు.

Related posts

పోస్ట్ ప్రొడక్షన్ లో ”నేనే సరోజ” !

Satyam NEWS

బిఆర్ఎస్ కార్యకర్తల కేనా సంక్షేమ పథకాలు

Bhavani

హయాత్ మీటింగ్: ఎట్టకేలకు స్పందించిన బిజెపి

Satyam NEWS

Leave a Comment