33.7 C
Hyderabad
April 29, 2024 02: 41 AM
Slider ప్రత్యేకం

ఇక ప్రతీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాత్ర కీలకం

#kavitakalvakuntla

ఇక ప్రతి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా పని చేయనుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆదివారం భూపాలపల్లిలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సమ్మేళనంలో పాల్గొని ఆమె ప్రసంగించారు.  సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతిగా వ్యవహరిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం ప్రతీ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను అమ్ముతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలు వస్తాయని, దాంతో అట్టడుగున ఉంటే పేద బిడ్డలకు ఉద్యోగాలు లభిస్తాయని, మరి ఆ సంస్థలను అమ్మితే రిజర్వేషన్లు కోల్పోయి  ఆ వర్గాలు  నష్టపోతాయని అన్నారు. “ఏదో మోడీ ఇది అమ్ముతున్నడు… అది అమ్ముతున్నడని ఉట్టిగా అంటలేం. సంస్థలను అమ్మడానికి మరీ దారుణంగా, ఏ మాత్రం సిగ్గు లేకుండా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు.

మనం బీసీ సంక్షేమ శాఖ పెట్టమంటే పెట్టడం లేదు కానీ ఉన్న సంస్థలను అమ్మడానికి ప్రత్యేక శాఖను పెట్టారు. దానికి దీపం అని పేరు పెట్టి ప్రజల జీవితాల్లో బీజేపీ ప్రభుత్వం చీకటి నింపుతోందని ” విమర్శించారు. బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలు దేశమంతా చెప్పాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

130 ఏళ్ల చరిత్ర గల సింగరేణి అనేక మందికి పొట్టనింపిందని తెలిపారు. తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేస్తూ వెలుగులు నింపుతోందని చెప్పారు.  సంస్థ ఎదిగితే దాని కింద వేలాది మంది జీవిస్తారని అన్నారు. తెలంగాణ పట్ల వివక్ష ఉన్నప్పుడు మనకు దే బొగ్గు బాయిలు అన్నంపెట్టాయన్నారు. అట్లాంటి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు.

దేశం మొత్తం ఒకలా ఉంటే తెలంగాణలో మాత్రం కొత్త చరిత్ర రాస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నదని, సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉద్యోగుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణలో మాత్రం మనం కచ్చితంగా సింగరేణిని కాపాడుకుంటున్నామని అన్నారు. “1998లో చంద్రబాబు విజన్ 2020 పేరిట డాక్యుమెంట్ తెచ్చారు.

విజన్ 2020 అంటే సింగరేణి సంస్థ ఉద్యోగాలను కేవలం 20 వేలకు కుదించి దీన్ని నిర్వీర్యం చేసి తర్వాత ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రకు ఆనాడు తెరలేపారు. కానీ దాన్ని మనం బద్ధలు కొట్టి కార్మికులను కాపాడుకొని రిటైర్ మెంట్ కు దగ్గర ఉన్న వాళ్ల పిల్లలకు 18 వేల ఉద్యోగాలు ఇచ్చాం”  అని వ్యాఖ్యానించారు.  మరో 30 ఏళ్ల వరకు సింగరేణికి ఢోకా లేకుండా చేశామని తెలిపారు. 

సంస్థను కాపాడుకోడానికి రాజకీయ చిత్తశుద్ధి , దక్షత ఉండాలని,   ఆ రెండు ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టులకు వెళ్లి అడ్డంపడిన దగుల్భాజీలు ఎవరన్నది ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కాళ్లలో కట్టెలు పెడితే కేసీఆర్ కు నష్టమా తెలంగాణకు నష్టమా అన్నది ఆలోచించాలని సూచించారు.

కోల్ ఇండియాకు మించి సింగేణిలో ప్రయోజనాలను కల్పిస్తున్నామని, ఏ ఒక్క విషయంలో కూడా కోల్ ఇండియా కంటే తక్కువ చేయడం లేదని చెప్పారు.అలాగే, తెలంగాణలో బొగ్గు గని కార్మికులకు వచ్చే ప్రయోజనాలు దేశంలోని ఇతర బొగ్గు గనుల కార్మికులకు ఎందుకు రాకూడదని ప్రశ్నించారు.

దేశం మొత్తం సింగరేణి తరహా ప్రయోజనాలు కలిగించడానికి కదం తొక్కాల్సింది సింగరేణి యువ కార్మికులని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల్లోని బొగ్గు గని కార్మికులను ఐక్యం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో ఇచ్చే ప్రయోజనాలను ఇతర బొగ్గు సంస్థల్లో ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నను లేవనెత్తాలని సూచించారు. ప్రతీ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీ కీలకంగా పనిచేయబోతుందని తేల్చిచెప్పారు.  ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని కార్మికుల సమస్యలు, మన ఎజెండాలో వాటి పరిష్కారాలు తెలపాల్సిన బాధ్యత సింగరేణి యువ కార్మికులపై ఉంటుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం చేస్తుందని, కానీ దేశంలో ఆ పార్టీ పరిస్థితి ప్రజలు  హాత్ కా సాత్ కబ్ కా చోడ్ దియా  అన్నట్లుగా ఉందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ ను వదిలేశారని, పువ్వును మరిచిపోతారని, కారును వేగంగా ముందుకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు. కాబట్టి దేశవ్యాప్తంగా కేసీఆర్ నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

ఇటీవల మరణించిన టిబిజీకేఎస్ నాయకుడు తిరుపతి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత, అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో ములుగు  జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్సీ మధుసుదనాచారి, ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్,  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి , బిఆర్ఎస్ నాయకులు మరియు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ రావ్ ,టీబీజీకేఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల భక్తులపై భారం వేయడం తగదు

Bhavani

మహిళల కోసం 24 గంటలు అందుబాటులో సఖి కేంద్రం

Satyam NEWS

బొబ్బిలి లో పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స

Satyam NEWS

Leave a Comment