న్యాయవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని తొలగించేందుకు చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రిజిస్ట్రీలోనే ఏం జరుగుతున్నదో తెలియడం లేదని ఇటీవలె వ్యాఖ్యానించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ అవినీతిని తుదముట్టించేందుకే కంకణం కట్టుకున్నట్లు ఈ సంఘటన రుజువు చేస్తున్నది. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ ఎన్ శుక్లా పై ఇటీవల కొన్ని ఆరోపణలు వచ్చాయి. లంచం తీసుకుని అక్కడి ఒక ప్రయివేటు మెడికల్ కాలేజీకి అనుకూలంగా ఆయన తీర్పు చెప్పారనేది ఆ ఆరోపణల సారాంశం. మెడికల్ అడ్మిషన్ల విషయంలో చాలా కాలంగా అవినీతి జరుగుతున్న విషయం తెలిసిందే. అలహాబాద్ హైకోర్టు జడ్జి పై దీనికి సంబంధించిన ఆరోపణలు రావడంతో భారత ప్రధాన న్యాయమూర్తి ఈ సంచలన నిర్ణయం తీసుకుని ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించారు. ఈ విధంగా ఒక సిట్టింగ్ జస్టిస్ పై సిబై విచారణ జరిపించడం చరిత్రలో ఇదే ప్రధమం. జస్టిస్ ఎస్ ఎన్ శుక్లా పై ఇప్పటికే ప్రాధమిక దర్యాప్తు జరిపిన సిబిఐ ఆరోపణలకు అనుకూలంగా ప్రాధమిక సాక్ష్యాలను సేకరించింది. అన్ని ఆధారాలను ప్రధాన న్యాయమూర్తికి సమర్పించడంతో ఆయన పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.