గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించాలని ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖలపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లు, వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమని, ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుందని ఆయన అన్నారు. అందుకే గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలని ఆయన తెలిపారు. రేషన్ కార్డు, పెన్షన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియింబర్స్ మెంట్‌కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారీచేస్తాయని అందువల్ల ఈ కార్డులు అక్కడే ప్రింట్ అయి లబ్ధిదారులకు అందాలంటే వ్యవస్థ అంతా సక్రమంగా, పటిష్టంగా ఉండాలని సిఎం అన్నారు. అదే విధంగా విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరుకు సమీపంలో ఉన్న అనంతపురం ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుపై ఆలోచనలు చేయాలని సీఎం ఆదేశం జారీ చేశారు. ప్రాథమికంగా ఒక్కో సిటీ 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటుపై ప్రణాళికలు తయారుచేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు.
previous post