స్వచ్ఛ్ సర్వేక్షణ -2020లో విజయవాడ నగరం ఉత్తమమైన ర్యాంకును సాధించే దిశగా మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుచుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే దిశగా నగరపాలక సంస్థ చేపట్టిన చర్యల్లో ప్రజలు స్వచ్చందగా భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ్ సర్వేక్షన్ మిషన్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ రూపకల్పన చేసిన ప్రచార వాహనాలను బుధవారం ఉదయం మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్లాస్టిక్ రహిత ఉద్యమంలో విజయవాడ కార్పొరేషన్ ఇప్పటికే ముందంజలో ఉందని, స్వచ్ఛ్ సర్వేక్షణ ర్యాంకును మరింత మెరుగుపరుచుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దే దిశలో పలు రకాల చర్యలను తీసుకుంటున్నారని వివరించారు. స్వచ్ఛభారత్ పై ప్రజల్లో అవగాహన కల్పించేలా రెండు వాహనాలతో పాటు వైయస్‌ఆర్ నవశకం కార్యక్రమంపై మరొక ప్రచార రథం ఏర్పాటు చేయుట జరిగిందని పేర్కొంటూ ఇవి నేటి నుండి నగరంలోని అన్ని ప్రాంతాలలో తిరుగుతూ ప్రజలకు ఆయా కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కల్పించే దిశగా అధికారులు ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు. అలాగే నగరంలో తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం, వీలైనంత వరకు వాటిని తిరిగి వినియోగించుకోవడం, ఆ వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడం వంటి కార్యక్రమాలపై ఈ వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ వివరించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
previous post