26.7 C
Hyderabad
April 27, 2024 07: 31 AM
Slider సంపాదకీయం

జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖతం

#UttamkumarReddy

జీహెచ్ఎంసి ఎన్నికలలో జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దుబ్బాక ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయిన కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు తెలంగాణలో జరిగిన ఏ ఉప ఎన్నికలో కూడా గెలవలేకపోయింది. పైగా సాధారణ ఎన్నికల్లో గెలిపించుకున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది.

దాంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉన్న నాయకులు ఊడిపోవడం తప్ప కొత్త నాయకులు చేరడం కాంగ్రెస్ పార్టీ చూసి చాన్నాళ్లయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతున్నది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి చాలా కాలం అయినా కొత్త అధ్యక్షుడినే పెట్టుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ దీన స్థితికి అద్దం పడుతున్నది.

ఈ దశలో వచ్చిన దుబ్బాక ఎన్నిక కాంగ్రెస్ పార్టీని మరింత దీన స్థితిలోకి చేర్చింది. అప్పటి వరకూ దుబ్బాకలో పని చేసిన వారిని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్ ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం ఆ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఇప్పటికే పలుమార్లు రుజువు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వార్ధం ముందు పార్టీ ఆదర్శాలు నిలబడటం లేదు.

అధిష్టానమే లేదు ఇక ఆ పార్టీకి దిక్కుఏది?

కాంగ్రెస్ పార్టీకి బలమైన అధిష్టానం ఉండి రాష్ట్రాలలో పార్టీని నడిపించేవారు. ఇప్పుడు అలాంటి అధిష్టామనే బలహీనం కావడంతో రాష్ట్రాలలో దిక్కులేని పార్టీగా కాంగ్రెస్ మారిపోయింది. జీహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కళ్ల ముందే కరగిపోతున్న దృశ్యం ఆవిష్కృతం అవుతున్నది.

చాలా డివిజన్లలో ఆ పార్టీకి సరైన అభ్యర్ధులే దొరకలేదు. భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన ఊపులో టీఆర్ఎస్ పార్టీని ఢీ కొంటున్నది. పైపెచ్చు ఇప్పటి వరకూ బిజెపి అధిష్టానం నుంచి అంతగా మద్దతు లభించని ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

బిజెపి ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ మెడకు తగులుకున్న ఉరిని మరింత బలంగా లాగుతున్నది. జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత బహుశ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ స్థాయికి కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నదనే సంకేతాలే కనిపిస్తున్నాయి.

జీహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కు ముందే ఓడిపోయినట్లుగా కనిపిస్తున్నది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి దాదాపుగా పోయింది.

దాంతో జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతున్నది. చాలా డివిజన్లలో బిజెపి టీఆర్ఎస్ మధ్య, మరికొన్ని డివిజన్లలో బిజెపి ఎంఐఎం మధ్య హోరా హోరీ పోరాటం జరుగుతున్నది.

Related posts

అడ్డా కూలీల బాధలు లేబర్ అధికారులకు పట్టవా?

Satyam NEWS

పెద్ద సినిమాలకు మళ్లీ పొంచిఉన్న కరోనా గండం

Satyam NEWS

ఇళ్ల పట్టాల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరపాలి

Sub Editor

Leave a Comment