తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా నియమించడానికి కోటీశ్వరుడు కావాలనే అర్హత ఒక్కటే ఉందా అని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొన్న శేఖర్ రెడ్డిని తిరిగి టిటిడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. టిటిడి పాలకమండలికి జంబోజెట్ బోర్డు నియమించారని, అందులో అందరూ కోటీశ్వరులు, పారిశ్రామిక వేత్తలేనని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శేఖర్ రెడ్డి ని టిటిడి పాలకమండలి సభ్యుడుగా నియమించారని అప్పుడు శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారని, అదే శేఖర్ రెడ్డిని ఇప్పుడు మళ్లీ టిటిడి పాలక మండలి సభ్యుడుగా నియమించారని ఆయన చంద్రబాబు బినామీనా లేక జగన్మోహనరెడ్డి బినామీనా? అనే విషయం తేల్చాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. శేఖర్ రెడ్డి నియామకంపై జగన్మోహనరెడ్డి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. తక్షణమే టిటిడి బోర్డు నుండి శేఖర్ రెడ్డిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో సాధారణ భక్తులకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
previous post