డయల్ హండ్రెడ్ అంటూ విపరీతంగా ప్రచారం చేస్తూ వందకు డయల్ చేస్తే మిమ్మల్ని కాపాడేస్తాం అంటూ ఊదరగొట్టిన పోలీసులు అలా చేసినవారినే చితక బాదుతున్నారు. జీడిమెట్లలోని హెచ్.ఏ.ఎల్ కాలనీలో అల్లరిమూక గొడవపై సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు డయల్ 100కి ఒక యువకుడు ఫోన్ చేశాడు.
దాంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ కోటేశ్వరరావు వచ్చి అల్లరిమూకను చెదరగొట్టాడు. అతను అంతటితో ఆగకుండా డయల్ 100కి ఫోన్ చేసిన యువకుడికి ఫోన్ చేసి ఇంటి నుంచి బయటికి పిలిచాడు. బయటకు వచ్చిన యువకుడితో అర్ధరాత్రిపూట నా నిద్ర ఎందుకు చెడగొట్టావురా? ఎవరు కొట్టుకుని చస్తే నీకెందుకురా? అంటూ బూతుల దండకం మొదలుపెట్టాడు.
రెండు చెంపలు వాయించి, తిడుతూ జీపులో జీడిమెట్ల పీఎస్‌కు తరలించాడు. యువకుడు కనిపించకపోవడంతో ఆందోళనలతో అరగంటపాటు కాలనీలో గాలించిన కుటుంబ సభ్యులు చివరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి చూస్తే అక్కడ ఆ యువకుడు కనిపించాడు. దాంతో వారు ఆ యువకుడిని ఇంటికి తీసుకువెళ్లి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు.