30.7 C
Hyderabad
April 29, 2024 03: 36 AM
Slider ప్రత్యేకం

భవిష్యత్తును భూతద్దంలో చూపిన దుబ్బాక ఫలితాలు

#Telangana CM KCR

“ కర్రు కాల్చి వాత పెట్టాలి” అంటాడు కెసిఆర్. ఈ మాట నిండు సభల్లో, ప్రెస్ మీట్లలో వేలాది సార్లు తమ ప్రత్యర్థులను గురించి, ప్రశ్నించిన వారిని గురించి కెసిఆర్ చాలా హాస్యభరితంగా చెప్పేవాడు. దుబ్బాక ఓటర్లు అదే చేస్తారని ఆయన ఊహించలేదు.

2, 3 రౌండ్లలో తప్ప దుబ్బాక ఓటర్లు కెసిఆర్ చెప్పిన మాటలను కెసిఆర్ కి అప్పజెప్పడం, ఆచరణలో చూపడం ఐపీఎల్ మ్యాచ్ ను తలపించింది. 25 రౌండ్లలో  ప్రతి రౌండ్ లో ప్రత్యర్థులు ఆధిక్యత వహించడం కర్రు వాతలను తలపింపజేశాయి. అంతేనా 1079 ఓట్ల మెజారిటీతో బిజెపి రఘునందన్ విజేతగా నిలవడం కర్రుతో వాతలు పెట్టడం కాకపోతే మరి ఏమిటి?

ప్రజాస్వామ్య దేశంలో అధికారంలో ఉండి నియంతృత్వాన్ని చవి చూపించిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి దుబ్బాక ఓటర్లు అక్షరాల ఒక లక్షా రెండు వేల మూడు వందల తొంబై ఆరు –  కర్రు వాతలు పెట్టారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి 62,273 ఓట్లు రాగా-గెలిచిన బిజెపి అభ్యర్థి 63,352 ఓట్లు సాధించారు.

ప్రత్యర్థుల ఓట్ల శాతం 62

కాంగ్రెస్ పార్టీకి 22,196 ఓట్లు ప్రజలు వేయగా, ఇతరులకు 16,848 ఓట్లు వచ్చాయి – ఈ లెక్కలు పోస్టల్ బ్యాలెట్ కాకుండా! ఈ ఓట్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే పోలైన మొత్తం ఓట్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1,02,396 ఓట్లు పడ్డాయనే విషయం గుర్తించాలి. టిఆర్ఎస్ కు పోలైన ఓట్లతో చూస్తే …62 శాతం ఓట్లు ప్రత్యర్థులు సాధించారు.

ఇక్కడే అసలు కిటుకు ఉంది. ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలలో అధికంగా జరిగిన పోలింగ్ శాతం టిఆర్ఎస్ పార్టీకి లాభించింది. అయితే  దుబ్బాకలో పోలింగ్ 83 శాతం జరగడంతో ఆ పార్టీ శ్రేణులు గతాన్ని నెమరువేసుకున్నాయి. తమ గెలుపు లాంఛనప్రాయమే అని భావించాయి.

అయితే ఫలితాలు మాత్రం అందుకు చాలా భిన్నంగా వెలుబడ్డాయి. ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత సగానికంటే ఎక్కువగా అంటే 62 శాతం ఉండడం చూస్తుంటే “సమీప భవిష్యత్తు”ను టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యంగా కెసిఆర్ కు దుబ్బాక ఓటర్లు,ప్రజలు భూతద్దంలో చూపెట్టారు.

నోరు తెరిస్తే చాలు విచ్చలవిడిగా ప్రత్యర్థులను బండ బూతులు తిట్టడం కెసిఆర్ కు అలవాటే. ఉద్యమకారుడిగా కూడా చేయకూడని పనిని కెసిఆర్  ముఖ్యమంత్రి హోదాలో కూడా మానకపోవడం తెలంగాణ ప్రజలనే కాదు ఆ పార్టీ శ్రేణులను కూడా కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది.

అందరిని దూషించడమే కేసీఆర్ రాజకీయం

ఈ అహంభావ ప్రవర్తన ఎక్కడ వరకు వెళ్ళింది అంటే… పత్రికా విలేకరులను, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను, మీడియా ప్రతినిధులను సైతం దూషించే, అపహాస్యం చేసే స్థాయికి దిగజారింది. దాని ఫలితమే దుబ్బాక లో టిఆర్ఎస్ కారు వేగానికి బ్రేకులు పడడం.

ఫలితంగా 2018లో 89,299 ఓట్లు (54.36 శాతం) పొందిన టిఆర్ఎస్ 2020లో 61,553 (37.69 శాతం) ఓట్లను మాత్రమే పొందగలిగింది. అదే బిజెపి 2009లో కేవలం 5,967 (4.19 శాతం) ఓట్లు పొందగా, 2014లో 15,133 (9.82 శాతం) ఓట్లను సాధించింది. ఇక 2018లో 22,595 (13.75 శాతం) ఓట్లు పొంది క్రమంగా పెరుగుదలను బిజెపి నమోదు చేసుకునేది. కానీ 2020 ఉప ఎన్నికలలో ఏకంగా 62,984 (38.57 శాతం) ఓట్లు పొందడం అంటే దాదాపు 25% ఓట్లను ఒకేసారిగా ఎలా పెంచుకోగలిగింది? ఇది ఆలోచించవలసిన ప్రశ్న.

టిఆర్ఎస్ పార్టీ చేసిన నియంతృత్వ విధానాలు, అహంకార రాజకీయాలు, ప్రజలను అర్భకులు గా చూసే ధోరణి, భూకబ్జాలు, అన్ని వర్గాలకు టిఆర్ఎస్ దూరం కావడం, ఇచ్చిన హామీలను నెరవేరకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ ఆర్ ఎస్ తీసుకురావడం, ప్రజలను తాత్కాలిక తాయిలాలకు బానిసలుగా చేయాలని ప్రయత్నించడం ఇలా అనేకమైన తాత్కాలిక ఉపశమన మార్గాలు తొక్కడం వల్లనే టిఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించింది.

– శ్రీనివాసాచారి.కె, మనోవిజ్ఞాన అధ్యాపకుడు

Related posts

డెంగ్యూ వచ్చిన దేశాలలో కరోనా వ్యాప్తి తక్కువే

Satyam NEWS

కేంద్రం అనుమతి లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారు?

Satyam NEWS

ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ పరిధిలో క్రిస్మస్ వేడుకలకు హాజరైన ఎంపీఆర్

Satyam NEWS

Leave a Comment