26.7 C
Hyderabad
May 3, 2024 07: 29 AM
Slider ప్రత్యేకం

అమరావతి ఉద్యమానికి ఆయువుపట్టు: పోరాటాల బాలకోటయ్య

#saveamaravati

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాల్సిన అమరావతి అనాథగా మారిన నేపథ్యంలో మొదలైన ఉద్యమం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే  మొదటి పేరు బాలకోటయ్య. ఎవరీ బాలకోటయ్య? రాజధాని ఉద్యమంతో ఆయనకు సంబంధం ఏంటి? ఆయన గతమేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు చాలా మందికి తెలియవు.

రాజకీయాల్లో ఒకరి కొమ్ముకాసే మీడియా కూడా బాలకోటయ్య గురించి ఎక్కువగా రాయదు. ఏ చానలూ ఆయనను ఇంటర్వ్యూ చేయదు. ఎందుకంటే అతను దళితుడు. రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి ప్రభుత్వం ‘‘కమ్మ’’ కుల ముద్ర వేసి దాన్ని ఛిద్రం చేయాలనుకున్నప్పుడు, బాలకోటయ్య బహుజన  పొలి కేకలు వినిపించారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో కమ్మ కులం వారు మాత్రమే ఉన్నారనే జగన్ రెడ్డి ప్రభుత్వ వాదనను సమర్ధంగా తిప్పికొట్టిన వ్యక్తి బాలకోటయ్య. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కులాల లెక్కల చిట్టాలు విప్పి చెప్పిన మొదటి వ్యక్తి బాలకోటయ్య. రాజధానికి భూములు ఇచ్చిన వారిలో 34 శాతం మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారని బాలకోటయ్య ఆధారాలతో సహా నిరూపించారు.

అంతే కాదు 24% రెడ్డి కులస్తులు, 14 శాతం మంది బీసీలు రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చారు. ఈ క్యాటగిరిలో భూములు ఇచ్చిన కమ్మ కులస్తులు కేవలం 18 శాతం మాత్రమే. ఈ వివరాలు కేవలం నోటి మాటలు కావని నిరూపిస్తూ బాలకోటయ్య హైకోర్టు లో పిటీషన్ కూడా దాఖలు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ లెక్కలకు సమాధానం చెప్పలేకపోయింది.

అప్పటి వరకూ చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా చేసింది కేవలం కమ్మ కులస్తుల కోసమే అంటూ బలంగా నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాలకోటయ్య ఇచ్చిన వివరాలతో వాస్తవాలు తెలుసుకున్నారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది కేవలం కమ్మ వారి కోసం కాదు అని అప్పటి నుంచే ప్రజలు నమ్మడం మానేశారు. ఇది జగన్ రెడ్డి ప్రభుత్వానికి తొలి దెబ్బ.

అమరావతి రాజధానిగా ఉంటే దళితులకే లాభం

జగన్ రెడ్డి బృందం అమరావతి ఎడారి అని, స్మశానం అని కువిమర్శలు చేసినప్పుడు కూడా బాలకోటయ్యే బలంగా తిప్పికొట్టారు. అమరావతిని గ్రాఫిక్స్ అన్నవారి నోటిని బాలకోటయ్య తన వాక్ చాతుర్యంతో వాస్తవాలు చెప్పి మూయించారు. రాజధాని అమరావతిని రక్షించుకుంటే అత్యధిక ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు క్రింది కులాల వారికే దక్కుతాయన్నది ఆయన సిద్ధాంతం.

ఈ సిద్ధాంతానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఒక వైపు రైతుల రాజధాని హక్కు, మరో వైపు ఆంధ్రుల రాజధాని కల, బహుజన కులాల ప్రయోజనం వంటి అంశాలను గట్టిగా వినిపించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ నుండి అమెరికా వరకు బాలకోటయ్య వాదనను అంగీకరించిన వారి సంఖ్య పెరిగిపోయింది.

ఉక్కు పాదం మోపినా ఆగని బాలకోటయ్య గళం

బాలకోటయ్యపై జగన్ ప్రభుత్వం మొదట కట్టడి చేసే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించ లేదు. ఆ తర్వాత ఉక్కుపాదం మోపినా ఆయన ఆగలేదు. అమరావతి రైతుల పక్షాన అందులోనూ బహుజన కులాల పక్షాన ఆయన నిలిచారు.

ప్రభుత్వం ఆయనను ఏం చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన నిజ జీవితం ఒక వైట్ పేపర్. దివిటీ పెట్టి వెతికినా ప్రభుత్వానికి తప్పులు దొరకలేదు. సాదా సీదా కుటుంబం. దాంతో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసేది లేక ఐదారు సార్లు హౌస్ అరెస్ట్ కి పరిమితం కావాల్సి వచ్చింది.

బాలకోటయ్య గతంలో జర్నలిస్టుగా పని చేశారు. వార్త, సూర్య, ఆంధ్ర ప్రభ, తేజ వీక్లీ వంటి వాటిలో ఎడిటర్ ల ప్రశంసలు అందుకున్నారు. ఆయన అంబేద్కరిస్టు. వామ పక్ష, దళిత ఉద్యమ సువాసనలు బలంగా ఉన్న వ్యక్తి. పౌర హక్కుల ఉద్యమ నేత డాక్టర్ బాలగోపాల్ , ఉద్యమం నెల బాలుడు కేజీ సత్యమూర్తి, దళిత ధిక్కార స్వరం కలేకూరి ప్రసాద్ వంటి  పోరాటయోధులతో సాన్నిహిత్యం, కలిసి నడిచిన వ్యక్తి. పుట్టిన ఊరు కూడా దశాబ్దాల మానని గాయం కోటేశు పుట్టిన  కంచికచర్లే.

అనంతర కాలంలో సొంతంగా ఢీ అనే ఏకాక్షర వార పత్రికను విజయవాడ కేంద్రంగా దశాబ్దకాలం పైగా నడుపుతున్న కలం వీరుడు కూడా. రాజధాని అమరావతి పోరాటంతోపాటు జగన్ ప్రభుత్వంలో దళితులపై  జరుగుతున్న దాడులు, హత్యలు, శిరోముండనాలు, అత్యాచారాలు వంటి సంఘటనలపై బాలకోటయ్య తీవ్రంగా స్పందిస్తున్నారు. బహుజనుల కోసం పోరాటం చేయడమే తన జీవితాశయమని బాలకోటయ్య ‘‘సత్యంన్యూస్.నెట్’’ తో చెప్పారు.

Related posts

కోదాడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

మిచౌంగ్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

ఈ సారి కూడా పైడితల్లి పండగకు వీఐపీ పాస్ లు ఉండవు

Satyam NEWS

Leave a Comment