తమిళనాడుతో కియా మోటార్స్ సంస్థ చర్చలు జరిపినట్లు ‘రాయిటర్స్’లో వచ్చిన కథనం నిజమేనని మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ చర్చలు వాస్తవమేనని తమిళనాడు అధికారులు తెలిపారని చంద్రబాబు స్పష్టంచేశారు.
ఏపీలో పరిశ్రమలకు అనువైన వాతావరణం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పారిశ్రామిక రాయితీలు అందడం లేదని రాయిటర్స్ తన కథనంలో పేర్కొందని ఆయన వివరించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కియాకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వలేమని చెబుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
ఇష్టారీతిన లెక్కలు చెబుతూ అసత్యాలు ప్రచారం చేయడం వైసిపి నేతలకు అలవాటైందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పరిశ్రమలో ఉద్యోగాలు, పనులు తమ వాళ్లకే ఇవ్వాలని కియా ప్రతినిధులను వైసిపి నేతలు బెదిరించారని ఆరోపించారు. పెట్టుబడి రావడం చాలా కష్టమని, దెబ్బతీయడం మాత్రం సులభమని వ్యాఖ్యానించారు.