ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన అనంతరం నుంచి తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని నిడమర్రు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆ నాటి నుంచి తప్పిపోయినట్లున్నారని, పోలీసులు వెతికి పట్టుకుని తమకు అప్పగించాలని వారు కోరారు.
మంగళగిరి పోలీసు స్టేషన్‌లో నిడమర్రు రైతులు చేసిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. రాజధాని రైతులు ఆందోళనకు దిగినా పరామర్శించడానికి తమ ఎమ్మెల్యే రావడం లేదని వారు అన్నారు. ‘రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై మా గోడు వెళ్లబుచ్చుకుందామంటే మా ఎమ్మెల్యే ఎక్కుడున్నారో తెలియట్లేదు. మా ఎమ్మెల్యే కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని మా శాసన సభ్యులను మాకు అప్పగిస్తారని భావిస్తున్నాం.
గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కావున వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము’ అని ఫిర్యాదులో రాజధాని రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు.