38.2 C
Hyderabad
April 29, 2024 19: 45 PM
Slider విజయనగరం

విద్యల నగరంలో వ్యాపారి కిడ్నాప్…24 గంటలలో కేసు ఛేదింపు

#vijayanagaram police

విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో మెయిన్ రోడ్డులో వ్యాపారి దుండారాం చౌదరీ అలియాస్ రమేష్ అనే వ్యక్తిని ఆగష్టు 15న కిడ్నాప్ చేసిన 5గురు నిందితులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసారు.ఈ మేరకు డీఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  డీఎస్పీ అనిల్ మాట్లాడారు.

వివరాల్లోకి వెళ్ళితే.. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన పటిమీడ శివ సూర్య అనే వ్యక్తి విజయనగరంలో ఒక బంగారు దుకాణంలో పని చేస్తూ, తన షాపుకు ఎదురుగా ఉన్న నావెల్టీ షాపు యజమాని నరపత్ సింగ్ పురోహిత్ కుమార్తె పూజ అనే అమ్మాయిని, ప్రేమించి, పెద్దలు ప్రమేయం లేకుండా మే మాసంలో రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నారు.

ఈ విషయం నచ్చని నరపత్ సింగ్ పురోహిత్ వారి స్వరాష్ట్రమైన రాజస్థాన్ లో తన కుమార్తె కనిపించుట లేదని, రాజస్థాన్ కోర్టులో సెర్చ్ వారంటు దాఖలు చేయగా, అక్కడ కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాజస్థాన్ పోలీసులు శ్రీకాకుళం జిల్లా రాజాం వచ్చి, రాజాం పోలీసుల సహకారంతో నిందితుడు పటిమీడ శివ సూర్య ఇంటికి వెళ్ళి, అతను ఇంటిలో లేని సమయంలో సోదాలు నిర్వహించి, వారింటిలో ఉన్న పూజను తీసుకొని వెళ్ళి పోయారు.

నిందితుడు పటిమీడ శివ సూర్య (ఎ-1) తన భార్య పూజను తీసుకొని వెళ్ళిపోవుటకు తన భార్య పూజ తండ్రి నరపత్ సింగ్ పురోహిత్ అనే వ్యక్తే కారణమని భావించి, తన తండ్రి శ్రీరామమూర్తి (ఎ-2), వారి వద్ద పని చేసే ముంగరి హరికృష్ణ (ఎ-3), అతని స్నేహితుడు వంశీ (ఎ-4), బావ తర్లాడ విశ్వేశ్వరరావు (ఎ-5)ల సహకారంతో మూడు మోటారు సైకిళ్ళ పై రాజాం నుండి విజయనగరం ఆగష్టు 15న వచ్చి, ముందుగా నరపత్ సింగ్ పురోహిత్ ఇంటికి వెళ్ళగా, అక్కడ పురోహిత్ ఇంటికి తాళం వేసి ఉండడం గమనించారు.

అనంతరం, వారందరూ విజయనగరం మెయిన్ రోడ్డులోని మహేష్ నావెల్టీ షాపు వద్దకు వచ్చి చూడగా, షాపు గేటుకు తాళం వేసి ఉండడం గమనించారు. కానీ, షాపులో కొంతమంది వ్యక్తులు ఉండడం గమనించి, బలవంతంగా షాపులోకి వెళ్ళేందుకు ప్రయత్నించి, గేటు తాళాలు పగులగొట్టి, లోపలకు ప్రవేశించి, నరపత్ సింగ్ పురోహిత్ వారి కుటుంబ సభ్యుల గురించి ప్రశ్నించారు.

షాపులో ఉన్నవారు తమకు తెలియదని చెప్పడంతో నిందితులు (ఎ-1 నుండి ఎ-5) అక్కడ ఉన్న దుండారాం చౌదరీ అలియాస్ రమేష్ కత్తితో బెదిరిస్తూ, ఇనుప రాడ్డులతో కొట్టగా, వారిని అడ్డుకొనేందుకు దినేష్ దివాశి అనే వ్యక్తి ప్రయత్నించగా, అతడిని కూడా నిందితులు కొట్టి, గాయపర్చి దుండారాం చౌదరీ అలియాస్ రమేష్ ను తమ వెంట తీసుకొని వెళ్ళి పోయారు.

ఈ విషయమై గౌతం పురోహిత్ డయల్ 100కు ఫోను చేయగా, పోలీసులు రంగప్రవేశం చేసారు. 1వ పట్టణ సీఐ జె.మురళి ఆధ్వర్యంలో ఎస్ ఐలు కృష్ణ ప్రసాద్, దుర్గా ప్రసాదాలను రెండు బృందాలుగా ఏర్పాటు చేసారు. ఈ బృందాలు నిందితుల పట్టుకొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, 24గంటల వ్యవధిలోనే కిడ్నాప్ మిస్టరీని చేధించారన్నారు.

ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన ఎస్ఐ లు కృష్ణ ప్రసాద్, దుర్గా ప్రసాద్ మరియు ఇతర బృంద సభ్యులును డీఎస్పీ అభినందించారు. అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను రిమాండుకు తరలిస్తున్నామని విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్ తెలిపారు.

Related posts

ఎస్సీ ఎస్టీ వాడల్లో దేవాలయాల నిర్మాణం

Satyam NEWS

24 నుండి స్పర్శదర్శనం

Sub Editor 2

మే 1న ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవర ఉత్సవం

Satyam NEWS

Leave a Comment