దిశ కంటే ముందు ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలంలోని నిర్మల్ ఎల్లపూర్ కు చెందిన టేకం లక్ష్మిని అతిదారుణంగా కొందరు అత్యాచారం, హత్య చేశారని అయితే ఇప్పటివరకూ ఆమెకు న్యాయం జరగలేదని సంచర జాతుల జాతీయ ప్రదాన కార్యదర్శి, న్యాయవాది సత్యనారాయణ అన్నారు.
రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు టేకం లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేశారు. టేకం లక్ష్మిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు ఇప్పటి వరకూ ఎలాంటి శిక్ష పడలేదని టేకం లక్ష్మి దళిత మహిళ కాబట్టి న్యాయం జరగడం లేదా అని సత్యనారాయణ ప్రశ్నించారు. బుగ్గలు అమ్ముకునే టేకం లక్ష్మి అనే దళిత మహిళను ముగ్గురు సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు.
చేతి వేళ్లను కోసేశారు. దిశ సంఘటనకు, లింగాపూర్ సంఘటన దాదాపు సమానంగానే ఉన్నా పాలకులు, ప్రజలు స్పందించే విధానంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. దిశ సంఘటన రాష్ట్ర రాజధానిలో జరగ్గా, లింగాపూర్ సంఘటన మారుమూలన ఉన్న గ్రామంలో జరిగింది. అంతేకాకుండా లింగాపూర్ లో మృతి చెందింది దళిత మహిళ కాగా, దిశ సంఘటనలో అగ్రవర్ణాలకు చెందిన యువతి.
అంతేకాకుండా చేసే వృత్తిలోనూ తేడా ఉంది. ఆమె బుగ్గలు అమ్ముకునే ది కాగా, ఈమె వెటర్నరీ డాక్టర్. అయితే ఇద్దరిపై జరిగిన ఘోరం ఒక్కటే. ఇద్దరినీ అత్యాచారం చేసి హత్య చేసింది వాస్తవమే. అయితే ప్రజలు, పాలకుల స్పందనలో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తోందని సత్యనారాయణ అన్నారు. అగ్రవర్ణాలకు సత్వర న్యాయం అందించేందుకు ప్రయత్నించే పాలకులు, దళితుల పట్ల వివక్ష చూపుతున్నారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. తక్షణమే టేకం లక్ష్మికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. టేకం లక్ష్మి కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారం తక్షణమే ఇవ్వాలని సత్యనారాయణ కోరారు. లక్ష్మి కుటుంబలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు. దళితులపై వివక్ష చూపడం ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన అన్నారు.