38.2 C
Hyderabad
April 28, 2024 19: 25 PM
Slider ప్రత్యేకం

రఘురామ ఆట మొదలైంది: ఇక నెక్స్ట్ ఎవరో….???

#SPAmmireddy

సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో తనకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఆరోపించిన కొన్ని గంటల్లోనే గుంటూరు అర్బన్ ఎస్ పిని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది.

రఘురామకృష్ణంరాజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చేసిన  ఫిర్యాదులో గుంటూరు అర్బన్ ఎస్ పి అమ్మిరెడ్డి పేరు కూడా ఉంది. సాధారణంగా అధికారులకు జరిగే బదిలీ తరహాలోనే గుంటూరు అర్బన్ ఎస్ పి అమ్మిరెడ్డి బదిలీ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే రఘురామ ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఇది జరగడంతో కొత్త గేమ్ మొదలైందనే వాదన వినిపిస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పలు అంశాలను పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో డెప్యుటేషన్ పై పని చేస్తున్న డిఫెన్స్ ఎకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్ ఉద్యోగి ధర్మారెడ్డి, సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కె పి రెడ్డి తో కలిసి తనపై కుట్ర పన్నినట్లు రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

ఈ కుట్రకు గుంటూరు అర్బన్ ఎస్ పి అమ్మిరెడ్డి సహకరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేయాలని తాను సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నాటి నుంచి ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై కక్ష పెంచుకున్నారని ఆయన అనుచరులు గా ఉన్న కొందరు అధికారులు తనపై కుట్రలు పన్నుతున్నారని రఘురామకృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సిబి సిఐడి అదనపు ఎస్ పి విజయ్ పాల్ తనపై దేశద్రోహం కేసు పెట్టడమే కాకుండా నాగరిక సమాజంలో జరగకూడని విధంగా తన ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి హింసించారని ఆయన అన్నారు. ఆయన కష్టడీలో ఉండగా ఐదుగురు ముసుగు వేసిన మనుషులు తనను దారుణంగా హింసించారని రఘురామకృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు జోక్యంతో తనకు బెయిల్ మంజూరైందని, సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తరలించారని ఆయన తెలిపారు. తన కాలి వేలిలో ఫ్రాక్చర్ ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

తన పట్ల పోలీసు లాకప్ లో అనుచితంగా ప్రవర్తించినట్లు సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందని ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అదనపు కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్న ధర్మారెడ్డి తాను మిలిటరీ ఆసుపత్రిలో ఉండగా మే 18న హుటాహుటిన హైదరాబాద్ వచ్చారని రఘురామకృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మిలిటరీ ఆసుపత్రి నుంచి తనను త్వరగా డిశ్చార్జి చేయాల్సిందిగా కె పి రెడ్డిపై ధర్మారెడ్డి వత్తిడి తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఈ వత్తిడి మేరకు కె పి రెడ్డి తనకు చికిత్స చేస్తున్న డాక్టర్లపై తనను డిశ్చార్జి చేయాల్సిందిగా పలుమార్లు వత్తిడి తీసుకువచ్చారని ఆయన తెలిపారు.

అయితే ఈ విషయం గమనించిన తాను తనకు పూర్తి చికిత్స ఇవ్వాల్సిందిగా కోరారని దాంతో మే 26న తనను డిశ్చార్జి చేశారని రఘురామ తెలిపారు. కె పి రెడ్డి, ధర్మారెడ్డి గుంటూరు ఎస్ పి అమ్మిరెడ్డిని సంప్రదించి 15 మంది పోలీసులను మిలిటరీ ఆసుపత్రిలోనే ఉండేలా చేశారని ఆయన తెలిపారు.

తనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా తనను బలవంతంగా గుంటూరు తరలించేందుకు వీరంగా ప్లాన్ వేశారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. 15 మంది పోలీసుల తిండి కోసం తాను చెల్లించిన రసీదులు ఈ ఫిర్యాదుతో బాటు జత చేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తనకు సీఆర్ పిఎఫ్ రక్షణ మాత్రమే ఉండాలని, గుంటూరు పోలీసులు మిలిటరీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉండాల్సిన అవసరమే లేదని ఆయన తెలిపారు. కేవలం తనను మిలిటరీ ఆసుపత్రి నుంచి తరలించి ప్రాణహాని తలపెట్టేందుకే ఈ కుట్ర జరిగిందని రఘురామకృష్ణంరాజు తన లేఖలో ఆరోపించారు.

అందువల్ల కె పి రెడ్డి పాత్రపై పూర్తి విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. కె పి రెడ్డి కాల్ డేటా మొత్తం విశ్లేషించి ఈ కుట్రలో ఉన్న పాత్రధారులను కూడా పట్టుకోవాలని, వారికి తగిన శిక్ష పడేలా చేయాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి చర్యలు ప్రారంభమైనట్లేనని జరిగిన పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తదుపరి చర్యలు ఎవరిపై ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది.

Related posts

జీడిపప్పు పరిశ్రమలతో కాలుష్య నియంత్రణ అధికారుల కుమ్మక్కు

Satyam NEWS

మన ఠీవి

Satyam NEWS

ఏయూ వైఎస్ ఛాన్స‌ల‌ర్ ను రీ కాల్ చేయాలంటూ టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్

Satyam NEWS

Leave a Comment