అమరావతి నుంచి రాజధాని తరలింపు సంబంధిత అంశాలపై దాఖలైన పిటిషన్లను తదుపరి విచారణ కోసం ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో జరిగిన విషయాలను ఆయన కోర్టుకు వివరించారు. మండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు ఆయన వివరించారు.
అయితే ప్రస్తుతం ఈ బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్ భాన్ జోక్యం చేసుకుని విచారణ జరగకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు అన్నీ తరలించేస్తుందని చెప్పారు. అందువల్ల విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన సీజే విచారణ పూర్తయ్యేలోపు కార్యాలయాలు తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు.