27.7 C
Hyderabad
May 21, 2024 04: 16 AM
Slider ప్రపంచం సంపాదకీయం

హౌడీ మోడీ లో అసలు కీలకం ఇది

howdy-modi

అమెరికా కాలమానం ప్రకారం 22వ తేదీ ఉదయం 10.45 గంటలకు హ్యూస్టన్ లోని ఎన్ ఆర్ జి స్టేడియంలో దాదాపు 50 వేల మంది భారత సంతతి అమెరికన్లు పాల్గొనే హౌడీ మోడీ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీకి భారత్ కు చేకూర్చే లాభం కన్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే ఎక్కువ మేలు కలిగిస్తుంది. భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం అయినా వచ్చే ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో లబ్ది పొందడం కోసమే ట్రంప్ ఈ ఎత్తుగడ వేశారని అనిపిస్తున్నది.

గత ఎన్నికలలో భారత సంతతి అమెరికన్లు దాదాపుగా అందరూ కూడా హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గు చూపారు. భారత సంతతి అమెరికన్లు హిల్లరీ క్లింటన్ వైపు మొగ్గు చూపడానికి ఆనాడు ట్రంప్ మాట్లాడిన మాటలే కారణం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ట్రంప్ ఇదే వైఖరిని కొనసాగించారు. భారత సంతతి అమెరికన్లను ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా దగ్గరకు తీసుకోవడానికి ఆయన ఏ మాత్రం ప్రయత్నం చేయాలేదు. భారత్ కు చెందిన కంపెనీలను, భారత్ నుంచి ఉద్యోగార్ధం, వ్యాపారార్ధం వచ్చే వారిని ఇబ్బంది పెట్టేందుకే ఆయన ప్రత్నించారు. కొన్ని నిర్ణయాలు ముస్లిం దేశాలకు విరుద్ధంగా తీసుకున్నా అవి భారత్ నే ఎక్కువ ఇబ్బంది పెట్టాయి.  ఆయన కావాలని చేయకపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ భారత్ నుంచి వచ్చేవారికి, భారతీయ కంపెనీలకు నష్టాన్నే మిగిల్చాయి.

దాంతో అమెరికాలో ఉంటున్న భారతీయులకు ట్రంప్ అంటే కంటగింపుగానే ఉంది. ట్రంప్ పదవీ కాలం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చేసే భారతీయ సంతతి అమెరికన్లు ఎదురు చూస్తున్నారు. గతంలో యుపిఏ హయాంలో అణు ఇంధన సరఫరా ఒప్పందం తదితర అంశాలలో అమెరికా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నప్పుడు అలా ఎందుకు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని అమెరికాలో ఉన్న భారతీయులు ప్రశ్నించారు. ఇప్పుడు నరేంద్రమోడీ అమెరికాకు అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకున్నా అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించే పరిస్థితి ఉంది.

అయితే నరేంద్ర మోడీ సమ్మోహన శక్తి ముందు వారు మరింత ధైర్యంగా అడిగే సాహసం చేయడం లేదు అంతే. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పై భారతీయ అమెరికన్లు ఆగ్రహంతో ఉన్నారని పలు సందర్భాలలో నిరూపణ అయిన నేపథ్యంలో హౌడీ మోడీ కార్యక్రమం జరుగుతున్నది. మోడీకి ఉన్న సమ్మోహన శక్తిని తనకు అనుకూలంగా మలచుకోవాలని ట్రంప్ వేసిన ఎత్తుగడలో భాగమే ఈ సదస్సు అని కచ్చితంగా చెప్పవచ్చు. సదస్సు జరుగుతున్న హ్యూస్టన్ లో భారత్ తో అనుసంధానమైన అమెరికన్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి.

కోట్లాది రూపాయల సాఫ్ట్ వేర్ వాణిజ్యం హ్యూస్టన్ నుంచి జరుగుతుంటుంది. భారత్ కు కూడా హ్యూస్టన్ లాంటి వాణిజ్య కేంద్రం అవసరం. 2020 లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మళ్లీ పోటీ చేస్తున్న ట్రంప్ ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయనపై అభిశంసన తీర్మానం నడుస్తున్నది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశ పురోగతికి దోహదం చేయడం లేదని, పైగా వ్యక్తిగత స్థాయి మెరుగుపరచుకోవడానికి ఆయన ప్రత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలో ప్రస్తుతం ఆయన అభిశంసన తీర్మానంపై విస్తృత చర్చ జరుగుతున్నది.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బాసటగా నిలవాలని ఆయన కోరుకుంటున్నారు. నరేంద్రమోడీ పక్కన ఉంటే భారత సంతతి అమెరికన్లకు తనపై కోపం బాగా తగ్గుతుందని ఆయన వ్యూహరచన చేస్తున్నారు. అందుకే ఈ హౌడీ మోడీ. ఐక్యరాజ్య సమితి ని సంస్కరించి అందులో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునేందుకు నరేంద్రమోడీ ఉద్యుక్తులయ్యారు.

దీనికి అమెరికా మద్దతు ఎంతో కీలకం. ఇప్పటికే అమెరికా తన శక్తియుక్తులు అన్నీ ఉపయోగించి ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నది. అందులో సందేహం లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న హౌడీ మోడీ కార్యక్రమాన్ని అమెరికాను లొంగదీసుకోవడానికి మోడీ ఉపయోగించుకుంటారా లేక ట్రంప్ కు ఉపయోగపడే ఒక పనిముట్టులా మారతారా అనేది భవిష్యత్తు చెప్పాల్సి ఉంటుంది.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

మంగళగిరి వద్ద మధ్యప్రదేశ్ గ్యాంగ్ ఘరానా మోసం

Satyam NEWS

దళిత బందు కోసం జరిగే ధర్నాను జయప్రదం చేయండి: కెవిపిఎస్

Satyam NEWS

కుమ్ములాటల కాంగ్రెస్ ఎప్పటికైనా బాగుపడుతుందా?

Satyam NEWS

Leave a Comment