మూడురోజుల పాటు కనిపించకుండా పోయిన ఒక వివాహిత పిల్ల కాలువతో శవమై తేలిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వెలుగుచూసింది. అక్రమ సంబంధం అనుమానంతో భర్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏలూరు శనివారపుపేట ప్రాంతానికి చెందిన గుళ్ళమిల్లి శివాజీకి, నాగమణి(34)కి కొన్నాళ్ల కిందట వివాహమైంది.
శివాజీ మానసిక వికలాంగుడు కావడంతో ఇంటి వద్దనే ఉండేవాడు. దీంతో నాగమణి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలోనే ఆమెకు వరుసకు మేనల్లుడైన సంతోష్‌తో చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. ఇటీవల నాగమణి ప్రవర్తనపై సంతోష్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరొకరితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించి వేధించేవాడు.
దీంతో నాగమణి అతడిని కొద్దిరోజులుగా దూరం పెట్టేసింది. దీన్ని తట్టుకోలేకపోయిన సంతోష్ ఆమె ఎక్కడికెళ్లినా వెంబడించేవాడు. ఈ నెల 20వ తేదీన కంటి పరీక్ష చేయించుకునేందుకు నాగమణి తన సోదరుడితో కలిసి ఆర్ఆర్‌పేటలోని శంకర్ నేత్రాలయ ఆస్పత్రికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ వారిని వెంబడించాడు. 21వ తేదీన సత్రంపాడులోని ఓ ఇంట్లో పనిచేసేందుకు వెళ్లిన నాగమణి తర్వాత కనిపించకుండా పోయింది.
బంధువులు ఆమె కోసం అనేక చోట్ల వెతికినా ఫలితం లేకపోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఏలూరు దొండపాడు దత్తాశ్రమం సమీపంలోని ఒక పిల్ల కాలువలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. త్రీటౌన్ సీఐ మూర్తి ఘటనా స్థలానికి వెళ్ళి ఆ మృతదేహం నాగమణిదిగా గుర్తించారు.
ఆమెది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తనతో అక్రమ సంబంధం కొనసాగించకపోవడం వల్లే సంతోష్ ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సంతోష్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.