” రాజధానిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను పరిశీలించాం. కొన్ని భవనాలు 90 శాతం పూర్తయ్యాయి. ఐదేళ్లు ఎవరికీ ఇబ్బంది లేకుండా పాలన చేశాం. అమరావతి అభివృద్ధి జరగాలని ఎంతో కష్టపడ్డాం. రాబోయే వెయ్యేళ్ల వరకు రాజధాని ఉండాలని అనుకున్నాం. నాకు కులం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఏ కులం చూసి అభివృద్ధి చేశాను? ఆనాడు నేను పడిన కష్టం.. చూపిన చొరవ జీవితాంతం నాకు తృప్తినిస్తుంది.
సైబరాబాద్‌కు ఎన్నో కంపెనీలు వచ్చేలా కృషి చేశాం. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా హైదరాబాద్ అభివృద్ధి అంటే నేనే గుర్తొస్తాను. ఆ తృప్తికోసం వివిధ దేశాలు తిరిగాను. రాత్రింబవళ్లు కష్టపడ్డా. విజన్ 20-20తో అభివృద్ధి చేశాం” అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. నేడు రాజధాని పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసే అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే అమరావతి పర్యటన చేపట్టినట్లు తెలిపారు.
వైసిపి ప్రభుత్వం కుట్రలతో అమరావతి పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. అమరావతి భావితరాల భవిష్యత్తుకు ప్రతీక అని.. దాన్ని పూర్తి చేసేలా వైసిపి నేతలకు మంచి మనసు ఇవ్వాలని దేవుడిని ప్రార్థించానని చంద్రబాబు చెప్పారు.