40.2 C
Hyderabad
April 26, 2024 12: 00 PM
Slider సంపాదకీయం

Colour Dreams: ఐఏఎస్ లూ ఆగండి ఆలోచించండి

#Panchayati Office

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తీసుకున్న ‘రంగుల’ నిర్ణయం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించడానికి కూడా వీలుకావడం లేదు. రాష్ట్రంలోని పంచాయితీ భవనాలన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేయిచడం పలు వివాదాలకు దారితీసింది.

గతంలో కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన ఇళ్లకు కూడా వారి జెండా రంగు వేసేవారు. అయితే అది జాతీయ జెండా ను పోలి  ఉంటుంది కాబట్టి ఎవరైనా ప్రశ్నిస్తే అది జాతీయ జెండా రంగు అని సరిపుచ్చేవారు. అందరూ సర్దుకునేవారు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యాలయాలకు తమ పార్టీ  జెండా రంగులు వేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ రంగులను వేసే క్రమంలోనూ ఎన్నో వివాదాలు చెలరేగాయి.

ఆది నుంచి రంగుల వివాదమే

అయితే రాష్ట్ర ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. సుమారు 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రంగులు వేయడం పూర్తి అయిన వెంటనే పంచాయితీ ఎన్నికలు రావడంతో ఆ రంగులు చెరిపేయాలని అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను ఇచ్చారు. ఈ వివాదం కోర్టుకు కూడా ఎక్కింది.

రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకూ పార్టీ రంగులు వేసుకోవడంపై రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. దాంతో మరొక రంగు (మట్టిరంగు)ను జతచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది.

ఇది కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. కొత్త జీవోను రద్దు చేస్తూ కోర్టు ధిక్కార కేసు టేకప్ చేసింది. ఇక్కడ ఒక ప్రశ్న. ఇంత జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? ఐఏఎస్ అధికారులకు ఎలాంటి బాధ్యత ఉండదా? లేక వారు తీసుకోరా?

అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలి

ఇప్పుడు న్యాయ స్థానం అధికారులనే దోషులుగా నిలబెడుతున్న క్రమం వారు గమనించలేరా? ఈ ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. బహిరంగంగా కాకపోయినా వారి అంతరాత్మలకు.

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు అనే అంశాన్ని పైన సంక్షిప్తంగా చెప్పాం కానీ కూలంకషంగా పరిశీలిస్తే ప్రభుత్వ యంత్రాంగం మరీ ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల అచేతనావస్థపై ఒక కేస్ స్టడీ చేయవచ్చు. ఈ కేస్ స్టడీని ఐఏఎస్ అధికారుల శిక్షణ లో ఉపయోగించుకుంటే భవిష్యత్తులో అధికారులు ఎలా ఉండకూడదో నిర్దేశించుకోవచ్చు.

నిక్కచ్చిగా ఉంటే ఏం జరుగుతుంది?

 పంచాయితీరాజ్ శాఖ కు చెందిన ఐఏఎస్ అధికారులు పార్టీ రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేయాలని పాలకులు చేసిన నిర్ణయాన్ని అమలు చేయకుండా ఉన్నట్లయితే ఈ పరిణామాలు జరిగి ఉండేవి కాదు. అలా చేయడానికి కుదరదు అని చెప్పి ఉంటే బహుశ వారిని ట్రాన్సఫర్ చేసి ఉండేవారేమో.

మరో అధికారి వచ్చినా అదే చెబితే ఎందరిని బదిలీ చేస్తారు? చేయలేరు కాబట్టి తప్పిదం జరగకుండా ఆగి ఉండేది. కోర్టు కేసు తొలి జీవోపై అభ్యంతరాలు చెప్పినప్పుడైనా సంబంధిత ఐఏఎస్ అధికారులు తప్పు దిద్దుకొని ఉంటే బాగుండేది. కానీ మధ్యలో మట్టి రంగుతో సున్నా చుట్టి అన్నిరంగులూ మార్చాం అని చెప్పుకోవడం చూస్తుంటే ఇది అత్యంత మేధావులైన ఐఏఎస్ అధికారుల నిర్ణయమేనా అనిపిస్తుంది.

పాలకులు చెప్పేవి గుడ్డిగా అమలు చేయడానికి క్లర్కులు సరిపోతారు. దానికి ఐఏఎస్ లు ఎందుకు? ఆలోచించండి.

Related posts

మంత్రి వచ్చిన ప్రతి సారీ మిమ్మల్ని అరెస్టు చేస్తారా?

Satyam NEWS

బైపాస్ రోడ్డు పనులు నిలిపివేయాలి

Satyam NEWS

చీమలపాడు ప్రమాద బాధితులను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment