28.7 C
Hyderabad
April 28, 2024 05: 47 AM
Slider నిజామాబాద్

ఫిరాయింపులు ప్రోత్సహిస్తే పుట్టగతులు లేకుండా చేస్తాం!

#Vishnuvardhana Reddy

భాజపా నుంచి ఫిరాయింపును ప్రోత్సహించే పార్టీలకు తగిన బుద్దిచెబుతామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి హెచ్చరించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో విష్ణువర్ధనరెడ్డి మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాజపా ఎదుగుదలను ఓర్చుకోలేని ప్రాంతీయ పార్టీలు తమ చేతుల్లో వున్న సామాజిక మాధ్యమాల ద్వారా అసత్యప్రచారం చేస్తూ బురదజల్లుడు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు విమర్శించారు. భీమవరంలో మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశం సందర్భంగా హాజరుకాని కొందరు పార్టీ రాష్ట్ర నాయకులు ఫార్టీ ఫిరాయిస్తున్నట్లు ప్రచారం చేశారన్నారు.

అలాగే పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజుపై కూడా దుష్ప్రచారానికి ఒడిగట్టారన్నారు. భాజపా జనసేనల మధ్య పొత్తులపై అసత్యప్రచారం చేస్తున్న వ్యక్తులు, ప్రాంతీయ పార్టీల వైఖరిని తీవ్రంగా ఖండించారు. తెదేపా, వైకాపా కుటుంబ , అవినీతి పార్టీలు కేన్సర్‌ వంటివని వీటిని వదిలించుకుంటే గాని రాష్ట్రం బాగుపడదని సూచించారు. మార్చిలో ప్రజాపోరు 2 కార్యక్రమం ద్వారా 50 లక్షల ఇళ్లను సందర్శించి రాష్ట్ర ప్రజావ్యతిరేకవిధానాలపై ప్రజలను చైతన్యవంతం చేసి 10 వేల ఛార్జిషీట్లు వేస్తామన్నారు. సభల్లో పదులకొద్దీ మరణిస్తునా వాటిని ఆపక కొనసాగించడం వల్లే ప్రభుత్వం అప్రజాస్వామిక జీవో నెంబరు 1 తీసుకువచ్చిందని విమర్శించారు. 2024లో భాజపా మోదీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎన్నికలకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ పార్టీలను సమూలంగా తొలగించివేయాలని, భాజపాను గెలిపించి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ను తీసుకొచ్చి రాష్ట్రాన్నిఅ భివృద్ధి చేయాలని ప్రజలను కోరారు.

భారతీయ జనతా పార్టీ భీమవరంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గసమావేశం ఎపీ భవిష్యత్‌ను నిర్ణయించేలా జరిగింది. ఇద్దరు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితిని రాజకీయ తీర్మానం ద్వారా ప్రజల ముందుంచాం. 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన చేతగాని పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారు. ప్రధాని మోదీ రూ.వెయ్యి కోట్లతో కొత్తగా పార్లమెంటును నిర్మిస్తే రూ.2 వేల కోట్లు తీసుకున్న చంద్రబాబు కనీసం శాశ్వత శాసనసభను, రాజధానిని పూర్తిచేయకపోవడం వల్లే 3 రాజధానుల డ్రామాకు జగన్‌ తెరలేపి రాష్ట్రంలో సమస్యలను పక్కదోవ పట్టించేలా ఎత్తుగడవేశారు.

మూడున్నరేళ్లలో ఏంచేశారో చెప్పగలరా?

కేంద్రం చేసిన అభివృద్ధి పనులు తప్ప ఏముంది వీరు చెప్పడానికి. రైల్వే, పారిశ్రామిక సమూహాలు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులకు రాష్ట్రం భాగస్వామ్య నిధులు ఇవ్వక పోవడంతో ఆగిపోయాయి. ఒక్క సాగునీటి ప్రాజెక్టును అయినా పూర్తిచేశారా? సంపద సృష్టించే పరిశ్రమలు నిర్మించారా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో స్టీలు ఫ్యాక్టరీని శంకుస్ధాపన చేసి వదిలేశారు. మీ హయాంలో చేసిన శంకుస్ధాపనల పునాదిరాళ్లు సమాధిరాళ్లగా కనిపిస్తున్నాయి.

చంద్రబాబు, జగన్‌లు మాత్రం డైరీలు, సిమెంటు కంపెనీలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు నడుపుకుంటున్నారు తప్ప ఇతరులకు అవకాశం లేకుండా చేశారు. ఈ కుటుంబ వారసత్వ, అవినీతి పార్టీలను గెలిపిస్తే రాష్ట్రం నట్టేట మునిగిపోయినట్లే. రాష్ట్రానికి వీరి పీడవిరగడ కావాలి. వీరి దోపిడీతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వైకాపా నాయకులు కమిషన్ల కోసం వ్యాపారులను బెదిరించడం సర్వసాధారణం అయిపోయింది. బతకాలంటే కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిరది. జీతాల కోసం గవర్నరును కలసిన దుస్థితిలో రాష్ట్ర ఆర్ధికపరిస్థితిని వైకాపా దిగజార్చింది. మూడున్నరేళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు.

మార్చిలో ప్రజాపోరు 2 ప్రారంభం

2024 ఎన్నికలే లక్ష్యంగా భాజపా 400 రోజుల ప్రణాళిక రూపొందించింది. గతంలో చేసిన ప్రజాపోరు కార్యక్రమం ద్వారా 6,500 వీధి సభలు నిర్వహించాం. ఇప్పుడు మార్చిలో ప్రజాపోరు 2 పేరుతో 50 లక్షల ఇళ్లు సందర్శిస్తాం. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యంతులను చేస్తాం. వైకాపా చేసిన తప్పులపై ప్రజల సంతకాలతో 10 వేల ప్రజాఛార్జిషీట్‌లు వేస్తాం. జగన్‌ తన పాదయాత్రలో లక్ష హామీలిచ్చి 9 మాత్రమే అమలుచేసి మిగతావి గాలికొదిలేశారు. అవినీతిలో తప్ప రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లడం లేదు. 2024లో తెదేపా, వైకాపా ఏది గెలిచినా రాష్ట్రంలో 50 లక్షల మంది పక్కరాష్ట్రాలకు వెళ్లిపోవడం ఖాయం. కేన్సర్‌ వంటి తెదేపా, వైకాపాలను రాష్ట్రం నుంచి తొలగించాలి.

ఫిరాయింపులకు బదులిస్తాం

ఒకరిద్దరు భాజపా నాయకులను చేర్చుకోడానికి తెదేపా, వైకాపాలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయి. భాజపా జోలికొచ్చిన పార్టీలు ఈ దేశంలో కాలగర్భంలో కలిసిన విషయాన్ని గుర్తుచేస్తున్నాం. భాజపా శక్తిసామర్ధ్యాలను గుర్తించారు కాబట్టే రాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండా మద్దతుఇచ్చారు. ప్రసార సాధనాలను గుప్పిట్లో పెట్టుకుని విషప్రచారం చేయడం సరికాదు. పోలవరం, ప్రత్యేకహోదా అంశాలపై భాజపాని నిందించే ఊసరవెల్లి వంటి నాయకులు ఈ సమస్యకు కారణమైన తెదేపా, వైకాపాలను ఎందుకు నిలదీయరు? బస్సులు, విహారయాత్రలు ఇప్పుడే గుర్తుకువస్తాయా? చేతనైతే ఈ రెండు పార్టీలతో చర్చ నిర్వహించాలి. కేసులు, ఆస్తుల కోసం కేసీఆర్‌కే భయపడే నేతలు భాజపాని ప్రభావితం చేయలేరు.

దుష్ప్రచారం మానుకోవాలి

జగన్‌, షర్మిల, చంద్రబాబు, లోకేష్‌ తప్ప పాదయాత్రలు చేయడానికి ఆ పార్టీలో నేతలే లేరా? ఎందుకు వారసలే చేస్తున్నారు? నిన్నటి సమావేశానికి భాజపా నేతలు పురందేశ్వరి, సత్యకుమార్‌, కన్నా లక్ష్మీనారాయణ, టీజీ వెంకటేష్‌ రాలేదని వచ్చిన వార్తలు వాస్తవం కాదు. పురందేశ్వరి, సత్యకుమార్‌లు వేరే రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల్లో ఉన్నారు. టీజీ వెంకటేష్‌ కేంద్ర మంత్రి పర్యటనలో ఉన్నారు. సుజనా, కన్నా లక్ష్మీనారాయణలు పార్టీ ముందుస్తు అనుమతి తీసుకున్నారు. అనధికార వ్యక్తుల అసత్య, అసంపూర్ణ కథనాలతో సంచనాలకోసం ఇచ్చే సమాచారంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అందువల్ల మీడియా సంస్థలు అధికారప్రతినిధుల సమాచారంతోనే ముందుకువెళ్తే బావుండేది. జగన్‌ గాని చంద్రబాబు గాని సమావేశాలు పెడితే సగం మంది ఎమ్మెల్యేలు రాని వాస్తవాన్ని కూడా బహిరంగపరచాలి.

పొత్తులు పొట్టుకుని మింగేసే పార్టీలవి

3 దశాబ్దాలు రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల పొత్తులు పెట్టుకుని భాజపా నష్టపోయింది. పక్కరాష్ట్రాల్లో జెండా తీసేసిన వైకాపా, తెదేపాల్లో ఒకటి 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనుమరుగైపోయేలా భాజపా రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు ప్రజల మద్దతు పొందుతున్న చిన్న పార్టీలను బలిచేయాలని చూస్తున్నారు. చిరంజీవి పార్టీని అలాగే ముంచేశారు. భాజపా అవినీతి పార్టీలతో కలవదు. ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. మా నాయకులపై మాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. వేరే పార్టీల నుంచి తెదేపా, వైకాపాల్లోకి వెళ్తే పునీతులు, భాజపాలోకి వస్తే భూతద్దంలో పెట్టి చూపిస్తారా?

భాజపా రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజుపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం

45 ఏళ్ల నుంచి వీర్రాజు పార్టీలో వున్నారు. ఆయనకు పదవీ కాంక్ష లేదు. భాజపాలో పదవులు సాధారణంగానే వరిస్తాయి. హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, సోమువీర్రాజు అధ్యక్షులయ్యారు. జిల్లాలకు అధ్యక్షులుంటారు. పదవుల మార్పులు జరిగితే అది అసమ్మతి ఎలా అవుతుంది? కావాలని విషప్రచారం చేస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన భాజపాలో ఎవరూ బయటకు వెళ్లరు. అందరూ పార్టీలోనే ఉంటారు.

2024 ఎన్నికల్లో మోదీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారం చేసుకుని విజయం సాధిస్తుంది. భాజపాదే రాజకీయ ఆట. జీవో నెంబరు 1 అప్రజాస్వామికం. విపక్ష పార్టీలను ప్రజలకు చేరువ చేయకుండా వైకాపా తీసుకొచ్చిన దుర్మార్గ అస్త్రం. ఈ జీవో తీసుకురావడానికి తెదేపానే కారణం. కందుకూరు సభలో 8 మంది మరణిస్తే మరుసటి రోజే సభ నిర్వహించారు. తన సభల్లో మరణాలకు వైకాపా కుట్రగా ఆరోపించే చంద్రబాబు ఎందుకు కేసును పెట్టరు? సీబీఐని ఆహ్వానించవచ్చు కదా? ఓట్ల రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో తెదేపా, వైకాపా చెలగాటమాడుతున్నాయి.

Related posts

ఆనందయ్య మందులో హానికర పదార్ధాలు లేవు

Satyam NEWS

సీఎం కేసీఆర్ డిమాండుకు స్పందించిన కేంద్రం

Satyam NEWS

భూ కబ్జా, బెదిరింపుల కేసులో మరొకరి అరెస్ట్

Satyam NEWS

Leave a Comment