30.7 C
Hyderabad
April 29, 2024 04: 31 AM
Slider సంపాదకీయం

వైసీపీ నేతల వత్తిడితోనే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు

#chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు వెలువడిన వార్తల వెనుక వైసీపీ పెద్దల కుట్ర ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. అసలు నోటీసుల జారీ నుంచే వైసీపీ నేతలు చక్రం తిప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు.

రాజధాని అమరావతిలో పనులు చేపట్టిన నిర్మాణ కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకున్న వారి నుంచి ఆయనకు ముడుపులు అందాయని తమకు వచ్చిన ఆరోపణలపై సమాధానం కోరుతూ ఆదాయపు పన్ను శాఖ గత ఏడాది చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. దీనికి ఆయన అప్పుడే సమాధానం ఇచ్చారు.

ఎవరో చేసిన ఆరోపణ మినహా దానిని బలపర్చే ఆధారాలు ఏవీ ఆదాయపు పన్ను శాఖ చూపలేకపోయిందని, ముడుపులు తనకు అందినట్లు ఆధారాలు చూపకుండా తనకు నోటీసులు ఇవ్వడం సరికాదని తన సమాధానంలో ఆయన అప్పటిలోనే పేర్కొన్నారు. నోటీసు ఇచ్చిన విభాగానికి దీనికి సంబంధించిన పరిధి లేదని కూడా ఆయన అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎలాంటి తదుపరి చర్యలను ఆ శాఖ తీసుకోలేదు.

వాస్తవాలు ఇలా ఉండగా ఆదాయపన్ను శాఖ మళ్లీ నోటీసులు ఇచ్చినట్లు ఢిల్లీ నుంచి వెలువడే ఒక ఇంగ్లీషు దినపత్రిలో ప్రచురితం కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు దీనిపై కూపీ లాగేందుకు ప్రయత్నించారు. వ్యవస్థలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో వైసీపీ నేతలు ఎంతో చురుకుగా వ్యవహరిస్తారు. ఆదాయపు పన్ను శాఖ పాత విషయంలో మళ్లీ నోటీసులు ఎందుకు పంపిందనే విషయంలోనూ, వార్తా కథనాలు రావడం దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక ఉన్న అదృశ్య శక్తులపై ఆరా తీయగా వైసీపీ కుట్ర కోణం బయటపడింది.

రాజధాని అమరావతిలో పలు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు రూ. 118 కోట్ల ముడుపులు అందాయనేది ఆరోపణగా జాతీయ పత్రిక తన కధనంలో పేర్కొంది. షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్ధసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఈ విషయం బయటకు వచ్చినట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.

బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని కూడా ఆ ఇంగ్లీష్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. ఒక నిర్మాణ సంస్థకు చెందిన కన్సల్టెంట్‌ తమకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రాధమిక ఆధారంగా సరిపోతుందని, పరిధికి సంబంధించి లేవనెత్తిన అభ్యంతరం సరికాదని తాజా నోటీసులో ఆదాయపు పన్ను శాఖ వారు పేర్కొన్నట్లు కూడా ఆ ఆంగ్ల పత్రిక పేర్కొన్నది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన కొత్తలో ఆదాయపు పన్ను శాఖ ఈ ఆరోపణకు సంబంధించిన విచారణను ప్రారంభించింది. ఇందులో ఆధారాలు లేవని ఇంతకాలం పట్టించుకోలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ వర్గాల వత్తిడితో మళ్లీ నోటీసులు జారీ చేసినట్లు అనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నిజంగా ఆధారాలు ఉంటే ఈ విభాగాలు ఇంతకాలం వేచి చూసేవి కావని వారు అభిప్రాయపడ్డారు. రాజకీయ ఒత్తిడితోనే తాజా నోటీసులు జారీ అయ్యాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి.

సరైన సమాచారం లేదని పక్కన పడేసిన కేసులో మళ్లీ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం వెనుక వైసీపీ ప్రభుత్వ వర్గాల ఒత్తిడి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తమకు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ విభాగం వారు చాలా కాలంగా ఆదాయపు పన్ను శాఖను, ఈడీ విభాగాన్ని పలుమార్లు కోరారు. అయితే వారు రాసిన లేఖలకు ఆ విభాగాలు ఏ వివరాలు ఇవ్వలేదు. తమ వద్ద ఆధారాలు లేనందునే ఆదాయపు పన్ను శాఖ ఇంత కాలం మౌనంగా ఉండిపోయింది.

అయితే ఇప్పుడు వైసీపీ పెద్దల వత్తిడితోనే చంద్రబాబుకు మళ్లీ మరోసారి నోటీసులు పంపారని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుల పై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు కూడా ఆ పత్రిక తన కధనంలో పేర్కొన్నది. ఐటీ అధికారులు సెక్షన్‌163C కింద షోకాజ్ నోటీసులు జారీ చేశారని కూడా ఆ ఇంగ్లీష్ దినపత్రిక వెల్లడించింది. వైసీపీ నేతలు ఈవిధంగా బురద చల్లే విధంగా ప్రవర్తించడంపై తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

కామెంట్: జగన్ మెప్పు కోసం ఉస్కో బ్యాచ్

Satyam NEWS

నీటిలో కొట్టుకొస్తున్న మృతదేహాలు

Satyam NEWS

పుడమి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించిన పొంగులేటి

Bhavani

Leave a Comment