27.7 C
Hyderabad
April 26, 2024 05: 42 AM
Slider కరీంనగర్

పెద్దోళ్ల ధన దాహం ముందు ఓడిన పేదోడు

#DoubbleBedroomHouse

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరులో కొంతమంది మాజీ ప్రజాప్రతినిధుల ధనదాహం ముందు నిరుపేదలు ఓడిపోయారు. కాసులకు కక్కుర్తి పడిన కొంతమంది రాజకీయ నాయకుల కుతంత్రంతో ఉన్నోళ్లకే ఇండ్లు ఇచ్చి ఏమీ లేని తమకు తీరని అన్యాయం చేశారంటూ సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.

అంతా తెలిసినా తమకేమి పట్టనట్లు అధికారులు తూతూ మంత్రంగా ఇండ్ల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారంటూ కొంతమంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరుపేదలకు అందజేసేందుకు ప్రభుత్వం 165 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేసేందుకు అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించగా సుమారు 365 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై సర్వే జరిపిన అధికారులు డబుల్ బెడ్ రూమ్ ల కొరకు అర్హులను గుర్తించారు. అధికారులు చేపట్టిన సర్వేలో అవకతవకలు జరిగాయని, అర్హులను కాదని అనర్హులకు ఇండ్లు కేటాయించారని  కాంగ్రెస్ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు  ఆరోపించారు.

కాగా కొంతమంది మాజీ నేతలు డబుల్ బెడ్ రూమ్ మంజూరు కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. తాజాగా ఓ యువకుడు తనను డబుల్ బెడ్ రూమ్ కొరకు లక్ష యాభై వేల వరకు డిమాండ్ చేశారని, అర్హుడినైనా తనతో పాటు మరికొంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, డబ్బులు ముట్టచెప్పిన వారికి మాత్రం ఇండ్లు మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది.

రెక్కాడితే గానీ డొక్కాడని తమకు ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూశామని కానీ చివరకు నిరాశే మిగిలిందని నిరుపేదలు కన్నీటి పర్యంతమయ్యారు. తమ దీన స్థితిని చూసైనా కనికరించకపోవడం పట్ల ఆవేదన చెందారు.

కాగా నిరుపేదలకు ఇండ్లు మంజూరి చేయకపోగా ఒక ఇంట్లో ముగ్గురికి, అలాగే ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారికీ ఇండ్లు ఎలా ఇస్తారని స్థానిక ప్రజలు అధికారులను నిలదీశారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని డబుల్ బెడ్ రూమ్ మజూరిలో జరిగిన అవకతవకలను గుర్తించి తగు విచారణ చేపట్టి అర్హులైన తమకు ఇండ్లు మంజూరయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

గుడ్ న్యూస్: డాక్టర్లకు, వైద్య సిబ్బందికి శాలరీ కట్ లేదు

Satyam NEWS

అరబ్ ఎమిరేట్స్ కు అమెరికా యుద్ధ విమానాలు

Satyam NEWS

ఆస్తి పన్ను, చెత్త పన్నుపై బిజెపి తీవ్ర నిరసన

Satyam NEWS

Leave a Comment