32.7 C
Hyderabad
April 26, 2024 23: 55 PM
Slider సంపాదకీయం

వై ఎస్ కుటుంబంలో సఖ్యత కోసం మోడీ పెద్దరికం?

#modi

వై ఎస్ కుటుంబంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దరికం వహిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తున్నది. వై ఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం సభ్యుల మధ్య మాటలు కూడా లేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అన్న అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కాదని ఆయన చెల్లెలు వై ఎస్ షర్మిల తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ పెట్టడం, ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం జరిగింది.

సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కు సంబంధించి కూడా కుటుంబంలో తీవ్ర వివాదాలు ఉన్నాయి. వై ఎస్ వివేకా కుమార్తె, సీఎం జగన్ మరో చెల్లెలు సునీత ఆ హత్య కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సీబీఐ కోర్టుకు మార్చేలా చేసుకోవడం కూడా ఏపి ప్రభుత్వం పరువును పూర్తిగా తీసింది. సునీత, షర్మిల ఏపి సీఎం జగన్ పై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వివేకా హత్య కేసులో షర్మిల కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. వైఎస్ షర్మిల, వై ఎస్ జగన్ ల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. వీటిపై ఇద్దరూ కూడా పెదవి విప్పడం లేదు కానీ ఇద్దరి మధ్య తల్లి విజయలక్ష్మి నలిగిపోతున్నారు. ఆమె కుమార్తె ఇంటిలోనే హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ తగాదాలు రచ్చకెక్కినట్లు పలువురు చెప్పుకుంటున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ మరొక్క మారు చర్చకు వచ్చాయి. తెలంగాణ లో పాదయాత్ర చేస్తున్న షర్మిల వరంగల్ జిల్లాలో అక్కడి ఎమ్మెల్యేలను తీవ్రంగా విమర్శించడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన కార్యకర్తలు దాడులు చేయడంతో అందుకు నిరసనగా షర్మిల హైదరాబాద్ లో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో షర్మిలను పోలీసులు కారులో ఉండగానే కారుతో సహా రోడ్డు పై నుంచి క్రేన్ లతో తొలగించి ఆమెను అరెస్టు చేశారు. దీనిపై విజయలక్ష్మి నిరాహార దీక్షకు దిగటం, బెయిల్ రావడంతో ఉప సంహరించుకోవడం జరిగిపోయాయి. తెలంగాణ పోలీసులు చేసిన ఈ చర్యతో ఒక్క సారిగా షర్మిలపై సానుభూతి పెరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ షర్మిలకు మద్దతు తెలుపడమే కాకుండా ఆమెను పిలిచి మాట్లాడారు.

ఈ నేపథ్యంలో ఏపి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. జీ 20 దేశాలకు భారత్ నేతృత్వం వహించే సందర్భంగా ప్రధాని మోదీ దేశంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీల నేతలను పిలిచి మాట్లాడారు. అందులో జగన్ కూడా ఉన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఏపి సీఎం జగన్ తో అక్కడే ఏకాంతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ లో చెల్లికి జరిగిన విషయాలను అడిగినట్లు తెలిసింది.

అయితే తనకు పూర్తి వివరాలు తెలియవని జగన్ సమాధానం ఇచ్చినట్లు కూడా అంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమస్యలను కూడా జగన్ సంక్షిప్తంగా ప్రధానికి చెప్పినట్లు కొందరు అంటున్నారు. ఈ విషయాలన్నీ విన్న ప్రధాని చొరవ తీసుకుని షర్మిలతో మాట్లాడారని వార్తలు వెలువడుతున్నాయి. ప్రధాని మోదీ ఆస్తికి సంబంధించిన విషయాలు మాట్లాడారా లేక రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడారా అనే విషయం స్పష్టం కాలేదు.

అయితే ఆయన ఫోన్ చేసి హైదరాబాద్ పోలీసులు చేసిన చర్య గురించి మాట్లాడారని, ఆమెకు సంఘీభావం వ్యక్తం చేశారని వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంతో బాటు కుటుంబంలో ఉన్న సమస్యలపై కూడా మోదీ మాట్లాడారని అన్న చెల్లెలు మధ్య సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారని కూడా అంటున్నారు. ధృవీకరణ కాని ఈ వార్తలలో నిజం ఉందో లేదో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి.

Related posts

“ఫ్రెండ్ షిప్” టైటిల్ లోగో ఆవిష్కరించిన మంత్రాలయం పీఠాధిపతి

Satyam NEWS

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై దిద్దుబాటు చర్యలు

Satyam NEWS

పోలీసులకు చిక్కిన కొండగట్టు ఆలయం దొంగలు

Satyam NEWS

Leave a Comment