30.7 C
Hyderabad
April 29, 2024 06: 15 AM
Slider సంపాదకీయం

గాలి వాటం మార్చుకున్న పవన్ కల్యాణ్?

#pavankalyan

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహంలో మార్పు కనిపిస్తున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. గతంలో టిడిపి నేతలపై ఎక్కడ దాడులు జరిగిన ముందుగా ఖండిస్తుండే పవన్ కళ్యాణ్ ఈ నెల 4న అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చెలరేగిన ఘర్షణల గురించి మాట్లాడాలేదు.  కనీసం చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినప్పుడు కూడా ఆయన స్పందించలేదు.  ఈ విషయంలో బిజెపి కూడా మౌనం వహించింది. బీజేపీ బాటలోనే పవన్ కల్యాణ్ వెళుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా గత వారం వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ నిధులను దారిమళ్లిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలలో జనసేన శ్రేణులు కూడా పాల్గొన్నాయి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు బీజేపీ, జనసేన శ్రేణులు ఉమ్మడిగా వైసీపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా గళం విప్పాయి.

గత నెలలో గోదావరి జిల్లాలో చేపట్టిన `వారాహి విజయ్ యాత్ర’ సమయంలో గాని, ప్రస్తుతం విశాఖపట్టణంలో చేబడుతున్న యాత్రలో గాని ఎక్కడా టిడిపితో పొత్తు విషయం గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించడం లేదు.  ఈ యాత్రకు లభిస్తున్న అనూహ్య ప్రజా స్పందన చూసిన తర్వాత ఆయన ధోరణిలో కూడా మార్పు వచ్చిన్నట్లు పలువురు అనుమానిస్తున్నారు.

మొన్నటి వరకు వైఎస్ జగన్ ప్రభుత్వంను గద్దె దింపడం గురించే మాట్లాడిన ఆయన ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి మాట్లాడుతున్నారు. విశాఖలోని సిరిపురంలో వివాదాస్పద సీబీసీఎన్సీ భూములను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న జగన్ చేస్తున్న అక్రమాలు, భూ కబ్జాలు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటామని, ప్రతి దానిపైనా కొత్త ప్రభుత్వంలో విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. రోజూ జగన్ కోర్టులు చుట్టూ తిరగడం ఖాయమని హెచ్చరించారు.

ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రిని అవుతానంటూ మొదటిసారిగా తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అనే సంకేతం ఇస్తున్నారు. టిడిపితో పొత్తు ఉంటె అటువంటి అవకాశం ఉండదని అందరికి తెలిసిందే. రెండు పార్టీలు పోటీ చేసే సీట్ల విషయంలో ఓ అవగాహనకు రావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నట్లు ఓ వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ అటువంటి భేటీ ఏమీ జరగలేదు. పొత్తుల విషయం తేలకుండానే తెనాలి నుండి తమ అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ గుంటూరులో ప్రకటించడం కలకలం రేపింది.  పొత్తు విషయం తేలకుండా ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారంటూ టిడిపి నేతలు కొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంతకు ముందు రాష్త్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు  జనసేనతో పొత్తును దృష్టిలో ఉంచుకొని ఉమ్మడిగా కార్యక్రమాలు జరిపే ప్రయత్నాలు చేయలేదు. పొత్తు విషయం ప్రకటించిన రోజునే విజయవాడ నుండి అమరావతికి పాదయాత్ర జరుపబోతున్నట్లు రెండు పార్టీల నేతలు ప్రకటించి ఆ తర్వాత ఆ విషయాన్నే పట్టించుకోలేదు. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే దగ్గుబాటి పురందేశ్వరి జనసేనతో కలిసి ప్రయాణం సాగిస్తామని ప్రకటించారు. ఆమె చేపట్టిన మొదటి ఆందోళన కార్యక్రమంలోనే జనసేన శ్రేణులు పాల్గొనేటట్లు చేయగలిగారు. దానితో ఎన్నికల వరకు రెండు పార్టీలు ఉమ్మడిగా నడిచే అవకాశం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సహితం టిడిపితో సంబంధం లేకుండా అన్ని జిల్లాలో బలమైన అభ్యర్థులకు ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే వైసిపి వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడటం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయాల్సిందే అంటూ కొంతకాలంగా పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. టిడిపితో పొత్తు కోసం బిజెపి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించేందుకు రెండు సార్లు ఢిల్లీ వరకు వెళ్లి వచ్చిన ఆయన ఇప్పుడు ఆ విషయం గురించే మాట్లాడటం లేదు. అందుకనే జనసేన, బీజేపీ వ్యూహాత్మకంగా, ఉమ్మడిగా ఎన్నికల వైపు అడుగులు వేసే అవకాశాలు స్పష్టం అవుతున్నాయి.

Related posts

Atrocious: యువతి కిడ్నాప్: సామూహిక అత్యాచారం: దారుణ హింస

Satyam NEWS

కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి కల్తీ కల్లు బానిసల తాకిడి

Satyam NEWS

తానా సభలకు వెళ్తున్న టి .డి .జనార్దన్

Bhavani

Leave a Comment