40.2 C
Hyderabad
May 2, 2024 18: 13 PM
Slider సంపాదకీయం

తప్పు మీద తప్పు: చివరికి మిగిలేదేమిటి?

#JaganMohanReddy

ఏమి సాధించేందుకు అమరావతి నుంచి రాజధానిని మార్చాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. రాష్ట్ర హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా జగన్ బృందం ఆలోచనలలో ఏ మాత్రం మార్పు రాలేదు సరి కదా మూడు రాజధానుల విషయం మరింత ముందుకు తీసుకువెళ్లాలని పట్టుదలతో ఉన్నారు. మూడు రాజధానులు తమ విధానం అనే విషయాన్ని కూడా తాజాగా మర్చిపోయి కేవలం విశాఖ పట్నం ఒక్కటే రాజధాని అని చెప్పేస్తున్నారు.

అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బృందం వెనువెంటనే మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చింది. ఇప్పుడు ఒకే రాజధాని అదీ కూడా విశాఖ అనే వాదనను బలంగా వినిపిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో అంతా కమ్మ కులస్తులే ఉన్నారని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చాలా మంది దాన్ని నమ్మారు. అదే విధంగా అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో ‘‘ఇన్ సైడర్ ట్రేడింగ్’’ జరిగిందనేది వైసీపీ మరో ప్రధాన ఆరోపణ.

దీన్ని కూడా ఎంతో మంది నమ్మారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని విశేషంగా వైసీపీ అనుకూల వర్గాలు ప్రచారం చేశాయి. దాన్ని కూడా జనం నమ్మారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయింది. పైన చెప్పినవేవీ రుజువు కాలేదు. వైసీపీ ప్రతిపక్షంగా చేసిన ఆరోపణలలో ఒక్కటి కూడా రుజువు కాలేదు.

బలిమిడికి అప్పటి మంత్రి నారాయణపై కేసులు నడపడం తప్ప నాలుగేళ్లుగా ఏం చేయలేకపోయారు. అమరావతి ప్రాంతంలో కమ్మ వాళ్లు తక్కువ. కమ్మ వాళ్ల కన్నా రెడ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ కమ్మా రెడ్డి కన్నా ఎక్కువగా దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. భూములు ఇచ్చిన వారిలో కూడా దళితులు, బిసిలు, రెడ్లు ఎక్కువగా ఉన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే కేసే నిలబడలేదు.

ఇలా ఒక్కొక్కటిగా వైసీపీ చేసిన ఆరోపణల మబ్బులు వీడిపోతున్నా తాను చేస్తున్న తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం కాకుండా మూడు రాజధానుల నుంచి విశాఖ ఒక్కటే రాజధాని అనే స్థాయికి జగన్ ప్రభుత్వం వచ్చేసింది. మూడు ప్రాంతాల వారిని రెచ్చగొట్టి, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టి రాబోయే ఎన్నికలలో లబ్ది పొందేందుకు మాత్రమే వైసీపీ ఈ నాటకం ఆడుతున్నదని ఇప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలు అనుకుంటున్నారు.

రాయలసీమ కు హైకోర్టు తరలించే ప్రతిపాదనే లేదని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే చెప్పేసింది. మూడు రాజధానుల బిల్లును జగన్ ప్రభుత్వం తనంతట తానే ఉప సంహరించుకున్నది. మళ్లీ బిల్లు తీసుకువస్తామని చెబుతున్నారు కానీ అందుకు న్యాయ పరమైన అడ్డంకులు ఎన్నో ఉన్నాయి.

ఇలా తాను చెప్పిన మాటలను తానే పలుమార్లు మార్చుకున్న పార్టీగా వైసీపీ ప్రజల్లో చులకనైపోయింది. ఒక సారి మూడు రాజధానులని  మరో సారి విశాఖ రాజధాని అని చెబుతూ ప్రజలల్లో అభాసుపాలు అయిపోతున్నారు. విశాఖపట్నం రాజధాని అని చెబుతున్న ఉత్తరాంధ్ర నాయకులు ఒక వైపు, రాయలసీమకు జగనే న్యాయం చేస్తున్నాడని వాదించే రాయలసీమ నాయకులు ఎవరి వాదన వారు వినిపిస్తూ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించిన సెంటిమెంట్ ను రగిల్చేందుకు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే విచిత్రంగా ఎక్కడా కూడా ప్రజలు వైసీపీ వారితో కలిసి రావడం లేదు. మూడు రాజధానుల పేరుతో చేస్తున్న వాదనలే పేలవంగా ఉన్న సమయంలో ఇక మూడు ప్రాంతాలలో సెంటిమెంటు రగిల్చి రాజకీయ లబ్ది పొందే ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది? ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఒక మంత్రి నోరు జారడం జగన్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

ఇవన్నీ జగన్ పాలనపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి….. ఇప్పటికే చూపించేశాయి. రాజధాని లేని రాష్ట్రంగా ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తుంటే వైసీపీ నేతలే సమాధానం చెప్పలేకపోతున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో రాజధాని కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పదే పదే భంగపడటం మరింత చిన్నతనంగా ఉన్నది. రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు తమ కేసును అత్యవసరంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టును కోరుతున్నది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరికను సుప్రీంకోర్టు పలు మార్లు తిరస్కరించింది. అయినా సుప్రీంకోర్టు వద్ద జగన్ ప్రభుత్వం భంగపడుతునే ఉన్నది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నదో ఎంత తరచి చూసినా అర్ధం కావడం లేదు. వారు ఆశిస్తున్న రాజకీయ లబ్ది కూడా సుదూరంగానే ఉన్నది. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయానికి కూడా రాజకీయ లద్దె కూడా రావడం లేదు. పైగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చేస్తున్నది. ఈ దశలో తప్పులను సరి చేసుకోవడం మానేసి మరిన్ని తప్పులు చేయడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారింది.

Related posts

తిరుపతి వందేభారత్‌లో 1,128 సీట్లు

Bhavani

టెన్షన్ రన్:కృష్ణానదిపరీవాహక ప్రాంతంలో భూప్రకంపనలు

Satyam NEWS

గిరిజనుల గ్రామాలలో ఖాకీల పర్యటన.. కరోనా పట్ల అవగాహన

Satyam NEWS

Leave a Comment