42.2 C
Hyderabad
April 26, 2024 17: 15 PM
Slider సంపాదకీయం

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఇరకాటంలో సోము

#SomuVeeraju

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని బిజెపి తనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ బిజెపికి అనూహ్య పరిణామం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గట్టిగా వాదించి ప్రజలలోకి వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడుగా వచ్చిన సోము వీర్రాజు కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి పై జరుగుతున్న న్యాయపోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయంగా తేల్చి చెప్పింది.

మూడు రాజధానులకు వ్యతిరేకుల్ని సాగనంపిన బిజెపి

కేంద్రంలో అధికారంలో ఉన్నది బిజెపినే కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం బిజెపి చెప్పినట్లుగానే అందరూ భావించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడిన బిజెపి నాయకులు రామ్ మాధవ్ లాంటి వారిని కూడా పార్టీ పునర్ వ్యవస్థలో భాగంగా పక్కన పెట్టడంతో బిజెపిలో ఒక సంకేతం స్పష్టంగా వెళ్లింది.

అమరావతి రాజధానిగా ఉండాలని ఎవరూ మాట్లాడరాదనే సంకేతంతో న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని బిజెపిలోని కొందరు నాయకులు ప్రకటనలు విడుదల చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వాదించిన వారిని పార్టీ నుంచి సోము వీర్రాజు సస్పెండ్ కూడా చేశారు.

సైలెన్సు పాటిస్తున్న సుజనా చౌదరి

రాజధానిగా అమరావతి కొనసాగి తీరుతుందని, మార్చే అవకాశం లేదని చెప్పిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత రాజధానిపై మాట్లాడటమే మానేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతిపై బిజెపి తన వైఖరిని స్పష్టంగా ఎప్పుడూ చెప్పలేదు.

తాజాగా పవన్ కల్యాణ్ బిజెపి అమరావతి పక్షానే ఉందని వెల్లడించడంతో బిజెపి ఇరకాటంలో పడినట్లయింది. బిజెపి మొత్తం కాకపోయినా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మాత్రం మింగుడు పడని విషయంగానే పరిణమించింది.

బిజెపి వైఖరిని జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రకటించడం మరో సున్నితమైన విషయంగా మారింది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని బిజెపి క్లారిటీ ఇవ్వడం తప్పని సరి అయింది. పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని ఖండిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటే అవకాశం కూడా కనిపిస్తున్నది.

చంద్రబాబుపై వ్యతిరేకతే అమరావతిపై కూడానా?

చంద్రబాబునాయుడిని తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజు, అదే వైఖరిని అమరావతి విషయంలోనూ కొనసాగిస్తున్నారు. చంద్రబాబునాయుడు అమరావతిని కావాలంటున్నారు కాబట్టి సోము వీర్రాజు వ్యతిరేకిస్తున్నారని బిజెపిలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

చంద్రబాబునాయుడిపై ఉన్న వ్యతిరేకతను అమరావతిపై చూపించడం ఎంత వరకూ కరెక్టని కూడా బిజెపిలో చర్చ జరుగుతున్నది. అయితే ఈ విషయాలను బాహాటంగా చెబితే ఎవరినైనా పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సోము వీర్రాజు వెనకాడటం లేదు.

ఈ పరిణామాలలో పవన్ ప్రకటనను ఖండించడం గానీ సపోర్టు చేయడం గానీ ఏ బీజేపీ నాయకుడూ చేయడం లేదు. పవన్ కల్యాణ్ బిజెపి అమరావతివైపే ఉందని చెప్పడంపై నిజమో కాదో వెల్లడించాల్సిన సోము వీర్రాను ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ విశ్వసనీయత ఉన్న నాయకుడు కావడం వల్ల ఆయన బిజెపి తనకు మాట ఇచ్చిన విషయాన్ని వెల్లడి చేయగానే ప్రజల్లోకి బలంగా వెళ్లింది.

Related posts

మెమో ఎఫెక్ట్:ఇద్దరు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్

Satyam NEWS

పూలే విగ్రహం ఏర్పాటు కోసం 3న హైదరాబాద్ లో దీక్ష

Satyam NEWS

వైభ‌వంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

Satyam NEWS

Leave a Comment