వార్త కవర్ చేయడానికి వెళ్లిన ప్రజాశక్తి విలేకరి, మహిళా పాత్రికేయురాలు జుత్తుక నాగజ్యోతి పై కొందరు దాడి చేయడాన్ని ఏపిడబ్ల్యూజెఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ హష్మీ ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బృందం కలిసింది.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లను పత్రికల్లో రాయలేని భాషలో బూతులు తిట్టిన సంఘటనపై జనసేన కార్యకర్తలు నిన్న ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో వార్తను కవర్ చేయడానికి విలేకరులు కూడా వెళ్లారు. జనసేన కార్యకర్తలను చంద్రశేఖర్ రెడ్డి మనుషులు అక్కడ నుంచి తరిమి కొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చంద్రశేఖర్ రెడ్డి మనుషులకు సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించారు. ఈ సంఘటనలో కొందరు వ్యక్తులు ప్రజాశక్తి విలేకరిపై దాడికి పాల్పడ్డారు. వారు జనసేన కార్యకర్తలా, చంద్రశేఖర్ రెడ్డి మనుషులా తెలియలేదు.
దాడి చేసిన వారి పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని ఏపిడబ్ల్యూజెఎఫ్ కోరింది. ఫెడరేషన్ బృందం వినతి పై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీ ని కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాద్యక్షులు వాతాడ నవీన్ రాజ్, జిల్లా అధ్యక్షుడు అల్లుమల్లు ఏలియా, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీమ్, జిల్లా సభ్యులు లక్ష్మీ నారాయణ, వారణాసి శ్రీనివాసరావు, సాయి పెరుమాళ్ళు, జగన్మోహన్ రావు తదితరులు ఉన్నారు.