జర్నలిస్టు సురేష్ మనలను విడిచి వెళ్లిపోయాడు. నిజాయితీగా జర్నలిజం వృత్తిధర్మాన్ని పాటించిన సురేష్ గత కొద్ది కాలంగా లివర్ సిరోసిస్ తో ఇబ్బంది పడ్డాడు. నిమ్స్ లో చికిత్స పొందుతూ అతను మరణించాడు. సురేష్ కు భార్య ముగ్గురు పిల్లలు. రిపోర్టర్ గా 10సంవత్సరాలు ఈనాడులో పని చేశాడు. 1 సంవత్సరం ఆంధ్ర ప్రభలో స్టాఫర్ గా వృత్తిధర్మం నిర్వహించాడు. 2సంవత్సరాలు సూర్యలో స్టాఫర్ గా పని చేశాడు. ప్రస్తుతం మన తెలంగాణ లో స్టాఫర్ గా చేస్తూ రెండు నెలల క్రితం కాలు వాచిందని డాక్టర్ కు చూపించేందుకు వెళ్లాడు. అప్పుడు తెలిసింది అది సాధారణమైన అనారోగ్యం కాదు, కాలేయ సంబంధిత వ్యాధి అని. దాంతో ఆ పేరుమోసిన ప్రయివేటు ఆసుపత్రి అతను బిల్లు కట్టలేడని తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు. ఏం చేయాలో తెలియన సురేష్ నిమ్స్ కు వెళ్లాడు. అన్ని టెస్టులూ చేసి లివర్ సిరోసిస్ గా తేల్చారు. లివర్ కు సంబంధించిన వ్యాధి అనగానే జర్నలిస్టు కదా రోజూ తాగుతాడు అనుకుంటారు అందరూ. తాగడం వల్లే లివర్ పాడైపోయిందని అంటుంటారు. అయితే సురేష్ కు అలాంటి అలవాట్లు లేవు. అయినా లివర్ పాడైపోయింది. ఇంట్లో తిండికి, మందులకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. 1 నెల రోజుల పాటు హెల్త్ కార్డు ద్వారానే చికిత్స చేయించుకున్నాడు. లాభం లేకపోయింది. లీవర్ మార్చాలని డాక్టర్లు చెప్పారు. ఎంతో మంది జర్నలిస్టులు తమ వంతు సాయంగా డబ్బు సాయం చేశారు కానీ సురేష్ ప్రాణాన్ని నిలపలేకపోయారు. నిజాయితీగా పని చేసిన సురేష్ ఆస్తులు కూడగట్టుకోలేదు కానీ ఆత్మీయులను సంపాదించుకున్నాడు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వ్యవహారాలను సురేష్ రిపోర్టు చేసేవాడు. సురేష్ ఆత్మకు శాంతి కలగాలని సత్యం న్యూస్ ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నది. ఆయన కుటుంబ సభ్యులకు సత్యం న్యూస్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది
previous post