30.7 C
Hyderabad
April 29, 2024 04: 39 AM
Slider సంపాదకీయం

న్యాయానికి న్యాయం కావాలి మిలార్డ్

#supremecourtofindia

కోర్టు తీర్పులపై వ్యాఖ్యానం చేయాలనే ఆలోచన గతంలో ఎవరికీ ఉండేది కాదు. ఆ తర్వాతి కాలంలో కోర్టు తీర్పులపై కొందరు వ్యాఖ్యానాలు చేయడం మొదలైంది. అలా చేయడం నేరం అని మరికొందరు ముందుకు వచ్చి మందలించేవారు.

ఆ తర్వాతి కాలంలో కోర్టు తీర్పులపై వ్యాఖ్యానాలు చేసే వారిపై కేసులు పెట్టే వారు. ఇప్పుడు ఈ దశలన్నీ దాటిపోయి మరింత బరితెగించే వరకూ వచ్చాం. తీర్పు చెప్పే న్యాయమూర్తి ఏ కులం వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉండగా జడ్జిగా అప్పాయింట్ అయ్యాడు అనే విషయాల్ని బహిరంగంగా చర్చించే స్థితికి వచ్చేశాం.

మన రాజకీయ ప్రయోజనాలకు లేదా మన అభీష్టానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే జడ్జిలను వారి కుటుంబాలను కూడా విమర్శించే స్థాయికి వచ్చేశాం. కోర్టు ధిక్కరణ కేసులు ఫార్సుగా మారే పరిస్థితి తీసుకువచ్చారు అధికారంలో ఉన్నవారు. కోర్టు ధిక్కరణ నేరం ఫ్యాషన్ గా మారిన అత్యంత దురదృష్టకరమైన దశలో ఉన్నాం. న్యాయ సంస్కరణలపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. న్యాయమూర్తుల నియామకాల విధానంపై కూడా చర్చ జరిగింది… జరుగుతున్నది.

తెరచాటు గుసగుసల స్థాయి నుంచి…..

అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలురైన వారిని న్యాయమూర్తులుగా నియమించుకుంటున్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తుంటాయి. ఇవన్నీ తెర చాటు గుసగుసలుగా వినిపించే స్థాయి నుంచి బహిరంగంగా చర్చించే స్థాయికి వచ్చేశాయి.

న్యాయవ్యవస్థపైనే అనుమానం వచ్చే విధంగా గతంలో ఒకరో ఇద్దరో ప్రవర్తించేవారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారే న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని పోగొడుతున్నారు. ఇందుకోసం పకడ్బందిగా వ్యూహం అమలు చేస్తున్నారు. పూర్తి స్థాయి అధికారం, బానిసగా మారిన కార్యనిర్వాహక వ్యవస్థ, బలమైన సోషల్ మీడియా అధికారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తున్నాయి.

న్యాయవ్యవస్థకు కనిపించని గాయాలు చేస్తున్నా….

న్యాయవ్యవస్థపైనే అనుమానం వచ్చే విధంగా చట్టానికి దొరక్కుండా ఎలా ప్రవర్తించాలి? అనే అంశంపై డాక్టరేట్ తెచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. తప్పుడు కేసులు పద్ధతి లేకుండా పెట్టడం దానిపై బాధితుడు కోర్టుకు వెళ్లడం బెయిల్ గానీ ఇతర న్యాయ సహాయం గానీ పొందడం… ఇలా జరగగానే ‘‘ చూశారా ఫలానా కులం వాడు కావడం వల్లే ఇలా జరిగింది’’ అంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేసుకోవడం పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి.

‘‘న్యాయవ్యవస్థను ఫలానా వాడు మేనేజ్ చేస్తున్నాడు’’  అంటూ పుంఖాను పుంఖాలుగా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్న పరిస్థితి కూడా చూశాం…. చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే న్యాయమూర్తి తీర్పు చెప్పగానే ఆయనకు అభియోగాలు అంటగట్టే స్థితికి చేరుకున్నాం.

కేసు పూర్వాపరాలు చూసి న్యాయమూర్తి నిస్పక్షపాతంగా తీర్పు చెప్పారని అనుకునే వాళ్లే తక్కువైపోయారు. మరీ ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కేసుల్లో ఇది కనిపిస్తున్నది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కేసులు దాఖలు చేస్తుంటే కోర్టులు కేసులు కొట్టేయవా? ఇది ఆలోచించేవారే లేరు.

న్యాయవ్యవస్థను నిర్వీర్యపరచే కుట్ర….

రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల్లో న్యాయస్థానం ఆదేశాలు రాగానే ట్రోలింగులు మొదలు పెట్టేస్తున్నారు. ఇది అరికట్టడం సాధ్యం కాదు. అంత యంత్రాంగం కోర్టులకూ ఉండదు… నిస్పక్షపాతంగా వ్యవహరించే వీలు పోలీసు వ్యవస్థకూ ఉండదు. ఇది ఒక ప్రధాన సమస్య.

మరో ప్రధాన సమస్య ఏమిటంటే ప్రభుత్వమే తప్పుడు కేసులు పెట్టి, కేసులు కొట్టేసేలా చేసి ‘‘ ఫలానా వాడు మేనేజ్ చేయడం వల్లే ఇలా జరిగింది’’ అంటూ చెప్పడం. ఇది ఇప్పుడు మరో ప్రధాన సమస్య.  కోర్టులపై విశ్వాసం సన్నగిల్లేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం కావచ్చు.

ఇలాంటి దారుణమైన ఆలోచనా విధానం ఉన్నవారితో ఇప్పుడు సమాజం నిండిపోయి ఉంది. సింగిల్ జడ్జి తీర్పు చెప్పిన తర్వాత డివిజన్ బెంచ్ కి అప్పీలుకు వెళ్లడం న్యాయపరంగా ఎవరికైనా దక్కే వెసులుబాటు. అధికారబలం, ధనబలం ఉన్నవాడికి ఇది ఆటగా మారింది. న్యాయమూర్తికి న్యాయమూర్తి మధ్య తీర్పులు మారడం వల్ల ఇలా జరుగుతున్నదనేది నిర్వివాదాంశం.

‘‘దాదాపుగా ఒకే రకమైన’’ తీర్పు రావాలి

కనీసం స్టేట్ వర్సెస్ కేసుల్లో (అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి పౌరులకు లేదా ఇతర వ్యవస్థలకు మధ్య జరిగే కేసుల్లో) అయినా సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పులకు భిన్నమైన తీర్పులు ఆ తర్వాతి స్థాయిల్లో వచ్చే వీలు లేకుండా ఒక లక్ష్మణ రేఖను న్యాయమూర్తులే గీసుకోవాలి.

రాజకీయ సంబంధిత వ్యాజ్యాల్లో కింది కోర్టుల తీర్పులకు భిన్నమైన తీర్పులు పై కోర్టులు ఇవ్వడం అనే అంశంపై కొన్ని గైడ్ లైన్స్ ఏర్పాటు చేయాలి. ఇలా స్టేట్ వర్సెస్  కేసుల్లో ‘‘దాదాపుగా ఒకే రకమై తీర్పు’’ వచ్చే విధంగా న్యాయమూర్తులు ప్రవర్తించగలిగితే న్యాయవ్యవస్థ కు కొంత మేరకు అదనపు విశ్వసనీయత వస్తుంది.

న్యాయవ్యవస్థ పై విశ్వసనీయత సన్నగిల్లుతున్న (కారణం ఏదైనా)  క్లిష్టసమయంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి రమణ బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ఆది నుంచి న్యాయ సంస్కరణలపైనే దృష్టి కేంద్రీకరించేవారు.

ఇప్పుడూ అదే ఒరవడి కొనసాగించి దేశ న్యాయవ్యవస్థకు సరైన దిక్కు చూపించాలి. రాజ్యాధికారమే న్యాయ వ్యవస్థకు తూట్లు పొడిచే దుష్టపన్నాగాలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా పకడ్బంది చర్యలు తీసుకోవాలి. న్యాయవ్యవస్థ విశ్వసనీయత పెంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, www.satyamnews.net

Related posts

టీడీపీ మహిళా నేతపై వైసీపీ నేతల దురుసు ప్రవర్తన

Satyam NEWS

త్రాగు నీటి ఏద్దడి లేకుండా చర్యలు

Bhavani

ములుగు జిల్లాలో బాలల రక్షణ వారోత్సవాలు

Satyam NEWS

Leave a Comment