ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కార్మికులు సమ్మె బాట విడటం లేదు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సన్నద్ధమయ్యారు. నిన్న జరిగిన సమరభేరి విజయంతో కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు 24 గంటల దీక్ష చేపట్టారు. 27 వ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్ర జెఎసి పిలుపు మేరకు కార్మికులు ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ.. నాడు బ్రిటిష్ పాలనలో గుర్రాలతో తొక్కిస్తే నేడు కేసీఆర్ పాలనలో పోలీసులతో కొట్టిస్తున్నాడని ఆర్టీసీ కార్మికులు అన్నారు. ఆయన కుటుంబంలో బాధలు తాళలేక ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే తమ బాధ తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు సాధించుకునే దిశగా ఎన్ని రోజులైనా నిరాహార దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు.ఇప్పటిదాకా కేసీఆర్ ను తండ్రిలా భావించామని, ఇకనుంచి పాలివానిల పగ తీర్చుకోవడానికి సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పారు. గ్రామ గ్రామాన తిరిగి సర్పంచ్, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులను సమ్మెలో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. అదే సమయంలో కార్మికులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. ఎన్ని రోజులైనా కేసీఆర్ దిగిరాక తప్పదని అన్నారు. ధైర్యంగా హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
previous post