32.7 C
Hyderabad
April 26, 2024 23: 20 PM
Slider నిజామాబాద్

కేసీఆర్ కు షర్మిల భయం పట్టుకుంది

#sharmila

సీఎం కేసీఆర్ కు వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భయం పట్టుకుందని, అందుకే పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కో ఆర్డినేటర్ నీలం రమేష్ అన్నారు. వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులకు నిరసనగా నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని మౌన దీక్ష చేపట్టారు.

అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా నీలం రమేష్ మాట్లాడుతూ.. గత 223 రోజులుగా వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని, 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ ఉనికిని చూస్తూ కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు.

అందుకే కేసీఆర్ అండ్ కో తమపై ఉమ్మడిగా దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. పాదయాత్ర పునః ప్రారంభం కోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని లింక్ పెడుతున్నారని అన్నారు వరంగల్ సిపిని కలిసిన తర్వాత కూడా రాత్రి 11 వరకు అక్కడే ఉంచుకుని పాదయాత్ర నిలిపివేయాలని నోటీసు ఇచ్చారని, ఆ నోటీసుకు ఈరోజు సమాధానం చెప్పడం జరిగిందని, మళ్ళీ రెండు రోజుల సమయం అంటున్నారని తెలిపారు.

పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని నిరంకుశంగా ఆలోచిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఒక మహిళ అని చూడకుండా కారులో ఉండగానే పోలీసులు క్రేన్ తో తీసుకెళ్లారన్నారు. కేసీఆర్ ఉద్యమకారుడు కాబట్టే ఉద్యమం తీరు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే తమ ఉద్యమాన్ని ముందుగానే అణిచివేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

తమ పార్టీ బీజేపీకి బి పార్టీ అంటున్నారని, తమకు ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదన్నారు. ఒక మహిళపై జరిగిన దాడికి బీజేపీ సానుభూతి ప్రకటించిందని, దానిని టిఆర్ఎస్ అనుకూలంగా మలుచుకుని బి పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కాములో కాకుండా ఇతర విషయంలో నోటీసులు వచ్చి ఉంటే తాము సానుభూతి తెలిపేవాళ్ళమన్నారు.

తెలంగాణలో వైఎస్ఆర్టిపి ఒక్కటే రిజిస్టర్ అయి ఉందని, టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో జై తెలంగాణ అనాలో, జై భారత్ అనాలో తెలియని సందిగ్ధంలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏమి చేయలేమని తెలిసిపోయింది కాబట్టే తమ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టిపి కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు తాహెర్, స్వామి, సిద్దయ్య, స్వామి, శ్రీనివాస్, ప్రభాకర్, జావేద్ పాల్గొన్నారు.

Related posts

హెల్మెట్ ధరించి ప్రాణం కాపాడుకోండి

Satyam NEWS

డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో “లాట్స్ ఆఫ్ లవ్” నేడే విడుదల

Satyam NEWS

షాకింగ్: పెళ్లి పీటలపైకి ఎక్కాల్సిన యువకుడి హత్య

Satyam NEWS

Leave a Comment