40.2 C
Hyderabad
April 26, 2024 14: 55 PM
Slider ఆదిలాబాద్

అటవీ ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత మాది

#nirmal

నాలుగు మెడికల్ కాలేజీలతో అదిలాబాద్ జిల్లా వర్థిల్లబోతోందంటే..ఆసిఫాబాద్ లాంటి అటవీ ప్రాంతంలో కూడా ఇవ్వాల మెడికల్ కాలేజి వస్తుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం వల్లనే. ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఉంటే ఇంకో యాభై ఏండ్లకు కూడా వచ్చేది కాదు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

మన కంటే ముందే ఎప్పటినుంచో ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ఉద్ధండులైన రాష్ట్రాలు కంటే ఎంతో ముందంజలో ఉన్నాం. ఇది ఎవరో ఒక్కరు చేస్తే కాలేదు. మనందరి సమిష్టి కృషి వల్లనే సాధ్యమైంది. ఇంతటితోనే మనం పొంగిపోయి ఇంకేం చేయాల్సింది లేదనుకుంటే చాలా పెద్ద తప్పవుతుంది. చాలా పేదరికం ఉంది సమాజంలో. తరతరాలుగా అణిచివేయబడుతున్న దళిత జాతి, ఎన్నో బాధలున్నటువంటి మన గిరిజన జాతి, వెనుకబడిన కులాల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. మత్స్యకారులకు, గొర్రెల పెంపకందారులకు రకరకాల వర్గాలకు కొంత చేసుకున్నాం. కానీ జరగవలసింది ఇంకా చాలా ఉంది. ఇదే పట్టుదల, ఇదే కృషి, ఇదే పద్ధతిలో ఒక తాటి మీద నడిచి మనం ముందుకుపోయి దళితబిడ్డలను, గిరిజన బిడ్డలను, వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి అత్యంత నిరుపేదలను, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలను అందరినీ కూడా ఒక సమానస్థాయిలోకి తెచ్చే స్థితికి మనం పోవాలి. ఒక బాధ్యత మనమీద ఉంటది అని ఆయన అన్నారు.

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అభివృద్ధి కార్యక్రమాల పర్యటన విజయవంతం అయింది. ఆదివారం మద్యాహ్నం ప్రగతిభవన్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం నిర్మల్ జిల్లాలోని గోదావరి సోన్ వంతెన వద్ద ఆగి చిల్లర నాణాలను గోదావరిలోకి జారవిడిచి నదీమ తల్లికి నమస్కరించారు. అక్కడనుండి నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రికి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని కొండాపూర్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి , పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం పూజకార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని చైర్ లో కూర్చుండబెట్టి ఆశిర్వదించి , అభినందనలు తెలిపారు. ఇటివల ఉత్తమ గ్రామ పంచాయితీ గా, రాష్టపతి చేతులమీదుగా అవార్డు అందుకున్న అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం, ముఖరా(కే) గ్రామ సర్పంచ్ గాడ్గే మినాక్షి, ఎంపిటీసీ గాడ్గే సుభాష్ లను సీఎం అభినందించారు. అనంతరం 15 ఎకరాల్లో రూ. 56 కోట్లతో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ ప్రాంగణానికి సీఎం చేరుకున్నారు.

అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వికరించి , పూజా కార్యక్రమాల అనంతరం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ని ప్రారంభించారు. మరో ఎనిమిది అభివృద్ధి కార్యక్రమాల శిలా ఫలకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో చేతివృత్తుల కళాకృతులను (క్రాఫ్ట్స్) ని సీఎం పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ చాంభర్ లో పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిని కలెక్టర్ చైర్ లో కుర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు ముఖ్యమంత్రికి జ్ఞాపికను బహుకరించారు. తరువాత మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కలెక్టరేట్ నిర్మాణంలో భాగస్వామ్యం అయిన ఆర్&బీ అధికారులను సీఎం సత్కరించారు. అనంతరం జిల్లా అధికారులు, సిబ్బంది హాజరైన సమావేశంలో సీఎం ప్రసంగించారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , పభుత్వ  ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,  ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి, రేఖా శ్యామ్ నాయక్, బాపురావు, ధివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, జీవన్ రెడ్డి , జడ్పీ చైర్మన్ కోరిపల్లి విజయ లక్ష్మీ రామ కృష్ణారెడ్డి, కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్ , డైరీ డెవలఫ్ మెంట్ కో-ఆపరేటీవ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్, జడ్పీ చైర్మన్లు కోవా లక్ష్మీ, జనార్థన్ రాథోడ్ , ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, డీఎమ్ఈ రమేష్ రెడ్డి, డీ.సీ.ఎమ్.ఎస్ చైర్మన్ చిప్పన లింగయ్య, డీ.సీ.సీ.బి చైర్మన్ ఏ. బోజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి నిర్మల్ కు వెళ్ళే మార్గంతో పాటు నిర్మల్ పట్టణంలో సీఎం కేసీఆర్ కి ప్రజలు పలుచోట్ల నమస్కరించి, అభివాదం చేస్తూ స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు హాజరై సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సభ అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్ కు చేరుకున్నారు.

Related posts

సాంస్కృతిక కళా రీతులతో ఆకట్టుకుంటున్న హునార్ హాట్

Satyam NEWS

సమన్వయంతో ఇళ్ల పట్టాల పంపిణీని విజయవంతం చేద్దాం

Satyam NEWS

బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తుల తనిఖీ

Satyam NEWS

Leave a Comment